Range Rover Price : టాటా సంచలనం.. కోటి రూపాయల వరకు తగ్గనున్న రేంజ్ రోవర్ ధర
కోటి రూపాయల వరకు తగ్గనున్న రేంజ్ రోవర్ ధర

Range Rover Price : భారతదేశంలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్ల కంపెనీగా పేరున్న జగువార్ లాండ్ రోవర్, తన కస్టమర్లకు భారీ కానుక ఇవ్వబోతోంది. భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కారణంగా ఈ సంస్థ తన కార్ల ధరలను భారీగా తగ్గించే మొదటి కంపెనీగా నిలవనుంది. ఈ ఒప్పందం ప్రకారం, బ్రిటన్ నుంచి నేరుగా దిగుమతి చేసుకునే కార్లపై ఉండే ఇంపోర్ట్ డ్యూటీని ఏకంగా 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు. దీనివల్ల కొన్ని మోడళ్ల ధరలు ఊహించని రీతిలో దిగిరానున్నాయి.
ముఖ్యంగా ఈ ధరల తగ్గింపు ప్రయోజనం రేంజ్ రోవర్ SV మోడళ్లపై ఎక్కువగా ఉండనుంది. మన దేశంలో అలియా భట్, రణవీర్ సింగ్, సోనమ్ కపూర్ వంటి స్టార్ సెలబ్రిటీలందరి దగ్గరా ఈ కార్లే ఉన్నాయి. ప్రస్తుతం ఈ కార్ల ధరలు 3 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉన్నాయి. అయితే తాజా ఒప్పందంతో వీటి ధరల్లో 13 నుంచి 25 శాతం వరకు కోత పడే అవకాశం ఉంది. అంటే, టాప్ ఎండ్ వేరియంట్లపై గరిష్టంగా 1.06 కోట్ల రూపాయల వరకు ధర తగ్గే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నిర్దిష్ట మోడళ్లను గమనిస్తే, ప్రస్తుతం రూ.2.75 కోట్లు పలుకుతున్న రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ఎడిషన్ టూ ధర సుమారు రూ.2.35 కోట్లకు చేరవచ్చు. అంటే దాదాపు 40 లక్షల రూపాయల ఆదా అన్నమాట. అలాగే రూ. 4.25 కోట్ల విలువైన 4.4 లీటర్ పెట్రోల్ SV మోడల్ ధర ఏకంగా రూ.3.19 కోట్లకు పడిపోయే అవకాశం ఉంది. దీంతో పాటు రూ.2.05 కోట్లకే కొత్త స్టాండర్డ్ రేంజ్ రోవర్ స్పోర్ట్ SV వేరియంట్‌ను కూడా కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. బ్రిటన్ నుంచి నేరుగా వచ్చే SV మోడళ్లకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. మన దేశంలోని పుణె ప్లాంట్‌లో అసెంబుల్ చేసే వెలార్, డిస్కవరీ స్పోర్ట్ వంటి మోడళ్లపై ఇప్పటికే తక్కువ డ్యూటీ ఉంది కాబట్టి వాటి ధరల్లో మార్పు ఉండదు. అలాగే డిఫెండర్ కారు స్లోవేకియాలో తయారవుతుంది కాబట్టి దానిపై కూడా బ్రిటన్ డీల్ ప్రభావం ఉండదు. ప్రస్తుతం భారత లగ్జరీ కార్ల మార్కెట్‌లో 25 శాతం వాటా కలిగిన జగువార్‌కు, ఈ ధరల తగ్గింపు మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూలతో పోటీ పడటంలో పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.

