Hyundai : ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో హ్యుందాయ్ సునామీ.. ఒకేసారి ఐదు కొత్త కార్ల అరంగేట్రం
ఒకేసారి ఐదు కొత్త కార్ల అరంగేట్రం

Hyundai : భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో నంబర్-2 స్థానంలో ఉన్న దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ తన పట్టును మరింత బిగించేందుకు భారీ స్కెచ్ వేసింది. ఇటీవల హ్యుందాయ్ వెన్యూ కారుకు భారత్ NCAP లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ రావడం ఆ కంపెనీకి పెద్ద బూస్ట్‌ని ఇచ్చింది. ఇదే జోరులో రానున్న రెండేళ్లలో అదిరిపోయే కొత్త మోడళ్లను రోడ్ల మీదకు తీసుకురావడానికి హ్యుందాయ్ సిద్ధమైంది. ఆ క్రేజీ అప్‌డేట్స్ ఇవే:
హ్యుందాయ్ నుంచి వచ్చిన పాపులర్ కాంపాక్ట్ SUV వెన్యూ ఇప్పుడు భారతీయ వినియోగదారులకు అత్యంత సురక్షితమైన ఆప్షన్‌గా మారింది. భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో వెన్యూ, వెన్యూ ఎన్-లైన్ మోడళ్లు 5-స్టార్ రేటింగ్‌ను సాధించాయి. అడల్ట్ ప్రొటెక్షన్‌లో 32కి 31.15 పాయింట్లు, చైల్డ్ ప్రొటెక్షన్‌లో 49కి 44.46 పాయింట్లు సాధించి తన సత్తా చాటింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి 30కి పైగా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న ఈ కారు, సేఫ్టీ విషయంలో టాటా నెక్సాన్‌కు గట్టి పోటీ ఇస్తోంది.
మారుతి ఫ్రాంక్స్‌కు పోటీగా బేయాన్
మారుతి సుజుకి ఫ్రాంక్స్ సృష్టించిన ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి హ్యుందాయ్ తన బేయాన్ క్రాస్ఓవర్‌ను భారత్‌కు తీసుకువస్తోంది. ఇది సబ్-4 మీటర్ సెగ్మెంట్లో ఎక్స్‌టర్, వెన్యూ మధ్యలో ఉండే అవకాశం ఉంది. స్పోర్టీ లుక్, టర్బో పెట్రోల్ ఇంజన్, అదిరిపోయే ఇంటీరియర్లతో ఈ కారు రూపొందుతోంది. అక్టోబర్ 2026 నాటికి ఇది ఇండియన్ రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా ఉండే అవకాశం ఉంది.
7-సీటర్ సెగ్మెంట్లో స్టార్‌గేజర్ ఎంట్రీ
కియా క్యారెన్స్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన హ్యుందాయ్ స్టార్‌గేజర్ ఎంపీవీ త్వరలో లాంచ్ కానుంది. ఇది ఇండోనేషియా వంటి దేశాల్లో ఇప్పటికే సూపర్ సక్సెస్ అయ్యింది. 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో రాబోతున్న ఈ కారులో డ్యూయల్ స్క్రీన్ సెటప్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి. దీని ధర రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.
ఆఫ్-రోడ్ SUV, సరికొత్త ఎలక్ట్రిక్ ప్లాన్
సాహసాలు ఇష్టపడే వారి కోసం హ్యుందాయ్ ఒక పక్కా ఆఫ్-రోడ్ SUVపై పనిచేస్తోంది. ఇది బాక్సీ డిజైన్, ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో రానుంది. దీంతో పాటు టాటా నెక్సాన్ ఈవీకి పోటీగా సరికొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVని కూడా హ్యుందాయ్ సిద్ధం చేస్తోంది. దీనికి ఇన్‌స్టర్ లేదా వెన్యూ ఈవీ అని పేరు పెట్టే అవకాశం ఉంది. అలాగే, లగ్జరీ సెగ్మెంట్లో 7-సీటర్ హైబ్రిడ్ SUV అయిన పాలిసేడ్ ను మే 2026లో విడుదల చేసేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది.

