Hyundai Sales : హ్యుందాయ్ కంపెనీకి హిస్టరీలోనే పెద్ద షాక్ ఉండదు..ఈ కారును కొన్నది కేవలం ఇద్దరే
ఈ కారును కొన్నది కేవలం ఇద్దరే

Hyundai Sales : భారతదేశ ఆటోమొబైల్ రంగంలో హ్యుందాయ్ అంటే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. ముఖ్యంగా క్రెటా, వెన్యూ వంటి మోడళ్లతో మార్కెట్‌ను ఏలుతున్న ఈ సంస్థకు ఒక కారు విషయంలో మాత్రం గడ్డుకాలం ఎదురవుతోంది. ఆశ్చర్యకరంగా, 2026 జనవరి నెలలో హ్యుందాయ్కి చెందిన అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు అయోనిక్ 5 కేవలం 2 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. గత ఏడాది ఇదే నెలలో 16 యూనిట్లు అమ్ముడవగా, ఇప్పుడు ఆ సంఖ్య దారుణంగా పడిపోవడం కంపెనీ వర్గాలను కలవరపెడుతోంది.
హ్యుందాయ్ పోర్ట్‌ఫోలియోలో క్రెటా ఇప్పటికీ రారాజులా దూసుకుపోతోంది. గత నెలలో 17,921 క్రెటా కార్లు అమ్ముడై హ్యుందాయ్ గౌరవాన్ని కాపాడాయి. కానీ, రూ.46 లక్షలకు పైగా ధర కలిగిన అయోనిక్ 5 మాత్రం కస్టమర్లను ఆకర్షించలేకపోతోంది. గత ఆరు నెలల గణాంకాలను గమనిస్తే.. డిసెంబర్ 2025లో 69 యూనిట్లు అమ్ముడై ఆశలు చిగురించినప్పటికీ, కొత్త ఏడాది ప్రారంభంలోనే ఈ మోడల్ అమ్మకాలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడం గమనార్హం.
అయోనిక్ 5 కారులో టెక్నాలజీకి కొదవ లేదు. 12.3-ఇంచ్ భారీ టచ్‌స్క్రీన్, లెవల్ 2 ADAS సేఫ్టీ ఫీచర్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇలా అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా దీని బ్యాటరీ పవర్ అదిరిపోతుంది. 72.6kWh బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కేవలం 18 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ అయ్యే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఇంతటి హైటెక్ ఫీచర్లు ఉన్నా, ధర ఎక్కువగా ఉండటం, లగ్జరీ సెగ్మెంట్లో పోటీ పెరగడం వల్ల అమ్మకాలు దెబ్బతింటున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అమ్మకాలు పడిపోతున్న నేపథ్యంలో హ్యుందాయ్ తన అయోనిక్ 5 మోడల్‌పై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఫిబ్రవరి 2026లో ఈ కారును కొనుగోలు చేసే వారికి ఏకంగా రూ.5.05 లక్షల వరకు ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఇందులో రూ.5 లక్షల వరకు నగదు తగ్గింపుతో పాటు, రూ.5,000 స్క్రాప్పేజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్లు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే వర్తిస్తాయి.
ఒకవైపు టాటా, మహీంద్రా వంటి కంపెనీలు బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తుండగా, హ్యుందాయ్ అయోనిక్ 5 కేవలం ప్రీమియం కస్టమర్లకే పరిమితమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హ్యుందాయ్ తన సేల్స్ స్ట్రాటజీని మార్చుకోకపోతే, ఈ ఫ్యూచరిస్టిక్ కారు షోరూమ్‌లకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.

