Jeep Sales : భారత మార్కెట్‌లో జీప్‌కు ఆదరణ కరువు.. 4 మోడళ్లున్నా నెలకు 300 కూడా దాటని అమ్మకాలు
4 మోడళ్లున్నా నెలకు 300 కూడా దాటని అమ్మకాలు

Jeep Sales : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రతి నెలా లక్షల కొద్దీ కార్లు అమ్ముడవుతున్నప్పటికీ, జీప్ ఇండియా మాత్రం నవంబర్ 2025లో తీవ్ర నిరాశను ఎదుర్కొంది. పవర్ఫుల్ ఎస్‌యూవీల పోర్ట్‌ఫోలియో ఉన్నప్పటికీ ఈ నెలలో జీప్ కేవలం 253 యూనిట్లు మాత్రమే విక్రయించగలిగింది. ఈ సంఖ్య కేవలం పెద్ద బ్రాండ్‌ల కంటే చాలా తక్కువగా ఉండటమే కాక, మిడ్ సైజ్ ఎస్యూవీ విభాగంలో కూడా జీప్ పట్టు బలహీనంగా ఉన్నట్లు స్పష్టం చేస్తోంది. గత సంవత్సరం నవంబర్ (2024) తో పోలిస్తే ఈ అమ్మకాలు దాదాపు 30 శాతం వరకు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి.
జీప్ ఇండియా అమ్మకాల్లో ఇప్పటికీ కంపాస్ మోడల్దే పైచేయి. నవంబర్ 2025లో అమ్ముడైన మొత్తం 253 యూనిట్లలో, జీప్ కంపాస్ వాటా 157 యూనిట్లు. అంటే, జీప్ అమ్మకాల్లో ప్రధాన ఆధారం ఇప్పటికీ కంపాస్ మీదే ఉంది. ఇక ప్రీమియం ఎస్‌యూవీల విషయానికి వస్తే, జీప్ మెరిడియన్ 63 యూనిట్లు, లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ అయిన జీప్ రాంగ్లర్ 19 యూనిట్లు, అత్యంత లగ్జరీ మోడల్ అయిన జీప్ గ్రాండ్ చెరోకీ కేవలం 14 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మిగిలిన మోడళ్లు పరిమిత సంఖ్యలో ఉన్న కొద్దిపాటి కస్టమర్లకే అమ్ముడవుతున్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
జీప్ ఇండియా అమ్మకాల తీరును గత ఆరు నెలలుగా పరిశీలిస్తే, పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదని తెలుస్తోంది. నెలవారీ అమ్మకాలు దాదాపు 210 నుంచి 329 యూనిట్ల మధ్యలోనే పరిమితమయ్యాయి. కంపాస్ అమ్మకాలు కొద్దిగా అటూ ఇటూ మారుతున్నప్పటికీ, గణనీయమైన పెరుగుదల కనిపించలేదు. మెరిడియన్, గ్రాండ్ చెరోకీ వంటి ఖరీదైన ఎస్‌యూవీల అమ్మకాలు నిలకడగా తక్కువగానే ఉన్నాయి. అంటే, గత ఆర్నెళ్ల కాలంలో జీప్ అమ్మకాలు స్థిరంగా ఉన్నా, ఆ స్థిరత్వం తక్కువ స్థాయిలోనే కొనసాగుతోంది.
జీప్ వంటి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బ్రాండ్ అమ్మకాలు దేశీయ మార్కెట్‌లో 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండటానికి అనేక కారణాలున్నాయి. పరిమిత మోడల్ లైనప్ (కేవలం 4 మోడళ్లు మాత్రమే ఉండటం), ఇతర పోటీదారుల కంటే ఎక్కువ ధర , ఎక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ప్రధాన కారణాలుగా భావించవచ్చు. వీటితో పాటు దేశవ్యాప్తంగా డీలర్‌షిప్, సర్వీస్ సెంటర్ల నెట్‌వర్క్ తక్కువగా ఉండటం కూడా అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. ఈ మధ్యకాలంలో భారతీయ వినియోగదారులు అధునాతన ఫీచర్లు, తక్కువ ధర ఉండే వాహనాల వైపు మొగ్గు చూపడం కూడా జీప్ అమ్మకాలపై పడిన మరో కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

