Hyundai Venue : భారతదేశపు ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన హ్యుందాయ్ వెన్యూ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశీయ మార్కెట్లో అమ్మకాల పరంగా ఈ కారు సరికొత్త మైలురాయిని అధిగమించింది. మే 2019లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు, మే 2026 చివరి నాటికి ఏకంగా 8 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడై రికార్డు నెలకొల్పింది. గత ఏడేళ్ల కాలంలో మొత్తం 8,02,221 వెన్యూ కార్లను భారతీయులు కొనుగోలు చేయడం విశేషం. హ్యుందాయ్ కంపెనీ కార్లలో క్రెటా తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా వెన్యూ నిలిచింది.

విదేశాల్లోనూ వెన్యూ కారు హవా

భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోనూ హ్యుందాయ్ వెన్యూ కారుకు విపరీతమైన క్రేజ్ ఉంది. భారతదేశం నుంచి ఇప్పటివరకు 55,000 కంటే ఎక్కువ వెన్యూ కార్లను కంపెనీ విదేశాలకు ఎగుమతి చేసింది. ఈ విధంగా చూసుకుంటే భారత్, విదేశీ మార్కెట్లను కలిపి ఇప్పటివరకు మొత్తం 8.5 లక్షల కంటే ఎక్కువ వెన్యూ కార్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర రూ.8 లక్షలుగా ఉండగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ.15.65 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కంపెనీ దీనిని మొత్తం 26 వేరియంట్లలో విక్రయిస్తోంది.

పోటీదారులకు చెక్ పెడుతూ దూకుడు

భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ అనేది అత్యంత కఠినమైన పోటీతో కూడుకున్నది. ఈ విభాగంలో టాటా పంచ్, టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, మారుతి ఫ్రాంక్స్, మహీంద్రా XUV 3XO, హ్యుందాయ్ ఎక్స్టర్, టయోటా టైజర్, కియా సిరోస్, స్కోడా కైలాక్ వంటి ఎన్నో బలమైన కార్లు పోటీగా ఉన్నాయి. ఇంత భారీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ, హ్యుందాయ్ వెన్యూ తనదైన ప్రత్యేక శైలి, నమ్మకమైన పర్ఫార్మెన్స్‌తో కస్టమర్ల మొదటి ఎంపికగా నిలుస్తూ వస్తోంది.

కొత్త జనరేషన్ మోడల్‌లో అదిరిపోయే స్పేస్

హ్యుందాయ్ కంపెనీ ఇప్పుడు వెన్యూ కారును సరికొత్త సెకండ్ జనరేషన్ రూపంలో తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్‌ను మహారాష్ట్రలోని తలేగావ్‌లో ఉన్న హ్యుందాయ్ కొత్త ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. పాత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త వెన్యూ కారు పరిమాణంలో మరింత పెద్దదిగా, మరింత ఆకర్షణీయంగా మారింది. దీని ఎత్తును 48 మిమీ, వెడల్పును 30 మిమీ మేర పెంచారు. అలాగే దీని వీల్‌బేస్ కూడా 20 మిమీ పెరిగి 2520 మిమీగా మారింది. దీనివల్ల కారు లోపల కూర్చోవడానికి లెగ్‌రూమ్, హెడ్‌రూమ్, బూట్ స్పేస్ చాలా ఎక్కువగా లభిస్తాయి.

పవర్‌ఫుల్ ఇంజన్లు, అదిరిపోయే మైలేజ్

ఇంజన్ విషయానికి వస్తే.. హ్యుందాయ్ వెన్యూలో కంపెనీ రెండు రకాల పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను అందిస్తోంది. మొదటిది 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కాగా, ఇది 83 హార్స్‌పవర్ శక్తిని ఇస్తుంది. దీని మైలేజ్ లీటరుకు 18.05 కిలోమీటర్లుగా ఉంది. ఇక రెండోది వెన్యూ N లైన్ మోడల్‌లో లభించే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది ఏకంగా 120 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మాన్యువల్ వేరియంట్ లీటరుకు 18.74 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, డీసీటీ ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు ఏకంగా 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇవే కాకుండా 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది, ఇది లీటరుకు 20.99 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

లగ్జరీ ఫీచర్లు, 5-స్టార్ సేఫ్టీ

సరికొత్త హ్యుందాయ్ వెన్యూ కారులో కస్టమర్లను ఆకట్టుకునేలా రెండు పెద్ద 12.3 ఇంచుల కర్వ్‌డ్ స్క్రీన్లు, కొత్త డిజైన్ ఉన్న స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. ఇక సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, అధునాతన లెవెల్-2 ADAS ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే, ఈ కారు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో అత్యుత్తమ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుని దేశంలోనే అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story