Auto Sales : జనవరిలో కార్ల అమ్మకాల సునామీ.. 4.5 లక్షల ఇళ్లకు చేరిన కొత్త వాహనాలు
4.5 లక్షల ఇళ్లకు చేరిన కొత్త వాహనాలు

Auto Sales : భారత ఆటో మార్కెట్ చరిత్రలో 2026 జనవరి ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోనుంది. దేశీయ మార్కెట్లో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 4,49,616 యూనిట్లకు చేరుకున్నాయి. ఎస్‌యూవీల పట్ల పెరుగుతున్న మక్కువ, కొత్త మోడళ్ల రాక, యూనియన్ బడ్జెట్ 2026లో ఆటో రంగానికి లభించిన ప్రోత్సాహకాలు ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు ఊపందుకోవడం విశేషం.
మారుతి సుజుకీ
దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ తన నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. జనవరిలో ఈ కంపెనీ మొత్తం 2,36,963 వాహనాలను విక్రయించి తన ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పింది. ఇందులో దేశీయ అమ్మకాలు 1.85 లక్షల యూనిట్లు కాగా, ఎగుమతులు ఏకంగా 51,020 యూనిట్లకు చేరుకుని సరికొత్త రికార్డును సృష్టించాయి. ఎర్టిగా, బ్రెజ్జా, కొత్తగా వచ్చిన విక్టోరిస్ వంటి మోడళ్లు మారుతి విజయయాత్రలో కీలక పాత్ర పోషించాయి.
టాటా మోటార్స్
ఈ నెలలో అసలైన సంచలనం టాటా మోటార్స్. గత ఏడాది కంటే ఏకంగా 46 శాతం వృద్ధిని సాధించి, దాదాపు 70,222 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. దీనితో మహీంద్రా, హ్యుందాయ్‌లను వెనక్కి నెట్టి టాటా రెండో స్థానానికి చేరుకుంది. టాటా నెక్సాన్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా మొదటి స్థానంలో నిలిచింది. నెక్సాన్, పంచ్, కొత్తగా వచ్చిన సియెర్రా మోడళ్లకు జనం బ్రహ్మరథం పడుతున్నారు.
మహీంద్రా, హ్యుందాయ్
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా కూడా దుమ్మురేపింది. జనవరిలో 63,510 యూనిట్లను విక్రయించి 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. స్కార్పియో-ఎన్, థార్ రాక్స్, కొత్తగా లాంచ్ అయిన XUV 7XO వంటి మోడళ్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మరోవైపు హ్యుందాయ్ 59,107 యూనిట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. హ్యుందాయ్ క్రెటా ఇప్పటికీ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
మారుతున్న ట్రెండ్
ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ గమనిస్తే జనం చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే ఎస్‌యూవీల వైపే మొగ్గు చూపుతున్నారు. ఎస్‌యూవీల అమ్మకాలు 16 శాతం పెరగగా, ఎంట్రీ లెవల్ చిన్న కార్ల అమ్మకాలు మాత్రం 5 శాతం మేర తగ్గాయి. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, అదిరిపోయే ఫీచర్లు, సురక్షితమైన వాహనాల కోసమే వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కూడా టాటా మోటార్స్ 8,000 పైచిలుకు విక్రయాలతో తన సత్తా చాటింది.

