Auto Retail Sales : నవరాత్రుల్లో రికార్డు క్రియేట్ చేసిన ఆటోమొబైల్ అమ్మకాలు.. ఏకంగా ఎంత పెరిగాయంటే ?
ఏకంగా ఎంత పెరిగాయంటే ?

Auto Retail Sales : ఇండియాలో వాహనాల అమ్మకాలు మళ్లీ పట్టాలెక్కాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ 2025లో రిటైల్ అమ్మకాలు గత సంవత్సరం కంటే 5.22 శాతం పెరిగి 18,27,337 యూనిట్లకు చేరుకున్నాయి. నెల ప్రారంభంలో జీఎస్‌టీ సంస్కరణల కారణంగా డిమాండ్ కాస్త నెమ్మదించినా, సెప్టెంబర్ 22న నవరాత్రి పండుగ ప్రారంభమైన తర్వాత అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.
దాదాపు అన్ని కీలక విభాగాల్లోనూ అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా టూ-వీలర్ విభాగం ఏకంగా 6.5% వృద్ధిని నమోదు చేసింది. దీంతో మొత్తం 12,87,735 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక, ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు 5.8% పెరిగి 2,99,369 యూనిట్లకు చేరాయి. భారీ వాహనాల్లో, ట్రాక్టర్ల అమ్మకాలు 3.6%, కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు 2.6% పెరిగాయి. అయితే, ఈ జోరులో కూడా త్రీ-వీలర్ అమ్మకాలు మాత్రం 7.2% తగ్గి 98,866 యూనిట్లుగా నమోదయ్యాయి.
సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు జరిగిన నవరాత్రి పండుగ సందర్భంగా వాహనాల అమ్మకాలు ఏకంగా 34 శాతం పెరిగి రికార్డు సృష్టించాయి. జీఎస్‌టీ తగ్గించడం, కంపెనీలు ఇచ్చిన పండుగ ఆఫర్‌లు, వినియోగదారులలో డిమాండ్ కారణంగా ఈ అద్భుతమైన వృద్ధి సాధ్యమైంది. నవరాత్రి పండుగ సమయంలో ముఖ్యంగా టూ-వీలర్ విభాగంలో ఏకంగా 36% వృద్ధి నమోదై, 8,35,364 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అలాగే, ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు కూడా 34.8% పెరిగి 2,17,744 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీ-వీలర్స్ 24.5% వృద్ధిని నమోదు చేశాయి. వర్షాలు సరిగా లేకపోయినా ట్రాక్టర్ల అమ్మకాలు కూడా 18.7% వృద్ధిని చూపడం శుభపరిణామం.
