Electric Car Sales : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఊహించని వేగంతో దూసుకుపోతోంది. గత కొన్ని నెలలుగా దేశంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మే 2026 లో భారత ఈవీ రంగం ఒక సరికొత్త మైలురాయిని అందుకుంది. దేశంలో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో, కస్టమర్లు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ కార్ల వైపు భారీగా మొగ్గు చూపుతున్నారు. దీని ఫలితంగా మే నెలలో దేశవ్యాప్తంగా ఏకంగా 26,221 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. భారతదేశ చరిత్రలో ఒకే నెలలో ఇంత పెద్ద మొత్తంలో ఈవీ కార్లు అమ్ముడవడం ఇదే తొలిసారి.

ప్రభుత్వ అధికారిక వాహన పోర్టల్ అందించిన గణాంకాల ప్రకారం.. గత ఏడాది మే 2025 లో దేశంలో కేవలం 14,580 ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కానీ ఈ ఏడాది మే 2026 నాటికి అమ్మకాలు ఏకంగా 80 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాల ప్రాంతీయ రవాణా కార్యాలయాల పూర్తి డేటా ఇంకా అప్‌డేట్ కావాల్సి ఉందని, ఆ సమాచారం కూడా తోడైతే ఈ అమ్మకాల సంఖ్య సులభంగా 28,000 యూనిట్లకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమర్లలో నమ్మకం ఎంత వేగంగా పెరుగుతుందో చెప్పడానికి ఈ ఏడాది గణాంకాలే నిదర్శనం. 2026 సంవత్సరంలో ఒకే నెలలో 20,000 కంటే ఎక్కువ ఈవీ కార్లు అమ్ముడవడం ఇది వరుసగా నాల్గవ సారి కావడం విశేషం. అంతకుముందు ఏప్రిల్ 2026 లో 25,250 యూనిట్లు అమ్ముడవ్వగా, ఇప్పుడు మే నెల అమ్మకాలు ఆ రికార్డును కూడా బ్రేక్ చేశాయి. తక్కువ రన్నింగ్ కాస్ట్, కార్లలో వస్తున్న అత్యాధునిక టెక్నాలజీ వల్లే ప్రజలు ఈవీలను నమ్ముతున్నారని స్పష్టమవుతోంది.

మే నెల ద్వితీయార్థంలో ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా నాలుగు సార్లు పెంచాయి. దీనికి తోడు ఏప్రిల్ నెలతో పోలిస్తే సీఎన్‌జీ ధరలు కూడా దాదాపు 6 శాతం మేర ప్రియమయ్యాయి. ఈ ధరల పెరుగుదల ప్రభావం ఈవీ మార్కెట్ అమ్మకాలపై స్పష్టంగా కనిపించింది. మే 1 నుంచి 15వ తేదీ మధ్య దేశంలో 10,304 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవ్వగా, ఇంధన ధరలు పెరిగిన తర్వాత అంటే మే 16 నుంచి 31వ తేదీ మధ్య ఆ సంఖ్య ఏకంగా 15,917 యూనిట్లకు పెరిగింది. అంటే నెల ఆఖరి రెండు వారాల్లోనే జనాలు ఎగబడి ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేశారు.

భారతీయ ఈవీ మార్కెట్లో ఎప్పటిలాగే టాటా మోటార్స్ తన తిరుగులేని పట్టును నిలుపుకుంది. మే 2026 లో టాటా సంస్థ రికార్డు స్థాయిలో 10,231 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 102 శాతం అద్భుతమైన వృద్ధి. ఒకే నెలలో 10,000 కంటే ఎక్కువ ఈవీ కార్లను అమ్మడం టాటా చరిత్రలో ఇదే మొదటిసారి. దీనితో మొత్తం ఈవీ మార్కెట్లో టాటా వాటా 39 శాతానికి చేరింది. మార్కెట్లో కొత్తగా వచ్చిన తియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ మరియు హారియర్ ఈవీలకు ఉన్న భారీ డిమాండ్ వల్లే టాటా ఈ ఘనత సాధించింది.

మరో భారతీయ దిగ్గజం మహింద్రా కూడా ఈ రేసులో దూసుకుపోతోంది. మే నెలలో మహింద్రా సంస్థ 6,133 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విక్రయించి తన సొంత రికార్డులను బద్దలు కొట్టింది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యుత్తమ నెలవారీ అమ్మకం కావడం విశేషం. మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన BE 6, XEV 9e, XEV 9S మోడళ్లకు కస్టమర్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీనివల్ల మహింద్రా మార్కెట్ వాటా 23 శాతానికి పెరిగింది. అంతేకాకుండా వరుసగా మూడో నెల కూడా మహింద్రా సంస్థ ఎంజీ మోటార్స్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది.

ఇక జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మే నెలలో 4,936 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించి మూడో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన విండ్సర్ ఈవీ ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా నిలిచింది. అయితే మార్కెట్లో పోటీ తీవ్రం కావడంతో ఎంజీ మోటార్స్ మార్కెట్ వాటా 19 శాతానికి పడిపోయింది. దేశీయ దిగ్గజం మారుతి సుజుకి కూడా తన ఈ-విటారా ఎస్‌యూవీతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి 1,577 యూనిట్లను విక్రయించింది. మారుతి ఒకే నెలలో 1500 మార్కును దాటడం ఇదే తొలిసారి. అలాగే వియత్నాంకు చెందిన ప్రముఖ ఈవీ బ్రాండ్ విన్‌ఫాస్ట్ కూడా 1,224 కార్లను అమ్మి ఇండియాలో ఐదో స్థానాన్ని దక్కించుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story