Hyundai i10: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో చిన్న కార్లకు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. ఎస్‌యూవీల హవా ఎంత ఉన్నప్పటికీ, మధ్యతరగతి ప్రజలు ఇప్పటికీ బడ్జెట్ ధరలో లభించే హ్యాచ్‌బ్యాక్ కార్ల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన అత్యంత ప్రజాదరణ పొందిన గ్రాండ్ i10 కారును సరికొత్త నెక్స్ట్-జెన్ అవతారంలో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. కార్టాక్ నివేదిక ప్రకారం, ఈ సరికొత్త మోడల్ 2027 చివరి నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత గ్రాండ్ i10 నియోస్ స్థానాన్ని భర్తీ చేయనుంది.

పెరుగుతున్న చిన్న కార్ల డిమాండ్

సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM) గణాంకాల ప్రకారం.. చిన్న కార్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలు కారు కొనేటప్పుడు ప్రధానంగా దాని ధర, మైలేజ్, మెంటెనెన్స్ ఖర్చుల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని హ్యుందాయ్ సంస్థ రాబోయే కొత్త i10 కారును పూర్తిగా సామాన్యుల బడ్జెట్‌కు తగినట్లుగా తీర్చిదిద్దుతోంది. ఈ కారును ఎస్‌యూవీలా మార్చకుండా, దాని ఒరిజినల్ హ్యాచ్‌బ్యాక్ లుక్, కంఫర్ట్‌ను అలాగే ఉంచుతూ సరికొత్త ప్లాట్‌ఫారమ్, మోడ్రన్ ఎక్స్‌టీరియర్ డిజైన్‌తో తీసుకురానున్నారు.

పవర్ఫుల్ ఇంజిన్, అద్భుతమైన మైలేజ్

ఈ నెక్స్ట్-జెన్ హ్యుందాయ్ i10 కార్లో ప్రస్తుతమున్న 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించనుంది. ముఖ్యంగా కారు మైలేజీని మరింత మెరుగుపరచడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టింది. పెట్రోల్ వెర్షన్‌తో పాటు రోజువారీ ప్రయాణాలు చేసేవారి కోసం ప్రత్యేకంగా సీఎన్జీ వేరియంట్‌ను కూడా ఇందులో ప్రధానంగా అందించనున్నారు. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ కోరుకునేవారికి చక్కటి ఆప్షన్‌గా మారుతుంది.

మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నాహాలు

ప్రస్తుత మార్కెట్లో మారుతి సుజుకికి చెందిన వ్యాగన్‌ఆర్, స్విఫ్ట్ కార్లు విపరీతమైన అమ్మకాలను సొంతం చేసుకుంటున్నాయి. వాటికి గట్టి పోటీ ఇవ్వడమే లక్ష్యంగా హ్యుందాయ్ తన కొత్త i10 కారు లోపలి స్థలాన్ని, సీటింగ్ సౌకర్యాన్ని మరింత మెరుగుపరుస్తోంది. 2019 నుంచి మార్కెట్లో ఉన్న గ్రాండ్ i10 నియోస్‌కు ఇది సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా రానుండటంతో ఆటోమొబైల్ రంగంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story