E20 Petrol : ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాహనదారుల మధ్య ఈ20 పెట్రోల్ వాడకంపై పెద్ద చర్చ నడుస్తోంది. చాలామంది వాహనదారులు ఈ బ్లెండెడ్ పెట్రోల్ వల్ల తమ కార్లు, బైకులు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ఈ ఇంధనం పూర్తిగా సురక్షితమైనదని చెబుతోంది. ఈ వివాదం మధ్య వాహనాల నాణ్యతను పరీక్షించే ప్రముఖ ప్రభుత్వ సంస్థ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) రూపొందించిన ఒక రహస్య నివేదికలోని కీలక విషయాలు బయటకు వచ్చాయి. ది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం, ఆటోమొబైల్ కంపెనీలు దేశంలో ఈ20 ఇంధనాన్ని పూర్తిగా అమలు చేయాలని నిర్ణయించాయి. అయితే, ఈ నివేదికలో పాత వాహనదారులను కలవరపెట్టే కొన్ని విషయాలు కూడా ఉన్నాయి.

ఆ కార్ల ఫ్యూయల్ సిస్టమ్స్ దెబ్బతినే ఛాన్స్

ARAI నివేదిక ప్రకారం.. ఈ10 పెట్రోల్ కోసం డిజైన్ చేసిన పాత కార్లలో ఈ20 పెట్రోల్‌ను దీర్ఘకాలం పాటు వాడటం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కారు ఫ్యూయల్ సిస్టమ్‌లో ఉండే రబ్బరు విడిభాగాలు అంటే హోస్ పైపులు, గ్యాస్కెట్లు, సీల్స్, ఓ-రింగులు కాలక్రమేణా దెబ్బతినవచ్చు. ఎథనాల్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ రబ్బరు భాగాలు త్వరగా అరిగిపోయి, వాటిని మార్చాల్సి రావచ్చు. అయితే కారులో ఉండే మెటల్ భాగాలపై ఈ పెట్రోల్ వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని ఈ నివేదిక స్పష్టం చేసింది.

వందల గంటల ఇంజిన్ టెస్టింగ్

ఈ నివేదిక కోసం పరిశోధకులు ఫోర్-వీలర్ ఇంజిన్లపై రకరకాల ల్యాబ్ పరీక్షలు జరిపారు. ఇందులో ఒక బీఎస్-4 ఇంజిన్ ఈ20 పెట్రోల్‌పై ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిచింది. కానీ, ఒక బీఎస్-6 టర్బోచార్జ్డ్ ఇంజిన్‌ను సుమారు 265 గంటల పాటు నిరంతరాయంగా పరీక్షించినప్పుడు కొన్ని సాంకేతిక లోపాలు కనిపించాయి. అలాగే రెండు ప్రముఖ కార్ల కంపెనీలు జరిపిన పరీక్షల్లో.. ఒక కంపెనీ ఇంజిన్ 400 గంటల పాటు బాగానే పనిచేసింది. కానీ మరో కంపెనీ ఇంజిన్‌ను 809 గంటల పాటు పరీక్షించినప్పుడు ఎగ్జాస్ట్ వాల్వ్‌లో థర్మో-మెకానికల్ సమస్య తలెత్తింది. అయితే సాధారణంగా ఇంజిన్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి 2,000 గంటల సమయం పడుతుందని, కాబట్టి కేవలం ఈ వందల గంటల పరీక్షల ఆధారంగానే ఒక ముగింపునకు రాలేమని నిపుణులు చెబుతున్నారు.

టూ-వీలర్ వాహనదారులకు ఊరట

మరోవైపు దేశంలో అత్యధికంగా ఉండే టూ-వీలర్ (బైకులు, స్కూటర్లు) వాహనదారులకు ఈ నివేదిక పెద్ద ఊరటనిచ్చింది. మూడు వేర్వేరు ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీలు జరిపిన పరీక్షల్లో ఈ20 పెట్రోల్ వల్ల ఎలాంటి పెద్ద సమస్యలు రాలేదు. సాధారణ పెట్రోల్‌తో నడిచినట్లే బైకులు, స్కూటర్ల పర్ఫార్మెన్స్ చాలా నార్మల్‌గా ఉంది. కారు లేదా బైక్ స్టార్ట్ కావడంలో కానీ, నడపడంలో కానీ, అలాగే కాలుష్య ఉద్గారాల స్థాయిలో కానీ ఎలాంటి ప్రమాదకర మార్పులు కనిపించలేదు. టూ-వీలర్ ఇంజిన్లు ఈ కొత్త ఇంధనానికి బాగానే అలవాటు పడ్డాయని నివేదిక పేర్కొంది.

ఈ20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గుతుందా?

ఈ నివేదికలో వాహనదారుల మైలేజ్ ఆందోళనలపై కూడా ఒక స్పష్టత వచ్చింది. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఈ20 పెట్రోల్ వాడినప్పుడు ఇంధన వినియోగం సుమారు 2% నుంచి 6% వరకు పెరుగుతుందని తేలింది. అంటే దీని అర్థం ఏంటంటే, కొన్ని రకాల వాహనాలలో మైలేజ్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ మైలేజ్ తగ్గుదల అనేది అన్ని వాహనాలలో ఒకేలా ఉండదని, వాహనం కండిషన్ మరియు మోడల్‌ను బట్టి మారుతుందని నివేదిక వెల్లడించింది.

దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ అమలు

భారతదేశంలో ఏప్రిల్ 2025 నుంచే దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో ఈ20 పెట్రోల్‌ను అందుబాటులోకి తెచ్చారు. అంటే ఇప్పుడు మనం కొట్టించే పెట్రోల్‌లో 20 శాతం ఎథనాల్ కలిసి ఉంటోంది. భవిష్యత్తులో దీనిని ఈ30 వరకు తీసుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల 2012 కంటే ముందు తయారైన పాత వాహనాలు మరియు ఏప్రిల్ 2023 కంటే ముందు వచ్చిన కొన్ని మోడళ్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే మారుతి సుజుకి, టయోటా, హ్యుందాయ్, హీరో మోటోకార్ప్, టీవీఎస్, బజాజ్ లాంటి పెద్ద కంపెనీలు మాత్రం.. తమ కొత్త ఈ20 సపోర్ట్ వాహనాలపై ఎన్నో ఏళ్లుగా టెస్టింగ్ చేశామని, సరైన సర్వీసింగ్ చేయించే వాహనాలకు ఈ పెట్రోల్ వల్ల ఎలాంటి ముప్పు లేదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story