Hyundai : భారత్‌లో హ్యుందాయ్ మెగా ప్లాన్.. తమిళనాడులో రూ.26,000 కోట్లతో భారీ ఈవీ హబ్
తమిళనాడులో రూ.26,000 కోట్లతో భారీ ఈవీ హబ్

Hyundai : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎలక్ట్రిక్ కార్ల స్థానిక ఉత్పత్తిని మరింత వేగవంతం చేసేందుకు హ్యుందాయ్ ఇండియా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడు రాష్ట్రాన్ని భారతదేశంలోనే తన ప్రధాన ఈవీ హబ్‌గా మార్చబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచడంతో పాటు, స్థానిక సప్లయర్ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని కంపెనీ భావిస్తోంది.
హ్యుందాయ్ సంస్థ తన వ్యూహాత్మక ప్రణాళికలలో భాగంగా ఈ ఏడాదిలోనే చెన్నై ప్లాంట్ నుంచి రెండు సరికొత్త కార్లను లాంచ్ చేయడానికి సర్వం సిద్ధం చేస్తోంది. ఈ రెండు మోడళ్లలో ఒకటి సాధారణ మధ్యతరగతి వినియోగదారులను టార్గెట్ చేస్తూ, బడ్జెట్ ధరలో అందుబాటులోకి రానున్న పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారు కావడం విశేషం. దీనితో పాటు, తమిళనాడులో ఇప్పటికే ఒక బ్యాటరీ సబ్-అసెంబ్లీ యూనిట్‌ను కూడా కంపెనీ విజయవంతంగా ఏర్పాటు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యంత కీలకమైన విడిభాగాలను కూడా ఇకపై భారతదేశంలోనే తయారు చేసేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది.
రాబోయే 5 నుండి 6 సంవత్సరాలలో తన ఈవీ, సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాలలో స్థానిక విడిభాగాల వినియోగాన్ని 82 శాతం నుంచి ఏకంగా 90 శాతానికి పెంచాలని హ్యుందాయ్ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే భవిష్యత్తులో హ్యుందాయ్ కార్లలో వాడే దాదాపు అన్ని విడిభాగాలు భారత్‌లోనే తయారవుతాయి. దీని కోసం తమిళనాడులోని స్థానిక సప్లయర్ల నుంచి కొనుగోళ్లను భారీగా పెంచనున్నారు. దీనివల్ల సుమారు రూ.4,000 కోట్ల అదనపు వ్యాపారం జరగడమే కాకుండా, దాదాపు 2,000 మంది స్థానిక యువతకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
పెట్టుబడులు మరియు ఉద్యోగాలతో పాటు, మానవ వనరుల అభివృద్ధిపై కూడా హ్యుందాయ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇందుకోసం హ్యుందాయ్ ఇండియా, తమిళనాడు ప్రభుత్వం సంయుక్తంగా ఒక అధునాతన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించనున్నాయి. ఈ ప్రోగ్రాం ద్వారా యువతకు ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికత, హైడ్రోజన్ మొబిలిటీ, రోబోటిక్స్, ఆటోమేషన్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత తయారీ రంగాలలో అత్యాధునిక శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణా కార్యక్రమం డిసెంబర్ 2027 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
తమిళనాడును భారతదేశంలోనే ఒక ప్రముఖ ఆటోమొబైల్, ఈవీ తయారీ కేంద్రంగా మార్చడమే తమ అంతిమ ఉద్దేశమని హ్యుందాయ్ స్పష్టం చేసింది. ఈ దీర్ఘకాలిక లక్ష్యం కోసం 2023 నుంచి 2032 మధ్య కాలంలో తమిళనాడు రాష్ట్రంలో రూ.26,000 కోట్లకు పైగా భారీ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ మరోసారి పునరుద్ఘాటించింది. ఈ భారీ పెట్టుబడితో రాబోయే రోజుల్లో భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవం రాబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

