ఎస్యూవీలకు బానిసలైన భారతీయులు

Car Sales : భారతదేశంలో కార్ల మార్కెట్ ప్రస్తుతం ఒక పెద్ద మార్పునకు గురవుతోంది. ఇది తాత్కాలిక ట్రెండ్ కాదు, ప్రజల ఆలోచనలలో శాశ్వత మార్పు అని SOIC రీసెర్చ్ కొత్త నివేదిక చెబుతోంది. ఈ నివేదిక ప్రకారం, ఎస్‌యూవీలు ఇప్పుడు కేవలం ఒక కార్ విభాగం మాత్రమే కాదు, భారతదేశంలో కొత్త గుర్తింపు, ఆకాంక్షకు చిహ్నంగా మారాయి. గతంలో మొదటిసారి కారు కొనుగోలు చేసే వారు ఎక్కువగా ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లను ఇష్టపడేవారు. కానీ గత ఐదు సంవత్సరాలుగా వాటి అమ్మకాలు నిరంతరం తగ్గుతున్నాయి.

లెక్కల ప్రకారం.. ప్రస్తుతం ఎస్‌యూవీల మార్కెట్ వాటా 52% కి చేరుకుంది, అయితే హ్యాచ్‌బ్యాక్ కార్ల వాటా కేవలం 26% కి తగ్గింది. ఇది గత 20 సంవత్సరాలలో అత్యంత తక్కువ స్థాయి. ఆర్థిక సంవత్సరం 2024లో ఎస్‌యూవీల అమ్మకాలు 23% పెరిగాయి.. అయితే హ్యాచ్‌బ్యాక్‌ల అమ్మకాలు 17% తగ్గాయి. గతంలో చిన్న కార్లు ఆధిపత్యం చెలాయించిన మార్కెట్‌కు ఇది పెద్ద మార్పు.

కారు అనేది ఇప్పుడు కేవలం ఒక అవసరం మాత్రమే కాదు, అది గుర్తింపు, జీవనశైలితో ముడిపడి ఉంది. ఇప్పుడు కొనుగోలుదారులు కారులో డిజైన్, టెక్నాలజీ, కంఫర్ట్, స్టైల్ కూడా కోరుకుంటున్నారు. కారు ఇప్పుడు కేవలం ప్రయాణ సాధనం కాదు, అది స్టేటస్, వ్యక్తిగత భావ వ్యక్తీకరణలో భాగమైంది.

ఆటోమొబైల్ కంపెనీలు ఈ మార్పును దృష్టిలో ఉంచుకొని తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా స్పష్టంగా తమ దృష్టి కేవలం ఎస్‌యూవీలపైనే ఉంటుందని, సెడాన్, హ్యాచ్‌బ్యాక్ లేదా చిన్న ఎస్‌యూవీలు తయారు చేయబోమని ప్రకటించింది. కంపెనీ ఎండి, సిఈఓ ఆనంద్ షా ఈ విషయాన్ని వెల్లడించారు. టాటా మోటార్స్ కూడా ఇదే మార్గంలో ఉంది. దాని కొత్త ఎస్‌యూవీలు నెక్సాన్, పంచ్, హారియర్ కంపెనీ అమ్మకాలను వేగంగా పెంచుతున్నాయి.

టాటా ప్యాసింజర్ వెహికల్స్ ఎండి శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. ఎస్‌యూవీ విభాగంలో తమ వృద్ధి పరిశ్రమ సగటు కంటే చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. చిన్న కార్లకు ప్రసిద్ధి చెందిన మారుతి సుజుకి కూడా ఇప్పుడు ఈ మార్పును అంగీకరిస్తోంది. కంపెనీ ప్రకారం, భారతదేశం ఇప్పుడు చిన్న కార్ల నుండి పెద్ద కార్ల వైపు కదులుతోంది.

గతంలో మొదటిసారి కారు కొనుగోలు చేసే వ్యక్తి కేవలం చవకైన నాలుగు చక్రాల వాహనం కోసం చూసేవారు. కానీ ఇప్పుడు వారు ఎత్తైన, ధృడంగా కనిపించే, ఆధునిక ఫీచర్లతో కూడిన కారును కోరుకుంటున్నారు. దీని కోసం వారు బడ్జెట్‌ను పెంచాల్సి వచ్చినా లేదా ఎక్కువ కాలం ఈఎంఐని ఎంచుకోవాల్సి వచ్చినా వెనుకాడటం లేదు. ఈ ఆలోచనలో మార్పుకు కారణం ఆదాయం పెరగడం, ఈజీ లోన్ సదుపాయాలు, స్టేటస్ సింబల్ గా భావించే మనస్తత్వమని నిపుణులు చెబుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story