Auto Sales : భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త చరిత్ర.. ఒకే ఒక్క నెలలో రికార్డు స్థాయిలో అమ్ముడైన వాహనాలు
ఒకే ఒక్క నెలలో రికార్డు స్థాయిలో అమ్ముడైన వాహనాలు

Auto Sales : భారతదేశపు ఆటోమొబైల్ పరిశ్రమకు మే 2026 నెల అత్యంత అద్భుతమైన మైలురాయిగా నిలిచిపోయింది. దేశీయ మార్కెట్లో కార్లు, బైకులు, స్కూటర్లతో పాటు ఆటో రిక్షాల అమ్మకాలు మునుపెన్నడూ లేని విధంగా భారీ వృద్ధిని నమోదు చేశాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) అధికారికంగా విడుదల చేసిన నివేదికల ప్రకారం.. గడిచిన మే నెలలో ప్యాసింజర్ వాహనాల దేశీయ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన ఏకంగా 27.3 శాతం పెరిగి 4,38,854 యూనిట్లకు చేరుకున్నాయి. మే నెల చరిత్రలోనే ఈ స్థాయిలో కార్లు అమ్ముడవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
మూడు చక్రాల వాహనాల మార్కెట్లో మురిపించే వృద్ధి
కేవలం సొంత కార్లే కాకుండా వాణిజ్య రంగానికి చెందిన త్రీ వీలర్ వాహనాల అమ్మకాలు కూడా మే నెలలో ఊపందుకున్నాయి. గతేడాది మే 2025లో 53,942 యూనిట్లుగా ఉన్న త్రీ వీలర్ల అమ్మకాలు.. ఈసారి మే 2026 నాటికి 31.1 శాతం భారీ వృద్ధితో 70,720 యూనిట్లకు చేరుకున్నాయి. ప్రయాణికుల రవాణాకు వాడే ప్యాసింజర్ ఆటోలతో పాటు, సరుకు రవాణాకు ఉపయోగించే గూడ్స్ క్యారియర్ ఆటో రిక్షాలకు కూడా మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
టాప్ గేర్‌లో దూసుకెళ్లిన టూ వీలర్ల అమ్మకాలు
మరోవైపు సామాన్యుల వాహనమైన బైకులు, స్కూటర్ల అమ్మకాలు సైతం జోరుగా సాగాయి. మే 2026 లో మొత్తం టూ వీలర్ల విక్రయాలు 14.8 శాతం వృద్ధి చెంది 19,02,209 యూనిట్ల రికార్డు స్థాయికి చేరాయి. గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 16,57,116 యూనిట్లుగా ఉండేది. ఈ సెగ్మెంట్‌లో స్కూటర్ల అమ్మకాలు 27.4 శాతం పెరిగి 7,39,667 యూనిట్లుగా నమోదు కాగా.. మోటార్ సైకిళ్ల విక్రయాలు 7.2 శాతం పెరిగి 11,13,973 యూనిట్లకు చేరాయి. ఇదే సమయంలో మోపెడ్ల అమ్మకాలు కూడా 30.3 శాతం పెరగడం గమనార్హం.
మార్కెట్‌కు అసలైన బూస్టింగ్ ఇచ్చిన ఎస్‌యూవీ కార్లు
ప్యాసింజర్ కార్ల విభాగంలో అత్యధిక వృద్ధికి ఎస్‌యూవీలు, యుటిలిటీ వాహనాలే ప్రధాన కారణమని సియామ్ నివేదిక స్పష్టం చేసింది. మే 2026లో యుటిలిటీ వాహనాల అమ్మకాలు 24.8 శాతం పెరిగి 2,45,549 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 1,96,821 యూనిట్లు మాత్రమే. అలాగే సాధారణ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 28.8 శాతం వృద్ధితో 1,20,975 యూనిట్లకు చేరగా.. వ్యాన్ సెగ్మెంట్ లో కూడా 7.4 శాతం సానుకూల వృద్ధి నమోదైంది.
ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలకు పెరిగిన క్రేజ్
పర్యావరణ అనుకూల ఇంధన వాహన విభాగంలో ఈ-రిక్షాలు, ఈ-కార్ట్‌ల అమ్మకాలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. మే నెలలో ఈ-రిక్షాల విక్రయాలు 38.9 శాతం పెరిగి 1,000 యూనిట్లకు చేరాయి. అలాగే సరుకు రవాణాకు వాడే ఈ-కార్ట్ వాహనాల అమ్మకాలు ఏకంగా 81.8 శాతం అద్భుతమైన వృద్ధిని నమోదు చేసి 269 యూనిట్లకు చేరుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో లాస్ట్-మైల్ కనెక్టివిటీకి ఈ ఎలక్ట్రిక్ వాహనాలు మంచి ఆప్షన్‌గా మారుతున్నాయి.
వాహనాల అమ్మకాలు ఇంతలా పెరగడానికి గల కారణాలు ఇవే
సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపిన వివరాల ప్రకారం.. మే 2026 లో కార్లు, టూ వీలర్లు, త్రీ వీలర్లు ఇలా అన్ని విభాగాలలోనూ ఆల్‌టైమ్ హై సేల్స్ నమోదయ్యాయి. గతేడాది మే నెలలో బేస్ పాయింట్ తక్కువగా ఉండటం వల్ల ఈసారి వృద్ధి శాతం ఎక్కువగా కనిపిస్తోందని ఆయన విశ్లేషించారు. దీనితో పాటు ప్రభుత్వం జీఎస్‌టీ రేట్లను తగ్గించడం, బ్యాంకులు కస్టమర్లకు సులభమైన పద్ధతిలో లోన్లు అందించడం, మార్కెట్లో వినియోగదారుల సెంటిమెంట్ బలంగా ఉండటం వల్లే వాహనాల విక్రయాలు ఈ స్థాయిలో దూసుకుపోయాయని ఆయన స్పష్టం చేశారు.

