E20 Petrol : ఈ20 పెట్రోల్‌తో పాత బైకులు ఖరాబ్ అవుతున్నాయా?.. ఈ 5 చిట్కాలతో మీ ఇంజిన్ సేఫ్
ఈ 5 చిట్కాలతో మీ ఇంజిన్ సేఫ్

E20 Petrol : భారతదేశంలో ఇంధన రంగంలో ఒక పెద్ద మార్పు ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణే ధ్యేయంగా ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లో ఈ20 ఇంధనాన్ని విక్రయించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ20 పెట్రోల్ అంటే ఇందులో 80 శాతం సాధారణ పెట్రోల్, 20 శాతం ఇథనాల్ మిశ్రమం కలిసి ఉంటుంది. పర్యావరణానికి ఇది ఎంతో మేలు చేకూరుస్తున్నప్పటికీ, పాత మోటార్ సైకిళ్లు, స్కూటర్లు కలిగి ఉన్న వాహనదారులకు మాత్రం ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది.
పాత బైకులకు ఇథనాల్ సెగ ఎందుకు?
భారతదేశంలో 2023 ఏప్రిల్ నెల నుంచిఇథనాల్ ఇంధనానికి అనుకూలంగా ఉండే సరికొత్త ఇంజిన్ వాహనాల ఉత్పత్తి ప్రారంభమైంది. కానీ అంతకంటే ముందు కొనుగోలు చేసిన కోట్లాది పాత బైకులు ఈ ఇంధనానికి అనుగుణంగా డిజైన్ చేయబడలేదు. ఇథనాల్ సహజ గుణం ఏమిటంటే, అది గాలిలో ఉండే తేమను లేదా నూనెలోని నీటి శాతాన్ని తన వైపుకు త్వరగా ఆకర్షిస్తుంది. అంతేకాకుండా దీనికి తుప్పు పట్టించే గుణం కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పాత బైకుల ఫ్యూయల్ ట్యాంక్, మెటల్ పార్ట్స్, కార్బ్యురేటర్ లోపలి రబ్బర్ పైపులు, సీల్స్ త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ నష్టం నుంచిబైక్‌ను సులభంగా కాపాడుకోవచ్చు.
1. క్వాలిటీ ఫ్యూయల్ ఎడిటివ్స్ ఉపయోగించడం
మీరు రోజూ ఈ20 పెట్రోల్ వాడుతున్నట్లయితే, మార్కెట్లో లభించే మంచి కంపెనీల ఫ్యూయల్ ఎడిటివ్స్ లేదా ఫ్యూయల్ స్టెబిలైజర్లను వాడటం చాలా మంచిది. ఇవి పెట్రోల్‌లో ఇథనాల్ వల్ల ఏర్పడే రసాయన ప్రభావాలను తగ్గిస్తాయి. ట్యాంక్ లోపల నీటి శాతం పేరుకుపోకుండా నిరోధిస్తాయి. అలాగే ఇంజిన్ కంబషన్ ఛాంబర్‌లో కార్బన్ పేరుకుపోకుండా చూస్తూ ఫ్యూయల్ లైన్లను ఎల్లప్పుడూ క్లీన్‌గా ఉంచుతాయి.
2. పాత రబ్బర్, ప్లాస్టిక్ విడిభాగాల మార్పు
పాత బైకులలో వాడే రబ్బర్ ఫ్యూయల్ పైపులు, గ్యాస్కెట్లు, ఓ-రింగులు ఇథనాల్ కెమికల్స్ తట్టుకునే శక్తిని కలిగి ఉండవు. ఈ20 పెట్రోల్ నిరంతరం వీటి గుండా ప్రవహించడం వల్ల రబ్బర్ పైపులు గట్టిపడిపోయి పగుళ్లు రావడం లేదా పెట్రోల్ లీకేజ్ అవ్వడం జరుగుతుంది. అందుకే మీ బైక్‌ను మెకానిక్ వద్దకు తీసుకెళ్లి, పాత పైపుల స్థానంలో ఇథనాల్ నిరోధక శక్తి కలిగిన ఆధునిక విడిభాగాలను వేయించుకోవడం ఉత్తమమైన మార్గం.
3. ఫ్యూయల్ సిస్టమ్‌ను క్రమంతప్పకుండా క్లీన్ చేయించడం
ఇథనాల్ పెట్రోల్ ట్యాంక్, కార్బ్యురేటర్ లోపల ఏళ్ల తరబడి పేరుకుపోయిన పాత చెత్తను, జిడ్డును వదిలిస్తుంది. ఇలా వదిలిన వ్యర్థాలు ఫ్యూయల్ లైన్లలో ప్రవహించి ఇంజెక్టర్లు లేదా కార్బ్యురేటర్ జెట్లను బ్లాక్ చేస్తాయి. దీనివల్ల బైక్ మధ్యమధ్యలో ఆగిపోవడం లేదా స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకే ప్రతి సర్వీసింగ్‌లోనూ కార్బ్యురేటర్, ఫ్యూయల్ పైపులు, ఇంజెక్టర్లను క్లీన్ చేయిస్తుండాలి. ఇది ఇంజిన్ స్మూత్‌గా నడవడానికి, మైలేజ్ పెరగడానికి సహాయపడుతుంది.
4. ట్యాంక్‌లో పెట్రోల్‌ను ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు
సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఈ20 పెట్రోల్ చాలా త్వరగా పాడైపోతుంది. ఇథనాల్ గాలిలోని తేమను పీల్చుకోవడం వల్ల పెట్రోల్, నీరు విడిపోయి ట్యాంక్ అడుగుభాగానికి చేరుకుంటాయి. ఒకవేళ మీరు మీ బైక్‌ను తక్కువగా వాడుతుంటే, వారాల తరబడి ట్యాంక్ ఫుల్ చేసి అలాగే వదిలేయకండి. అవసరమైనంత మేరకే పెట్రోల్ కొట్టించుకోండి లేదా బైక్ ఎక్కువ రోజులు వాడకుండా పక్కన పెట్టాల్సి వస్తే ట్యాంక్ ఖాళీ చేయడం లేదా ఫ్యూయల్ స్టెబిలైజర్ ఉపయోగించడం మంచిది.
5. నిర్ణీత సమయం కంటే ముందే ఇంజిన్ ఆయిల్ మార్చడం
ఈ20 పెట్రోల్ మండేటప్పుడు ఇంజిన్ లోపల ఉష్ణోగ్రత సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇథనాల్ వేపర్ కెమికల్స్ ఇంజిన్ ఆయిల్ జిగటను త్వరగా దెబ్బతీస్తాయి. అందుకే మీ బైక్ ఇంజిన్ ఆయిల్‌ను సాధారణంగా మార్చే కిలోమీటర్ల కంటే కొంచెం ముందే (ఉదాహరణకు 3000 కిమీల బదులు 2500 కిమీలకే) మార్చడం అలవాటు చేసుకోండి. ఇది ఇంజిన్ లోపలి భాగాలకు గట్టి రక్షణ కల్పించి, బైక్ జీవితకాలాన్ని పెంచుతుంది.

