Kawasaki KLX 230 : హీరో ఎక్స్పల్స్కు పోటీగా రూ.1.30 లక్షలు తగ్గించిన కావాసాకి బైక్
రూ.1.30 లక్షలు తగ్గించిన కావాసాకి బైక్

Kawasaki KLX 230 : బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఆఫ్-రోడ్ రైడింగ్‌ను ఇష్టపడే వారికి ఇది నిజంగా బంపర్ ఆఫర్. ప్రముఖ జపాన్ కంపెనీ కవాసాకి తమ పాపులర్ KLX 230 బైక్ ధరను ఏకంగా రూ.1.30 లక్షలు తగ్గించి షాకిచ్చింది. గతంలో ఈ బైక్ ధర రూ. 3.33 లక్షలు ఉండగా, ఇప్పుడు కేవలం రూ. 1.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్లోకి వచ్చింది. ఈ ధర తగ్గింపుతో ఇది ఇప్పుడు ఈ సెగ్మెంట్‌లో అత్యంత అట్రాక్టివ్ ఆప్షన్ కానుంది. అంతేకాకుండా, హీరో ఎక్స్‌పల్స్ 210 వంటి బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
కవాసాకి KLX 230 ధరలో ఇంత భారీ తగ్గింపుకు ప్రధాన కారణం మేడ్ ఇన్ ఇండియా పాలసీ. ఈ బైక్‌ను ఇప్పుడు భారత్‌లోనే తయారు చేయాలని కంపెనీ నిర్ణయించింది. దీనివల్ల తయారీ ఖర్చు బాగా తగ్గింది. ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించేందుకే ఈ ధర తగ్గింపును ప్రకటించింది. ఈ బైక్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని, పాత బైక్‌లో ఉన్న అన్ని ఫీచర్లు, ఇంజిన్, టెక్నాలజీ అలాగే కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. కాబట్టి, ధర తగ్గిందని బైక్ క్వాలిటీ తగ్గుతుందని భయపడాల్సిన అవసరం లేదు.
కొత్త మేడ్ ఇన్ ఇండియా కవాసాకి KLX 230 బైక్‌లో ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ ఉంటాయి. ఇవి సుమారుగా 240 మి.మీ, 250 మి.మీ ట్రావెల్ కెపాసిటీని కలిగి ఉంటాయి. ఈ బైక్‌కు 21-18 వైర్-స్పోక్ వీల్స్ ఉంటాయి. దీనివల్ల 265 మి.మీ మంచి గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. ఆఫ్-రోడ్ రైడింగ్‌కు ఇది చాలా ఉపయోగపడుతుంది. సేఫ్టీ బ్రేకింగ్ కోసం రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 7.6 లీటర్లు.
KLX 230 బైక్‌లో పాతకాలపు సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ అమర్చబడింది. 233 సీసీ కెపాసిటీ ఉన్న ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 18 బీహెచ్‌పీ పవర్‌ను, 18 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూస్తే పెద్దగా అనిపించకపోవచ్చు కానీ, ఈ ఇంజిన్, బైక్ బరువు (136 కిలోలు), లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ కలయిక దీనిని అత్యంత కెపాసిటీ ఉన్న ఆఫ్-రోడర్‌గా నిలబెడుతుంది.
భారత మార్కెట్లో కావాసాకి KLX 230కి ప్రధాన ప్రత్యర్థి హీరో ఎక్స్‌పల్స్ 210. ఎక్స్‌పల్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.75 లక్షలు. ఇందులో కూడా KLX 230 లాగే లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. ముందు వైపు 210 మి.మీ, వెనుక వైపు 205 మి.మీ ట్రావెల్ ఉంటుంది. ఎక్స్‌పల్స్ 21-18 వైర్ స్పోక్ వీల్స్, డ్యూయల్ ఛానల్ ABSతో పాటు రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఎక్స్‌పల్స్ 210 సీసీ, లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 24 బీహెచ్‌పీ పవర్, 21 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది. ఇంజిన్ పవర్ విషయంలో ఎక్స్‌పల్స్ 210 కొంచెం ముందున్నా, బరువు విషయంలో మాత్రం KLX 230 (136 కిలోలు) చాలా తక్కువగా ఉంది. ఎక్స్‌పల్స్ బరువు 170 కిలోలు.

