మళ్లీ హీరోనే నంబర్ 1.. వెనుకబడ్డ హోండా

Two Wheeler Sales : సెప్టెంబర్ 2025లో భారత టూ-వీలర్ మార్కెట్ కొత్త శిఖరాలను చేరుకుంది. పండుగల సీజన్ ప్రారంభం, గ్రామీణ ప్రాంతాల నుండి పెరిగిన డిమాండ్, కొత్త మోడళ్ల విడుదలతో బైక్‌లు, స్కూటర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ నెలలో దేశంలో మొత్తం 24.58 లక్షల టూ-వీలర్‌లు అమ్ముడయ్యాయి. ఇది గత నెలతో పోలిస్తే 14.37% ఎక్కువ గతేడాదితో పోలిస్తే 7.85% వృద్ధిని సూచిస్తుంది. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..హోండా వంటి పెద్ద కంపెనీ వెనుకబడిపోగా, హీరో మోటోకార్ప్ మళ్లీ నంబర్-1 స్థానాన్ని దక్కించుకుంది.

సెప్టెంబర్ 2025లో హీరో మోటోకార్ప్ మరోసారి భారతదేశ టూ-వీలర్ మార్కెట్ లీడర్‌గా నిరూపించుకుంది. ఈ నెలలో కంపెనీ అత్యధిక యూనిట్లను విక్రయించి, హోండా, టీవీఎస్, బజాజ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి కంపెనీలను అధిగమించింది. మరోవైపు, హోండా అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన తగ్గాయి. సెప్టెంబర్‌లో వృద్ధి రేటు నెగటివ్‌గా ఉన్న ఏకైక కంపెనీ హోండా మాత్రమే. హోండా స్కూటర్ మోడల్స్ ఇప్పటికీ బాగానే అమ్ముడవుతున్నా, బైక్‌ల అమ్మకాల్లో తగ్గుదల మొత్తం గణాంకాలను తగ్గించింది. టీవీఎస్ మోటార్ , రాయల్ ఎన్‌ఫీల్డ్ అద్భుతమైన పనితీరును కనబరిచి, సెప్టెంబర్‌లో డబుల్-డిజిట్ వృద్ధిని నమోదు చేశాయి.

సెప్టెంబర్ 2025లో టూ-వీలర్ ఎగుమతి మార్కెట్ కూడా బాగా రాణించింది. ఈ నెలలో భారతదేశం నుండి మొత్తం 3.98 లక్షల యూనిట్లు ఎగుమతి అయ్యాయి. ఇది 16.95% వృద్ధిని సూచిస్తుంది. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కంపెనీలు కలిసి భారతదేశ టూ-వీలర్ ఎగుమతి మార్కెట్‌లో దాదాపు 67% వాటాను కలిగి ఉన్నాయి. రెండు కంపెనీలు లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా వంటి మార్కెట్లలో తమ పట్టును బలోపేతం చేసుకున్నాయి. హీరో మోటోకార్ప్ కూడా ఎగుమతులలో మెరుగైన పురోగతిని సాధించింది. సుజుకి మాత్రం విదేశీ మార్కెట్లలో తగ్గుదలను చూసింది.

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అమ్మకాలు తగ్గడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. కంపెనీ చాలా కాలంగా కొత్త మోడళ్లను విడుదల చేయకపోవడం, పాత మోడళ్లపైనే ఆధారపడటం ఒక కారణం. అలాగే, హీరో, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీల నుండి పోటీ పెరగడం కూడా ప్రభావితం చేసింది. గ్రామీణ మార్కెట్లలో హీరో, టీవీఎస్‌ల బలమైన పట్టు హోండా అమ్మకాలను దెబ్బతీసింది. అయితే, హోండా ఇప్పుడు కొత్త 125cc స్కూటర్, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. వచ్చే నెలల్లో అమ్మకాలు మళ్లీ పెరుగుతాయని కంపెనీ ఆశిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story