14 లక్షల మైలురాయి దాటిన అమ్మకాలు.. టాప్ ప్లేసులో టీవీఎస్

E2W Sales : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో గత ఆర్థిక సంవత్సరం 2026 కలలో కూడా ఊహించని రీతిలో దూసుకుపోయింది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు బైకుల అమ్మకాలు ఏకంగా 14 లక్షల యూనిట్ల మార్కును దాటి సరికొత్త రికార్డును సృష్టించాయి. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పెరిగిన ఛార్జింగ్ స్టేషన్లు, పెట్రోల్ ధరల భారం నుంచి తప్పించుకోవాలనే సామాన్యుడి ఆలోచన ఈ విజయానికి ప్రధాన కారణం.

భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ గత ఏడాది కంటే అద్భుతమైన వృద్ధిని సాధించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 11,50,790 యూనిట్లు అమ్ముడవ్వగా, 2026 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఆ సంఖ్య 14,01,818 యూనిట్లకు చేరుకుంది. అంటే కేవలం ఒక ఏడాదిలోనే అమ్మకాలు 21.81% పెరిగాయి. కొత్త మోడళ్ల రాక, వినియోగదారులలో పెరిగిన అవగాహన ఈ భారీ పెరుగుదలకు కారణమయ్యాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో టీవీఎస్ మోటార్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. కంపెనీ తన ఐక్యూబ్ మోడల్ తో ఏకంగా 3,41,513 యూనిట్లను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 43.54% వృద్ధి. ముఖ్యంగా మార్చి 2026లో కంపెనీ ప్రవేశపెట్టిన బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్ మోడల్ వల్ల తక్కువ ధరకే స్కూటర్లు లభించడంతో జనం ఎగబడి కొన్నారు.

రెండో స్థానంలో ఉన్న బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా 2,89,349 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇక మూడో స్థానంలో ఉన్న ఏథర్ ఎనర్జీ అందరికంటే ఎక్కువ వృద్ధిని (82.34%) సాధించింది. తమ కొత్త ఫ్యామిలీ స్కూటర్ రిజ్తా, పాపులర్ 450 సిరీస్ తో ఏథర్ మార్కెట్ ను ఊపేసింది. ఏథర్ మొత్తం 2,39,178 యూనిట్లను విక్రయించి తన పట్టును నిరూపించుకుంది.

ఒకప్పుడు మార్కెట్ లీడర్ గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ కు ఈ ఏడాది చేదు అనుభవాలను మిగిల్చింది. కంపెనీ అమ్మకాలు ఏకంగా 52.28% పడిపోయి 1,64,295 యూనిట్లకు పరిమితమయ్యాయి. సర్వీస్ ఇబ్బందులు, కస్టమర్ల అసంతృప్తి దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, హీరో మోటోకార్ప్ అత్యధికంగా 196.13% వృద్ధిని నమోదు చేసి 1,44,330 యూనిట్లు అమ్ముకుంది. విడా బ్రాండ్ కింద హీరో తన నెట్ వర్క్ ను విస్తరించడం దీనికి ప్రధాన కారణం. మొత్తానికి ఇండియా ఈవీ మార్కెట్ మున్ముందు మరిన్ని ఆశ్చర్యకరమైన మార్పులకు వేదిక కాబోతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story