Indian EV Exports : భారత్‌లో తయారైన ఎలక్ట్రిక్ కార్లకు విదేశాల్లో ఊహించని రీతిలో డిమాండ్ పెరిగింది. ఏప్రిల్ నుంచి జూన్ 2026 మధ్య కాలంలో భారతదేశం నుంచి ఎలక్ట్రిక్ కార్ల ఎగుమతులు ఏకంగా 14 రెట్లు పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో కేవలం 1,122 ఈవీలు మాత్రమే విదేశాలకు ఎగుమతి కాగా, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఆ సంఖ్య ఏకంగా 15,641 యూనిట్లకు చేరుకోవడం విశేషం. ఈ రికార్డు సంఖ్య గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో జరిగిన ఎగుమతులలో సగానికంటే ఎక్కువ కావడం భారత ఆటోమొబైల్ రంగానికి దక్కిన గొప్ప ఘనత.

ఎగుమతులు హఠాత్తుగా పెరగడానికి కారణాలు

ప్రపంచవ్యాప్తంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. దాంతో వినియోగదారులు తక్కువ నిర్వహణ ఖర్చు ఉండే ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పు భారతీయ ఆటోమొబైల్ దిగ్గజాలైన మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలకు తీవ్రంగా కలసి వచ్చింది. నాణ్యత, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, అందుబాటులో ఉండే ధరల కారణంగా విదేశీ కొనుగోలుదారులు భారతీయ కార్లపై అమితమైన ఆసక్తిని చూపుతున్నారు.

47 దేశాల్లో మారుతి ఇ-విటారా జోరు

ఈ రికార్డు ఎగుమతుల్లో అత్యధిక వాటా మారుతి సుజుకి తీసుకొచ్చిన సరికొత్త ఎలక్ట్రిక్ SUV ఇ-విటారాదే కావడం గమనార్హం. గత త్రైమాసికంలో భారత్ నుంచి ఎగుమతి అయిన కార్లలో ఇది మూడో స్థానంలో నిలిచింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే మారుతి సంస్థ 15,210 ఇ-విటారా కార్లను బ్రిటన్, దక్షిణాఫ్రికా సహా 47 దేశాలకు ఎగుమతి చేసింది. ఐరోపా, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మేడ్ ఇన్ ఇండియా కార్లకు మంచి ఆధరణ లభిస్తోంది. మారుతి సంస్థ 2030 నాటికి మరో 4 కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

గ్లోబల్ మార్కెట్‌పై టాటా, మహీంద్రా కన్ను

మరోవైపు టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలు కూడా అంతర్జాతీయంగా విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి. టాటా మోటార్స్ రాబోయే ఐదేళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడితో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 13 లక్షల వాహనాలకు పెంచాలని, ఇవి మోడళ్లను 6 నుంచి 10కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా తమ బిఇ 6, ఎక్స్ఇవి 9ఇ ఎలక్ట్రిక్ SUVలను బ్రిటన్ వంటి రైట్-హ్యాండ్ డ్రైవ్ దేశాలకు అనుగుణంగా తయారు చేసి, ఆ తర్వాత మిగతా యూరప్ మార్కెట్లలో విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story