Jeep Compass: జీప్ కంపాస్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. అత్యంత చవకైన ఆటోమేటిక్ వేరియంట్ లాంచ్
ఆటోమేటిక్ వేరియంట్ లాంచ్

Jeep Compass: భారత మార్కెట్లో ప్రీమియం ఎస్‌యూవీలకు పెట్టింది పేరు అయిన జీప్ ఇండియా తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. అత్యంత ప్రజాదరణ పొందిన జీప్ కంపాస్ ఎస్‌యూవీలో సరికొత్త స్పోర్ట్ 9AT వేరియంట్‌ను కంపెనీ అధికారికంగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.21.99 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటివరకు మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించే బేస్ వేరియంట్లో ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందుబాటులోకి తేవడం విశేషం. తక్కువ బడ్జెట్లో ప్రీమియం డీజిల్ ఆటోమేటిక్ ఎస్యూవీ కోరుకునే వారికి ఇది సరైన ఎంపికగా మారుతుంది.
ఈ కొత్త జీప్ కంపాస్ స్పోర్ట్ 9AT మోడల్లో 2.0-లీటర్ మల్టీజెట్ II టర్బో-డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ పవర్ ఫుల్ ఇంజిన్ 170 hp పవర్‌ను, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి జతగా 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానించారు. రద్దీగా ఉండే నగరాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు పదే పదే గేర్లు మార్చే శ్రమ లేకుండా ఇది ఎంతో సులభమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
బేస్ వేరియంట్ అయినప్పటికీ ఇందులో అనేక మోడ్రన్ ఫెసిలిటీలు కల్పించారు. సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, ఆటో హోల్డ్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ ఓఆర్వీఎంలు ఇచ్చారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే సపోర్ట్ చేసే 21.3 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇందులో ఉంది. అలాగే ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ డ్యాంపింగ్ సస్పెన్షన్, డైనమిక్ స్టీరింగ్ టార్క్ సిస్టమ్ వంటి ఫీచర్లు రోడ్డుపై వాహన నియంత్రణను మరింత మెరుగుపరుస్తాయి.
కస్టమర్ల సౌలభ్యం కోసం కంపెనీ రూ.29,900 ధరతో ప్రత్యేకమైన యాక్సెసరీ ప్యాక్‌ను అందిస్తోంది. ఇందులో యాంబియంట్ లైటింగ్, సేఫ్టీ ఫీచర్లతో కూడిన డాష్‌క్యామ్, ఆల్-వెదర్ ఫ్లోర్ మ్యాట్లు, మడ్ ఫ్లాప్‌లు లభిస్తాయి. నవంబర్ 2026 రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న జీప్ డీలర్‌షిప్‌ల ద్వారా ఈ కార్ల డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఆటోమేటిక్ కారు కొనాలని భావించే మధ్యతరగతి, ఎస్యూవీ ప్రియులకు ఈ మోడల్ మంచి అనుభూతిని ఇస్తుంది.

