Kawasaki Z1100 : కవాసాకి Z సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన బైక్ లాంచ్.. Z1100 ధర, ఫీచర్లు ఇవే
Z1100 ధర, ఫీచర్లు ఇవే

Kawasaki Z1100 : ఇండియన్ సూపర్‌బైక్ మార్కెట్‌లో కవాసాకి కంపెనీ తన కొత్త 2026 Z1100, Z1100 SE సూపర్ నేకెడ్ బైక్‌లను లాంచ్ చేసింది. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం, ఈ బైక్ Z సిరీస్‌లోనే ఇప్పటివరకు వచ్చిన వాటిలోకెల్లా అత్యంత శక్తివంతమైనది, అతిపెద్ద ఇంజన్‌ను కలిగి ఉంది. పాత Z1000 మోడల్‌కు అప్‌డేటెడ్, పవర్‌ఫుల్ వెర్షన్‌గా వచ్చిన ఈ బైక్ ధర రూ. 12.79 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. 1,099cc ఇంజన్, హై-టెక్ ఫీచర్స్‌తో వచ్చిన ఈ బైక్ వివరాలు తెలుసుకుందాం.
కొత్త కవాసాకి Z1100 ప్రారంభ ధర రూ. 12.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ కవాసాకి ప్రసిద్ధ సుగోమి డిజైన్ ఫిలాసఫీపై ఆధారపడి ఉంటుంది. బైక్‌ను పూర్తిగా డార్క్ థీమ్‌లో తయారు చేయడంతో ఇది మరింత అగ్రెస్సివ్, పవర్ఫుల్ గా కనిపిస్తుంది.ఇందులో ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ హెడ్‌లైట్, స్పోర్టీ టెయిల్ సెక్షన్, ప్రత్యేక డిజైన్ ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి. Z1100 SE వెర్షన్‌లో మరింత ప్రీమియం డీటైలింగ్ మరియు ప్రత్యేకమైన అల్లాయ్ వీల్ డిజైన్‌ను అందించారు. కొత్త కవాసాకి Z1100 అతిపెద్ద ప్రత్యేకత దాని ఇంజన్.
ఇందులో 1,099cc ఇన్‌లైన్-4, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 136 PS శక్తిని, 113 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనిని స్పీడ్ యాక్సిలరేషన్ కోసం ప్రత్యేకంగా ట్యూన్ చేశారు. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. కవాసాకి క్విక్ షిఫ్టర్ ఫీచర్ ఉండడం వల్ల, రైడర్ క్లచ్ ఉపయోగించకుండానే సులభంగా గేర్ మార్చుకోవచ్చు. ఇది సిటీ డ్రైవింగ్‌ను సులభతరం చేస్తుంది. ఇందులో ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉంది, ఇది లాంగ్ రైడ్‌లను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.
బైక్‌లో 5 అంగుళాల ఫుల్ డిజిటల్ TFT డిస్‌ప్లే ఇచ్చారు. ఇది బ్లూటూత్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. రైడోలజీ యాప్‌తో కనెక్ట్ చేయడం ద్వారా మీరు నేవిగేషన్, కాల్ అలర్ట్‌లు, నోటిఫికేషన్‌లను డిస్‌ప్లేపై చూసుకోవచ్చు. రైడర్ సేఫ్టీ కోసం కావాసకి అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అందించింది. IMU-ఆధారిత కవాసాకి కార్నరింగ్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్ ఫీచర్ ఉంది. దీనివల్ల ముఖ్యంగా వేగంగా మలుపులు (కార్నరింగ్) తీసుకునేటప్పుడు బైక్ బ్యాలెన్స్‌గా, స్థిరంగా ఉంటుంది.
కవాసాకి ఇంటెలిజెంట్ ఏబీఎస్, మల్టీ-మోడ్ ట్రాక్షన్ కంట్రోల్ వంటివి కూడా ఉన్నాయి. ఇవి రోడ్డు పరిస్థితి ఎలా ఉన్నా (జారే రోడ్లు లేదా హై స్పీడ్) బైక్‌కు మెరుగైన గ్రిప్, కంట్రోల్‌ను అందిస్తాయి.

