Innova Crysta : ఇన్నోవా ప్రేమికులకు చేదువార్త.. రోడ్లపై క్రిస్టా శకం ముగియబోతుందా?
రోడ్లపై క్రిస్టా శకం ముగియబోతుందా?

Innova Crysta : భారతదేశంలో లగ్జరీ ప్రయాణం అన్నా, ఫ్యామిలీ ట్రిప్ అన్నా అందరికీ గుర్తొచ్చే పేరు ఇన్నోవా. ముఖ్యంగా ఇన్నోవా క్రిస్టా తన పవర్‌ఫుల్ డీజిల్ ఇంజన్‌తో, అద్భుతమైన కంఫర్ట్‌తో రారాజుగా వెలుగొందుతోంది. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు ఈ కారు అభిమానులను కాస్త కలవరపెడుతున్నాయి. త్వరలో అమల్లోకి రానున్న కఠినమైన నిబంధనల కారణంగా, టయోటా తన మోస్ట్ పాపులర్ MPV క్రిస్టాను నిలిపివేసే దిశగా అడుగులు వేస్తోంది.
2005లో మొదటిసారి భారత్‌లోకి అడుగుపెట్టిన ఇన్నోవాకు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా 2016లో క్రిస్టా వచ్చింది. పాత ఇన్నోవా కంటే ఇది మరింత ప్రీమియం లుక్, పవర్‌ఫుల్ ఇంజన్‌తో మార్కెట్‌ను షేక్ చేసింది. టయోటా కంపెనీకి అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన కార్లలో ఇది ఒకటి. ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా, క్రిస్టాకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. కానీ, ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారాల్సి వస్తోంది.
ఎందుకు ఈ నిర్ణయం?
భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం 2027 ఏప్రిల్ 1 నుంచి CAFE 3 నిబంధనలను అమలు చేయాలని భావిస్తోంది. ఈ నియమం ప్రకారం.. కార్ల తయారీ సంస్థలు తమ వాహనాల సగటు కార్బన్ ఉద్గారాలను భారీగా తగ్గించాల్సి ఉంటుంది. డీజిల్ ఇంజన్ కలిగిన క్రిస్టా ఈ కఠినమైన ప్రమాణాలను అందుకోవడం కష్టమని కంపెనీ భావిస్తోంది. అందుకే, పర్యావరణానికి తక్కువ హాని చేసే హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతోంది.
ట్యాక్సీ సర్వీసులు నడిపేవారికి, ట్రావెల్ ఏజెన్సీలకు క్రిస్టా ఒక వరప్రసాదం. తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ కాలం మన్నే తత్వం, అద్భుతమైన రీసేల్ వాల్యూ దీని సొంతం. ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ.18.85 లక్షలుగా ఉంది. అయితే, ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి టయోటా ఒక కొత్త ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇన్నోవా హైక్రాస్‌లోనే ఒక చౌకైన వెర్షన్‌ను కేవలం కమర్షియల్ ఆపరేటర్ల కోసం తీసుకువచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ మోడల్ ధర రూ. 18.33 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కానీ, ఫ్లీట్ ఆపరేటర్లు దీనికి దూరంగా ఉండటానికి కారణం మైలేజీ. నిజ జీవిత పరిస్థితుల్లో హైక్రాస్ పెట్రోల్ కేవలం 10 కి.మీ మైలేజీ మాత్రమే ఇస్తుంది. అదే క్రిస్టా డీజిల్ ఇంజన్ కావడం వల్ల రన్నింగ్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. అయితే హైక్రాస్ హైబ్రిడ్ వెర్షన్ 14-15 కి.మీ మైలేజీ ఇస్తున్నప్పటికీ, దాని ధర (రూ. 26.30 లక్షలు) చాలా ఎక్కువగా ఉండటం పెద్ద మైనస్.
క్రిస్టా స్థానాన్ని భర్తీ చేయాలంటే హైబ్రిడ్ ధర తగ్గాలని టయోటా గ్రహించింది. అందుకే హైక్రాస్ హైబ్రిడ్‌లో కొన్ని ప్రీమియం ఫీచర్లను (ఉదాహరణకు సన్‌రూఫ్, ఏడీఏఎస్ వంటివి) తగ్గించి, బడ్జెట్ ధరలో ఒక కొత్త హైబ్రిడ్ మోడల్‌ను లాంచ్ చేసే పనిలో ఉంది. దీనివల్ల ధర రూ.7.50 లక్షల మేర తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే, క్రిస్టా స్థానాన్ని హైక్రాస్ హైబ్రిడ్ సమర్థవంతంగా భర్తీ చేయగలదు.

