Auto Exports : 14.57లక్షల వాహనాలు ఎగుమతి చేసిన భారత్..మూడు నెలల్లో రికార్డు
మూడు నెలల్లో రికార్డు

Auto Exports : ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలు అంటే ఏప్రిల్ నుండి జూన్ వరకు భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఓ గుడ్ న్యూస్ అందించింది. ఈ కాలంలో భారతదేశం నుండి వాహనాల ఎగుమతులు ఏకంగా 22శాతం పెరిగాయి. వాహన పరిశ్రమ సంస్థ SIAM విడుదల చేసిన డేటా ప్రకారం.. టూవీలర్లు, కమర్షియల్ వెహికల్స్ ఎగుమతులు గణనీయంగా పెరగడం వల్లే ఈ మొత్తం వృద్ధి సాధ్యమైంది. దేశీయంగా తయారైన వాహనాలకు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను ఇది స్పష్టం చేస్తోంది. 2024 ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికంలో భారతదేశం నుండి మొత్తం 14,57,461 వాహనాల యూనిట్లు ఎగుమతి అయ్యాయి. ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో (2024 ఏప్రిల్-జూన్) నమోదైన 11,92,566 యూనిట్ల కంటే చాలా ఎక్కువ. ఈ కాలంలో ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు 2,04,330 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది ఏ త్రైమాసికంలోనైనా నమోదైన అత్యధిక ప్యాసింజర్ వాహనాల ఎగుమతి కావడం విశేషం. ముఖ్యంగా మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికా మార్కెట్‌లకు భారతీయ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ ప్రాంతాలతో పాటు, శ్రీలంక, నేపాల్, జపాన్, ఆస్ట్రేలియా వంటి అనేక ఇతర దేశాలకు కూడా భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు ఎగుమతి అవుతున్నాయి.
భారతదేశంలో నంబర్ వన్ వాహన తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఎగుమతి మార్కెట్‌లోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికంలో మారుతి సుజుకి నుండి ఏకంగా 96,181 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. భారతదేశం నుండి మొత్తం ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లో ఈ కంపెనీ వాటా దాదాపు సగం ఉండటం విశేషం. ఇక హ్యుందాయ్ మోటార్స్ విషయానికి వస్తే, ఈ కంపెనీ కూడా భారతదేశం నుండి ఇతర దేశాలకు 48,140 ప్యాసింజర్ వాహనాలను ఎగుమతి చేసింది. ప్యాసింజర్ వాహనాలతో పాటు, భారతదేశంలో తయారైన టూ వీలర్లు కూడా ఎగుమతులలో సత్తా చాటాయి. మొదటి త్రైమాసికంలో 11,36,942 యూనిట్ల ద్విచక్ర వాహనాలు ఎగుమతి అయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే టూ-వీలర్ ఎగుమతుల్లో 23% పెరుగుదల కనిపించింది. అంతేకాకుండా, కమర్షియల్ వెహికల్స్ ఈ కాలంలో 19,427 యూనిట్లు, త్రీ వీలర్లు 95,796 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. ఈ గణాంకాలు భారత వాహన పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్లలో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నదని స్పష్టం చేస్తున్నాయి.
