Kawasaki: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ కవాసాకి తమ 2027 KLE500 అడ్వెంచర్ మోటార్ సైకిల్ లైనప్‌ను మరింత విస్తరించింది. ఈ సిరీస్‌లో భాగంగా అత్యంత అడ్వాన్సుడ్ టెక్నాలజీతో కూడిన SE స్మార్ట్‌రైడ్ మోడల్‌ను ప్రపంచ వేదికపై ప్రదర్శించింది. సాధారణ మోటార్ సైకిళ్లలో ఆగేటప్పుడు లేదా ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు హ్యాండ్ క్లచ్ లెవర్‌ను వాడాల్సి ఉంటుంది. అయితే ఈ కొత్త బైక్‌లో మెకానికల్ సెంట్రిఫ్యూగల్ క్లచ్ సిస్టమ్‌ను పొందుపరచడం ద్వారా క్లచ్ లెవర్ ఉపయోగించకుండానే బైక్‌ను ఆపడం అలాగే ముందుకు తీసుకెళ్లడం సాధ్యమవుతుంది.

హోండా ఇ-క్లచ్ వర్సెస్ కవాసాకి స్మార్ట్‌రైడ్ టెక్నాలజీ

కవాసాకి పరిచయం చేసిన ఈ స్మార్ట్‌రైడ్ సిస్టమ్ మొదటి చూపులో హోండా సంస్థకు చెందిన ఇ-క్లచ్ టెక్నాలజీలా అనిపించినప్పటికీ, రెండింటి పనితీరులో వ్యత్యాసం ఉంది. హోండా తన బైక్స్‌లో క్లచ్ మూవ్‌మెంట్‌ను ఆటోమేట్ చేయడానికి ఎలక్ట్రో-మెకానికల్ యాక్చుయేటర్లను ఉపయోగిస్తుంది. కానీ కవాసాకి పూర్తిగా మెకానికల్ సెంట్రిఫ్యూగల్ క్లచ్ విధానంపై ఆధారపడి ఈ వ్యవస్థను రూపొందించింది. రైడింగ్ చేసే సమయంలో గేర్లు మార్చడానికి మాత్రం రైడర్లు సాధారణ పద్ధతిలోనే క్లచ్ లెవర్, గేర్ పెడల్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

పవర్‌ఫుల్ 451cc ఇంజిన్, ట్యూబ్‌లెస్ టైర్ల ప్రత్యేకత

సాంకేతిక మార్పులతో పాటు ఈ స్మార్ట్‌రైడ్ వేరియంట్‌లో ట్యూబ్‌లెస్ టైర్లను అందించారు. సాధారణ SE వర్షన్‌లో ట్యూబ్-టైప్ టైర్లు అందుబాటులో ఉంటాయి. హార్డ్‌వేర్ విషయానికి వస్తే, ఇందులో 451cc పారలల్-ట్విన్ ఇంజిన్ అమర్చబడింది. ఈ ఇంజిన్ 9,000 ఆర్పీఎం వద్ద 45 బిహెచ్‌పి పవర్, 6,000 ఆర్పీఎం వద్ద 42.6 ఎన్‌ఎమ్ టాక్ ఉత్పత్తి చేస్తుంది. లాంచ్ సమయంలో ఈ బైక్ కేవలం 'పర్ల్ బ్లిజార్డ్ వైట్' రంగులో మాత్రమే లభించనుంది.

భారత మార్కెట్ పోటీ, లాంచ్ అంచనాలు

భారతీయ మార్కెట్లోకి ఈ మోడల్ సీబీయూ (Completely Built Unit) రూపంలో దిగుమతి అయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా దీని ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మార్కెట్లోకి రానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750, నార్టన్ అట్లాస్ వంటి 500cc అబోవ్ అడ్వెంచర్ మోటార్ సైకిళ్లకు ఇది ప్రధాన పోటీదారుగా నిలవనుంది. రాబోయే కొన్ని నెలల వ్యవధిలో ఈ వాహనాన్ని అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసేందుకు కవాసాకి ప్రణాళికలు రచిస్తోంది.

Next Story