Kawasaki : కవాసాకి అదిరిపోయే ఆఫర్.. ఫిబ్రవరిలో బైక్‌లపై ఏకంగా రూ.2.50 లక్షల తగ్గింపు
ఫిబ్రవరిలో బైక్‌లపై ఏకంగా రూ.2.50 లక్షల తగ్గింపు

Kawasaki : సూపర్ బైక్ ప్రియులకు ఇది అదిరిపోయే శుభవార్త. ప్రముఖ స్పోర్ట్స్ బైక్ తయారీ సంస్థ కవాసాకి ఇండియా ఫిబ్రవరి నెలకు గాను తన బైక్ లైనప్‌పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కొత్త ఏడాది ప్రారంభంలో ఇచ్చిన ఆఫర్లను ఫిబ్రవరి 28, 2026 వరకు పొడిగిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. కొన్ని మోడళ్లపై ఏకంగా రూ.2.50 లక్షల వరకు నగదు తగ్గింపు లభిస్తుండగా, మరికొన్నింటిపై ఖరీదైన యాక్సెసరీలను ఉచితంగా అందిస్తోంది.
కవాసాకి తన ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన Kawasaki ZX-10R పై ఏకంగా రూ.2.50 లక్షల భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో దీని పాత ధర రూ.20.79 లక్షల నుంచి రూ.18.29 లక్షలకు తగ్గింది. అలాగే Ninja 1100SX పై రూ.1.43 లక్షల తగ్గింపును ఇస్తోంది. మధ్యశ్రేణి బైక్ అయిన Ninja 650 పై రూ.27,000, Ninja 500 పై రూ.17,000, ఎంట్రీ లెవల్ సూపర్ బైక్ Ninja 300 పై రూ.28,000 నగదు తగ్గింపు లభిస్తోంది. కేవలం డబ్బులే కాకుండా, ZX-6R కొనేవారికి రూ.83,000 విలువైన ఓలిన్స్ స్టీరింగ్ డ్యాంపర్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది.
అయితే ఈ డిస్కౌంట్ల వెనుక ఒక చిన్న ట్విస్ట్ ఉంది. నింజా 650, నింజా 500, నింజా 300 మోడళ్లపై ఇస్తున్న ఆఫర్లు కేవలం పాత స్టాక్ (MY24/MY25) మీద మాత్రమే వర్తిస్తాయి. ఈ పాత మోడళ్లు E20 ఇంధనానికి (20% ఇథనాల్ కలిపిన పెట్రోల్) అనుకూలమైనవి కావు. అందుకే కంపెనీ తన పాత స్టాక్‌ను త్వరగా వదిలించుకోవడానికి ఈ స్థాయిలో ధరలను తగ్గిస్తోంది. కొత్తగా వస్తున్న MY26 మోడళ్లు మాత్రమే E20 ఫ్యూయల్ నిబంధనలకు అనుగుణంగా తయారు చేయబడ్డాయి.
ప్రస్తుతం భారత ప్రభుత్వం పర్యావరణ హితమైన E20 ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. మీ బైక్ ఇంజిన్ ఈ ఇంధనానికి అనుగుణంగా లేకపోతే, భవిష్యత్తులో మెయింటెనెన్స్ సమస్యలు తలెత్తవచ్చు. నాన్-E20 ఇంజిన్లలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడటం వల్ల ఇంజిన్ పనితీరు తగ్గడమే కాకుండా, మైలేజీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి డిస్కౌంట్ వస్తుంది కదా అని కొనే ముందు, మీ ప్రాంతంలో లభించే ఇంధనం, బైక్ ఇంజిన్ సామర్థ్యాన్ని ఒకసారి సరిచూసుకోవడం మంచిది.
కావాసాకి ధరలు తగ్గించినప్పటికీ, 650cc కంటే తక్కువ విభాగంలో ఇప్పటికీ పోటీదారుల కంటే ఎక్కువ ధరనే కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, నింజా 300 చాలా పాత మోడల్. ఇందులో ఇప్పటికీ పాత డిజైన్ మరియు పరిమిత ఫీచర్లు ఉన్నాయి. అదే బడ్జెట్‌లో ప్రస్తుతం మార్కెట్లో అదిరిపోయే ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్లతో ఇతర బ్రాండ్ బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే కావాసాకి బ్రాండ్ ఇమేజ్, ఆ గ్రీన్ కలర్ నింజా క్రేజ్ ఇష్టపడే వారికి మాత్రం ఈ ఆఫర్లు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.

