2026లో రాబోతున్న 2 అదిరిపోయే ఎస్‍యూవీలు ఇవే

Kia : ఎలక్ట్రిక్ కార్ల వైపు ప్రపంచం అడుగులు వేస్తున్నా, ప్రస్తుతం హైబ్రిడ్ కార్ల క్రేజ్ భారత్‌లో విపరీతంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ వాహన తయారీ సంస్థలు కియా, రెనాల్ట్ తమ అమ్ములపొదిలో నుంచి రెండు పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఎస్‍యూవీలను 2026 లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. కియాకు ఇది భారత్‌లో తొలి హైబ్రిడ్ మోడల్ కానుండగా, రెనాల్ట్ కూడా తన ఐకానిక్ డస్టర్‌ను సరికొత్త హైబ్రిడ్ అవతారంలో తీసుకురాబోతోంది.

కియా సొరెంటో హైబ్రిడ్: కియా తన ప్రీమియం 7-సీటర్ ఎస్‍యూవీ సొరెంటోను 2026 ద్వితీయార్థంలో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇది ఇప్పటికే విదేశాల్లో నాలుగో తరం మోడల్‌గా అదరగొడుతోంది. భారత్‌లో దీనిని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు బలమైన హైబ్రిడ్ టెక్నాలజీతో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోపల డ్యూయల్ డిజిటల్ డిస్ప్లేలు, వెంట్ిలేటెడ్ సీట్లు, బోస్ ఆడియో సిస్టమ్, లెవల్-2 ADAS వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉండబోతున్నాయి. ఇది ప్రధానంగా టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీని ఇస్తుంది.

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ : భారతీయ రోడ్లపై ఒకప్పుడు రాజ్యమేలిన రెనో డస్టర్ మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. జనవరి 26, 2026న ముందుగా దీని పెట్రోల్ వెర్షన్‌ను పరిచయం చేసి, ఆ తర్వాత ఆరు నెలల్లోనే హైబ్రిడ్ మోడల్‌ను లాంచ్ చేస్తారు. దీని హైబ్రిడ్ వెర్షన్‌లో 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.2kWh బ్యాటరీ, డ్యూయల్ మోటార్ సెటప్ ఉంటుంది. ఇది మొత్తం 140bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం సిటీ డ్రైవింగ్‌లోనే 80 శాతం వరకు ఎలక్ట్రిక్ మోడ్‌లో నడపవచ్చని కంపెనీ చెబుతోంది. ఇందులో 4X4 డ్రైవ్ సిస్టమ్ కూడా లభించే అవకాశం ఉంది.

హైబ్రిడ్ కార్ల వల్ల లాభమేంటి?

ఈ హైబ్రిడ్ కార్ల ప్రత్యేకత ఏమిటంటే..వీటికి ఎలక్ట్రిక్ కార్లలా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. కారు నడుస్తున్నప్పుడే బ్యాటరీ దానంతట అదే ఛార్జ్ అవుతుంది. దీనివల్ల మైలేజీ అద్భుతంగా ఉంటుంది. పర్యావరణానికి కూడా తక్కువ నష్టం జరుగుతుంది. పెట్రోల్ ధరలు మండుతున్న ఈ రోజుల్లో కియా, రెనాల్ట్ తీసుకువస్తున్న ఈ హైబ్రిడ్ ఎస్‍యూవీలు మధ్యతరగతి, ప్రీమియం కస్టమర్లకు బెస్ట్ ఆప్షన్ కానున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story