Indian Cars : సౌతాఫ్రికాలో మనోళ్లదే హవా..అక్కడ తిరుగుతున్న ప్రతి రెండు కార్లలో ఒకటి మేడ్ ఇన్ ఇండియానే
అక్కడ తిరుగుతున్న ప్రతి రెండు కార్లలో ఒకటి మేడ్ ఇన్ ఇండియానే

Indian Cars : ఫారిన్ రోడ్లపై భారత్ జైత్రయాత్ర మొదలైంది. ఒకప్పుడు మనం విదేశీ కార్ల కోసం ఎదురుచూసేవాళ్లం.. కానీ ఇప్పుడు విదేశాలే మన కార్ల కోసం క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా సౌతాఫ్రికా ఆటోమొబైల్ మార్కెట్లో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించింది. అక్కడ అమ్ముడవుతున్న ప్రతి రెండు కార్లలో ఒకటి మన దేశానికి చెందినదే కావడం విశేషం. మేక్ ఇన్ ఇండియా పవర్ ఏంటో ప్రపంచానికి చాటిచెబుతూ, సౌతాఫ్రికాలో భారతీయ ఆటో దిగ్గజాలు సృష్టించిన ఈ సంచలనానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ప్రముఖ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ లైట్‌స్టోన్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2025లో సౌతాఫ్రికాలో అమ్ముడైన కార్లలో సగానికి పైగా భారత్‌తో సంబంధం ఉన్నవే. అంటే అవి నేరుగా మహీంద్రా, టాటా వంటి భారతీయ బ్రాండ్లు కావచ్చు లేదా భారత్‌లో తయారైన జపనీస్, కొరియన్ బ్రాండ్లు కావచ్చు. గతేడాది అక్కడ అమ్ముడైన ప్యాసింజర్ వాహనాల్లో 49 శాతం భారత్ నుంచే దిగుమతి అయ్యాయి. ఇది ఒక రకంగా భారతీయ మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి దక్కిన గొప్ప గౌరవం.
సౌతాఫ్రికాలో మహీంద్రా తన పికప్ సిరీస్ వాహనాలతో బలమైన ముద్ర వేసింది. అంతేకాదు, అక్కడ అమ్ముడవుతున్న జపనీస్ బ్రాండ్ల లైట్ వాహనాల్లో 84 శాతం భారత్ నుంచే వెళ్తున్నాయి. కేవలం 10 శాతం మాత్రమే జపాన్ లో తయారవుతున్నాయి. మారుతి సుజుకి ప్లాంట్ల నుంచి తయారైన స్టార్లెట్, అర్బన్ క్రూజర్, విట్జ్ వంటి కార్లు టయోటా బ్రాండ్ పేరుతో అక్కడ విపరీతంగా అమ్ముడవుతున్నాయి. తక్కువ తయారీ ఖర్చు, నాణ్యమైన ఇంజిన్లు ఉండటమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
సాధారణంగా గ్లోబల్ మార్కెట్లో చైనా బ్రాండ్లు పెద్ద ముప్పుగా కనిపిస్తాయి. కానీ సౌతాఫ్రికాలో మాత్రం భారత్ ముందు అవి తేలిపోయాయి. 2024 గణాంకాల ప్రకారం చైనా కార్ల వాటా కేవలం 11 శాతంగా ఉంటే, భారత్ నుంచి దిగుమతి అయిన వాహనాల వాటా ఏకంగా 36 శాతంగా ఉంది. చైనీస్ కార్లు రోడ్లపై ఎక్కువగా కనిపిస్తున్నా, సేల్స్ పరంగా మాత్రం భారతీయ మార్కెట్ వాటానే అత్యధికం. 2009లో కేవలం 5 శాతంగా ఉన్న భారత్ దిగుమతులు, ఇప్పుడు 50 శాతానికి చేరుకోవడం విశేషం.
భారత్ నుంచి వాహనాల ఎగుమతులు పెరగడానికి ప్రధాన కారణం కాస్ట్ ఎఫెక్టివ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్. ఇక్కడ కూలీల ఖర్చు తక్కువ, ప్లాంట్లు అత్యాధునికంగా ఉండటంతో కార్ల ధరలు విదేశీ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటున్నాయి. ఇది సౌతాఫ్రికా స్థానిక పరిశ్రమకు కొంత ఆందోళన కలిగించే విషయమే అయినా, వినియోగదారులకు మాత్రం మేలు చేస్తోంది. 2026 నాటికి ఈ ఎగుమతులు మరింత పెరిగి, ఆఫ్రికా ఖండం మొత్తం భారతీయ కార్లతో నిండిపోయే అవకాశం ఉంది.

