E20 Petrol : ఇథనాల్ పెట్రోల్‌తో ఇంజిన్ ఫెయిల్ అయితే క్లెయిమ్ రిజెక్ట్.. భీమా కంపెనీల కొత్త మెలిక
భీమా కంపెనీల కొత్త మెలిక

E20 Petrol : మీరు ఏప్రిల్ 2023 కంటే ముందు కొనుగోలు చేసిన పాత కారును వాడుతున్నారా? అయితే ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న కొత్త E20 పెట్రోల్ మీ జేబుకు భారీగా చిల్లు పెట్టే ప్రమాదం ఉంది. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటైన ICICI లాంబార్డ్ ఇటీవల తన అధికారిక బ్లాగ్‌లో పాత కార్ల యజమానులను భయపెట్టే ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది. ఇథనాల్ పెట్రోల్ వాడకం వల్ల పాత కార్ల ఇంజిన్ దెబ్బతింటే, దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను కంపెనీలు రిజెక్ట్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. మీడియాలో ఈ వార్త హల్ చల్ చేయడంతో కంపెనీ తన బ్లాగ్ నుంచి ఈ భాగాన్ని తొలగించినప్పటికీ, లక్షలాది మంది వాహనదారుల్లో అప్పుడే ఆందోళన మొదలైంది.
పాత ఇంజిన్లకు ఇథనాల్ ఎందుకు డేంజర్?
భారతదేశ ఆటోమొబైల్ రంగానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. ఏప్రిల్ 2023 నుంచి మాత్రమే దేశంలో E20 ఇథనాల్ ఇంధనానికి అనుకూలంగా ఉండే వాహనాల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీని అర్థం ఏంటంటే.. ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న మెజారిటీ పాత వాహనాలు ఈ హై-ఇథనాల్ పెట్రోల్ కు తగినట్లుగా డిజైన్ చేయబడలేదు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్ సరఫరా అవుతోంది. సాధారణ లేదా పాత మోడల్ E10 పెట్రోల్ దొరకడం చాలా కష్టంగా మారింది. ఇథనాల్ పర్యావరణానికి మంచిదే అయినప్పటికీ, పాత ఇంజిన్లలోని రబ్బర్ సీల్స్, ఫ్యూయల్ లైన్స్, ఇతర కీలక భాగాలను ఇది క్రమక్రమంగా కరిగించి, తుప్పు పట్టేలా చేస్తుంది. ఈ నష్టం ఒక రోజులో తెలియదు, లోపల నెమ్మదిగా జరిగి చివరకు ఇంజిన్‌ను పూర్తిగా పాడు చేస్తుంది.
ఇన్సూరెన్స్ పాలసీల్లోని అసలు మెలిక ఇదే
గతంలో ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల వాహనాల ఇన్సూరెన్స్ పాలసీలు రద్దు కావని స్పష్టం చేసిన మాట వాస్తవమే. కానీ, ఇక్కడే ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తున్నాయి. సాధారణ ఇన్సూరెన్స్ పాలసీల నిబంధనల ప్రకారం కన్సిక్వెన్షియల్ డ్యామేజ్ (అంటే కాలక్రమేణా నెమ్మదిగా జరిగే నష్టం లేదా అరిగిపోవడం) కు ఇన్సూరెన్స్ కవరేజ్ లభించదు. ఒకవేళ వాహనదారుడు తన కారుకు E20 పెట్రోల్ సెట్ కాదని తెలిసి కూడా దాన్నే వాడితే.. ఇన్సూరెన్స్ కంపెనీలు దాన్ని కస్టమర్ నిర్లక్ష్యం లేదా అనుచిత వాడకం కింద జమకట్టి క్లెయిమ్‌ను ఈజీగా రిజెక్ట్ చేయవచ్చు.
యాడ్-ఆన్ కవర్లు ఉన్నా లాభం లేదు
చాలా మంది కార్ల యజమానులు తాము అదనపు డబ్బులు చెల్లించి ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్ కవరేజ్ తీసుకున్నాము కాబట్టి మాకేం భయం లేదు అనుకుంటారు. కానీ ఇక్కడే మరో పెద్ద ప్యాచ్ ఉంది. ఈ ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్లు సాధారణంగా వరద నీరు ఇంజిన్ లోకి చేరడం లేదా ఆయిల్ లీకేజీల వల్ల జరిగే నష్టానికి మాత్రమే వర్తిస్తాయి. ఇంధనంలో జరిగే కెమికల్ రియాక్షన్లు లేదా తుప్పు పట్టడం వల్ల జరిగే నష్టాలను ఇవి కవర్ చేయవు. దీనివల్ల ఇన్సూరెన్స్ కంపెనీలతో పాటు కారు తయారు చేసిన కంపెనీ కూడా ఇంజిన్ వారంటీ క్లెయిమ్‌ను తిరస్కరించే ప్రమాదం ఉంది.
ఖరీదైన పెట్రోలే ఏకైక మార్గమా?
ఈ తీవ్రమైన సమస్య నుంచి పాత కార్లను రక్షించుకోవడానికి ఐసీఐసీఐ లోంబార్డ్ ఒక ఖరీదైన సలహా ఇచ్చింది. బంకుల్లో దొరికే సాధారణ పెట్రోల్ కాకుండా ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ (ఉదాహరణకు XP95 వంటివి) వాడాలని సూచించింది. ఈ ప్రీమియం పెట్రోల్‌లో ఇథనాల్ శాతం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది పాత ఇంజిన్లకు సురక్షితం. కానీ దీని ధర సాధారణ పెట్రోల్ కంటే చాలా ఎక్కువగా ఉండటం వల్ల వాహనదారులపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. మరోవైపు, విదేశీ ముడి చమురు దిగుమతులు తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం E22 నుంచి E30 వరకు ఇథనాల్ బ్లెండింగ్‌ను ముమ్మరంగా ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో పాత వాహనదారులు తమ కారు ఇంజిన్ భద్రతకు, పెట్రోల్ బడ్జెట్‌కు మధ్య నలిగిపోతున్నారు.

