విక్రయాల్లో 43 శాతం పడిపోయిన హ్యుందాయ్ సెడాన్

Hyundai Verna :భారతీయ రోడ్లపై హ్యుందాయ్ కార్లంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్. ముఖ్యంగా ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా గత నెల (ఫిబ్రవరి 2026)లో ఏకంగా 18,000 యూనిట్ల విక్రయాలతో రికార్డు సృష్టించింది. హ్యుందాయ్ వెన్యూ కూడా 10,000 మందికి పైగా కస్టమర్లను ఆకట్టుకుని దూసుకుపోతోంది. అయితే, ఎస్‌యూవీలు ఇంతలా సందడి చేస్తున్నా.. హ్యుందాయ్ గర్వంగా చెప్పుకునే లెజెండరీ సెడాన్ వెర్నా మాత్రం విక్రయాల్లో వెనుకబడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

విక్రయాల్లో 43 శాతం పతనం

గత నెలలో హ్యుందాయ్ వెర్నా కేవలం 694 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. గతేడాది ఫిబ్రవరి (2025)లో 1,207 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది ఏకంగా 43 శాతం తగ్గుదల నమోదైంది. వాస్తవానికి హ్యుందాయ్ తన వెర్నా 2026 మోడల్‌ను అదిరిపోయే ఫీచర్లు, కొత్త హంగులతో మార్కెట్లోకి తెచ్చినప్పటికీ, కస్టమర్లు మాత్రం ఎస్‌యూవీల వైపే మొగ్గు చూపుతున్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ టెక్నాలజీ, లగ్జరీ పరంగా వర్నా ఇప్పటికీ సెడాన్ సెగ్మెంట్‌లో రారాజుగానే ఉంది.

ప్రీమియం ఇంటీరియర్

కొత్త వెర్నా 2026 లోపల అడుగుపెడితే ఏదో లగ్జరీ విమానంలో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. ఇందులో డి-కట్ స్టీరింగ్ వీల్, ప్రీమియం లెదర్ సీట్లు ఉన్నాయి. డ్రైవర్ సీటుకు 8-వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్, మెమరీ ఫంక్షన్ ఇవ్వగా, పక్కన కూర్చునే ప్రయాణికుడి సీటుకు 4-వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్ సౌకర్యం ఉంది. డ్యాష్‌బోర్డ్‌పై 10.25-అంగుళాల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ క్లస్టర్ హైలైట్‌గా నిలుస్తాయి. ఇక 8-స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు మీ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి.

పవర్ఫుల్ ఇంజన్.. అదిరిపోయే వేగం

పర్ఫార్మెన్స్ విషయంలో హ్యుందాయ్ ఎక్కడా తగ్గలేదు. ఈ కారు రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఒకటయితే, వేగాన్ని ఇష్టపడే వారి కోసం 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ టర్బో ఇంజన్ ఏకంగా 160bhp పవర్, 253Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్, IVT, 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు జతచేశారు.

సేఫ్టీలో రాజీ లేదు

సేఫ్టీకి పెద్దపీట వేస్తూ హ్యుందాయ్ ఇందులో స్మార్ట్‌సెన్స్ లెవల్ 2 ADAS టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఇందులో 20కి పైగా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఇన్‌బిల్ట్ డాష్‌క్యామ్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి మొత్తం 75కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఇంతటి హైటెక్ ఫీచర్లు ఉన్న ఈ కారు టాప్ మోడల్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 18.25 లక్షల వరకు ఉంది. హోండా సిటీ, స్కోడా స్లావియా వంటి కార్లకు ఇది గట్టి పోటీనిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story