Hyundai Venue HX5+ : హుందాయ్ వెన్యూ కొత్త అవతారం..రూ.10 లక్షలకే లగ్జరీ ఫీచర్ల జాతర!
రూ.10 లక్షలకే లగ్జరీ ఫీచర్ల జాతర!

Hyundai Venue HX5+ : భారతీయ రోడ్లపై కాంపాక్ట్ ఎస్‌యూవీల హవా కొనసాగిస్తున్న హుందాయ్ వెన్యూ ఇప్పుడు మరింత కొత్తగా, అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. ఇటీవలే 2026 వెన్యూ మోడల్‌ను పరిచయం చేసిన హుందాయ్, కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తన వేరియంట్లలో కీలక మార్పులు చేసింది. అందులో భాగంగానే సరికొత్త HX5+ మోడల్‌ను లాంచ్ చేసింది. రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో లగ్జరీ ఫీచర్లు కోరుకునే వారికి ఈ వేరియంట్ ఒక వరంలా మారబోతోంది.
హుందాయ్ వెన్యూ లైనప్‌లో ఇప్పుడు HX5+ అనే కొత్త వేరియంట్ వచ్చి చేరింది. దీనిని HX5 మోడల్‌కు పైన, HX6 మోడల్‌కు కింద పొజిషన్ చేశారు. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.9,99,900గా నిర్ణయించారు. ఈ ధరలో ఇది కస్టమర్లకు అందించే ఫీచర్లు నిజంగా అద్భుతం అని చెప్పాలి. కేవలం ధర మాత్రమే కాకుండా, సౌకర్యం, సేఫ్టీలో కూడా హుందాయ్ ఈ మోడల్‌లో టాప్ క్లాస్ ప్రాధాన్యతనిచ్చింది.
కొత్త వెన్యూ HX5+ వేరియంట్ ప్రస్తుతం 1.2 లీటర్ కప్పా నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 82 bhp పవర్, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. సిటీ డ్రైవింగ్‌కు, ఫ్యామిలీతో లాంగ్ జర్నీలకు ఈ ఇంజిన్ చాలా స్మూత్ పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. అయితే టర్బో పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ కావాలనుకునే వారు దీనికి కింద ఉండే HX5 వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. ఎందుకంటే అందులో ఎక్కువ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.
HX5+ వేరియంట్‌లో హుందాయ్ ఎన్నో ప్రీమియం ఫీచర్లను జోడించింది. ఇందులో కొత్తగా క్వాడ్ బీమ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, రూఫ్ రైల్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎండాకాలంలో వెనుక కూర్చునే వారికి ఉపశమనం కలిగించేందుకు రియర్ విండో సన్‌షేడ్స్ కూడా ఇచ్చారు. వీటితో పాటు స్టోరేజ్ బాక్స్‌తో కూడిన ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, రియర్ వాషర్, వైపర్, డ్రైవర్ విండో ఆటో అప్/డౌన్ వంటి సౌకర్యాలు ఈ కారును సెగ్మెంట్‌లో బెస్ట్‌గా నిలబెడుతున్నాయి.
కేవలం HX5+ మాత్రమే కాకుండా, హుందాయ్ తన ఎంట్రీ లెవల్ HX4 వేరియంట్‌లో కూడా ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. కస్టమర్ల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్ ఫీచర్‌ను ఇప్పుడు HX4 వేరియంట్ నుంచి కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇది తక్కువ ఎత్తు ఉన్న డ్రైవర్లకు ఎంతో మేలు చేస్తుంది. మొత్తానికి 2026 హుందాయ్ వెన్యూ ఇప్పుడు సరికొత్త హంగులతో టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైపోయింది.

