Jeep : ఫార్చ్యూనర్, ఎండీవర్‌లకు చెక్..7 ఏళ్ల వారంటీతో జీప్ కంపెనీ మార్కెట్‌లో ప్రకంపనలు
7 ఏళ్ల వారంటీతో జీప్ కంపెనీ మార్కెట్‌లో ప్రకంపనలు

Jeep : ప్రముఖ లగ్జరీ ఎస్‌యూవీల తయారీ సంస్థ జీప్ ఇండియా తన కస్టమర్ల కోసం ఒక అదిరిపోయే బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తన పాపులర్ మోడల్స్ అయిన కంపాస్, మెరిడియన్ కొనుగోలుదారుల కోసం కాన్ఫిడెన్స్ 7 అనే సరికొత్త ఓనర్‌షిప్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. కారు కొన్నప్పటి నుంచి ఏడేళ్ల వరకు కస్టమర్‌కు ఎలాంటి టెన్షన్ లేకుండా చేయడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. ఇందులో మొత్తం 7 రకాల అద్భుతమైన ప్రయోజనాలను జీప్ అందిస్తోంది.
జీప్ ఇండియా ప్రకటించిన ఈ కొత్త ప్లాన్‌లో కస్టమర్లను ఊరించే అతిపెద్ద ఫీచర్ అష్యూర్డ్ బైబ్యాక్. అంటే, మీరు కారు కొన్న 3 ఏళ్ల తర్వాత తిరిగి అమ్మాలనుకుంటే, కారు ఎక్స్-షోరూమ్ ధరలో ఏకంగా 60 శాతం మొత్తాన్ని వెనక్కి ఇస్తామని కంపెనీ గ్యారెంటీ ఇస్తోంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జీప్ డీలర్‌షిప్స్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే, కారు నిర్దేశించిన మైలేజీ లోపు ఉండాలి. దీనివల్ల కారు రీసేల్ వాల్యూ పడిపోతుందనే భయం కస్టమర్లకు అస్సలు ఉండదు.
చాలామంది లగ్జరీ కార్లు కొనడానికి భయపడేది వాటి మెయింటెనెన్స్ ఖర్చు చూసి. కానీ జీప్ ఇప్పుడు ఆ భయాన్ని పోగొట్టింది. ఈ ప్లాన్ కింద కంపాస్ కారు మెయింటెనెన్స్ ఖర్చు రోజుకు కేవలం రూ.38 నుంచి, మెరిడియన్ కారుకు రూ.43 నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా, స్పేర్ పార్ట్స్, లేబర్ ఛార్జీలపై ఏకంగా 33 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తారు. ఈ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఏడేళ్ల వరకు వర్తిస్తుంది, దీనివల్ల కస్టమర్లకు భారీగా డబ్బు ఆదా అవుతుంది.
జీప్ తన వాహనాలపై ఇప్పుడు ఏకంగా 7 ఏళ్ల పొడిగించిన వారంటీని అందిస్తోంది. ఒకవేళ మీరు ఈ ఏడేళ్ల లోపు కారును వేరే ఎవరికైనా అమ్మినా, ఆ వారంటీ కొత్త యజమానికి బదిలీ అవుతుంది. దీనివల్ల కారుకు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే, 7 ఏళ్ల పాటు ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా లభిస్తుంది. అంటే అర్ధరాత్రి ఎక్కడైనా కారు ఆగిపోయినా జీప్ టీమ్ వచ్చి మీకు సాయం చేస్తుంది.
సర్వీస్ సెంటర్‌లో కారు రెండు రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే, కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా జీప్ ఒక లోనర్ వెహికల్ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఒకవేళ కారు అందుబాటులో లేకపోతే, కస్టమర్ ప్రయాణాల కోసం క్యాబ్ సదుపాయాన్ని కూడా కంపెనీయే ఏర్పాటు చేస్తుంది. వీటితో పాటు 90 నుంచి 180 నిమిషాల్లో కారును సర్వీస్ చేసి ఇచ్చే ఎక్స్‌ప్రెస్ సర్వీస్, రూ.2000 విలువైన జీప్ లైఫ్‌స్టైల్ మర్చండైజ్ వోచర్ కూడా ఈ కాన్ఫిడెన్స్ 7 ప్రోగ్రామ్‌లో భాగంగా లభిస్తాయి.

