Sunroof Cars : కొన్నేళ్ల క్రితం వరకు సన్‌రూఫ్ అనేది కేవలం రూ.50 లక్షలు లేదా కోటి రూపాయల పైచిలుకు ఉండే లగ్జరీ కార్లకు మాత్రమే పరిమితమైన ఒక ఖరీదైన ఫీచర్. కానీ ఇప్పుడు కాలం మారింది. భారతదేశంలో సామాన్యుల బడ్జెట్ కార్ల నుంచి మిడ్-సైజ్ ఎస్‌యూవీల వరకు సన్‌రూఫ్ అనేది ఒక తప్పనిసరి ఫీచర్‌గా మారిపోయింది. ముఖ్యంగా యువ కొనుగోలుదారులు కారు ఎంచుకునే సమయంలో సన్‌రూఫ్ ఉందో లేదో అని ప్రత్యేకంగా చూస్తున్నారు. ఈ మార్పు కారణంగా నేడు భారతదేశంలో అమ్ముడవుతున్న ప్రతి నాలుగు కొత్త కార్లలో ఒక కారు సన్‌రూఫ్‌తోనే రోడ్డెక్కుతోంది.

సన్‌రూఫ్ సేల్స్‌లో హ్యుందాయ్ టాప్

ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జాటో డైనమిక్స్ విడుదల చేసిన డేటా ప్రకారం.. సన్‌రూఫ్ కార్లను విక్రయించడంలో దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్ భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం.. హ్యుందాయ్ ఇండియాలో విక్రయించే మొత్తం కార్లలో ఏకంగా 55% కంటే ఎక్కువ కార్లు సన్‌రూఫ్ ఫీచర్‌తోనే సేల్ అవుతున్నాయి. అంటే హ్యుందాయ్ అమ్మే ప్రతి రెండు కార్లలో ఒకదానికి సన్‌రూఫ్ ఉందన్నమాట. మరోవైపు, దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఈ విషయంలో చాలా వెనుకబడి ఉంది. మారుతి విక్రయించే కార్లలో 5% కంటే తక్కువ కార్లకు మాత్రమే సన్‌రూఫ్ లభిస్తోంది. మారుతి ఇప్పటికీ సింపుల్, తక్కువ బడ్జెట్ కార్లకే ప్రాధాన్యత ఇస్తుండడమే దీనికి కారణం.

ఎస్‌యూవీలతో పెరిగిన సన్‌రూఫ్ క్రేజ్

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీల విక్రయాలు పుంజుకోవడంతో సన్‌రూఫ్‌లకు డిమాండ్ రెట్టింపైంది. నివేదికల ప్రకారం.. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం ఎస్‌యూవీలలో సుమారు 85% కార్లు సన్‌రూఫ్‌తోనే మార్కెట్లోకి వస్తున్నాయి. కొనుగోలుదారులు కేవలం మైలేజ్, ఇంజిన్ మైలేజ్ మాత్రమే కాకుండా కారు లుక్, లోపలి కేబిన్ ప్రీమియం ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. హ్యుందాయ్ కి చెందిన క్రెటా, వెన్యూ, ఎక్స్‌టర్ వంటి ఎస్‌యూవీలలో సన్‌రూఫ్ వేరియంట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది.

పానోరమిక్ సన్‌రూఫ్‌లకు జై కొడుతున్న కస్టమర్లు

సాధారణ సింగిల్-పేన్ సన్‌రూఫ్‌ల కంటే పెద్దగా ఉండే పానోరమిక్ సన్‌రూఫ్‌ల వైపు భారతీయులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. పానోరమిక్ సన్‌రూఫ్ కారు పైకప్పు అంతా విస్తరించి ఉండటం వల్ల కేబిన్ చాలా విశాలంగా, వెలుతురుతో ప్రీమియమ్‌గా కనిపిస్తుంది. గత కొన్నేళ్లలో పానోరమిక్ సన్‌రూఫ్ ఉన్న కార్ల విక్రయాల వాటా రెట్టింపు కంటే ఎక్కువ కావడం ఈ ఫీచర్‌కు ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోంది.

ధరలు తగ్గడం.. సోషల్ మీడియా ప్రభావం

గతంలో సన్‌రూఫ్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడం వల్ల దాని ఖరీదు ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు భారత్‌లోనే స్థానికంగా సన్‌రూఫ్ విడిభాగాలను తయారు చేస్తుండటంతో తయారీ వ్యయం గణనీయంగా తగ్గింది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు బడ్జెట్ ధరలకే సన్‌రూఫ్ మోడళ్లను అందించగలుగుతున్నాయి. దీనికి తోడు రోడ్ ట్రిప్‌లు, సోషల్ మీడియా రీల్స్, ఫొటోషూట్‌ల క్రేజ్ పెరగడం కూడా ఈ ఫీచర్ యువతకు మొదటి ప్రాధాన్యతగా మారడానికి ప్రధాన కారణమైంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story