ఈ కారుకు నెలలో 21వేల బుకింగ్స్

Kia : భారతీయ మార్కెట్లో మారుతి ఎర్టిగా, టయోటా ఇన్నోవా వంటి కార్లు చాలా కాలం పాటు 7 సీటర్ విభాగంలో తమ ఆధిపత్యాన్ని చూపించాయి. కానీ ఇప్పుడు కియా ఇండియా నుంచి వచ్చిన ఒక కొత్త కారు ఈ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తోంది. కేవలం ఒక నెల క్రితం లాంచ్ అయిన కియా కారెన్స్ క్లావిస్, దాని ఎలక్ట్రిక్ వెర్షన్‌కు ప్రజల నుంచి ఊహించని స్పందన వస్తోంది. లాంచ్ అయినప్పటి నుంచి కేవలం ఒక్క నెలలోనే ఈ కారు రెండు మోడళ్లకు కలిపి 21 వేలకు పైగా బుకింగ్స్ వచ్చాయి. ఇది ఈ సెగ్మెంట్‌లోని ఇతర కార్లకు పెద్ద సవాల్‌గా మారింది.

కియా కారెన్స్ క్లావిస్ పెట్రోల్-డీజిల్ వెర్షన్ ఈ ఏడాది మే నెలలో దాని ఎలక్ట్రిక్ వెర్షన్ జూలైలో లాంచ్ అయ్యాయి. అయితే, ప్రజలు ఎక్కువగా పెట్రోల్-డీజిల్ మోడల్‌పైనే ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన 21 వేల బుకింగ్స్‌లో కేవలం 1000 బుకింగ్స్ మాత్రమే ఎలక్ట్రిక్ వెర్షన్‌కు రాగా, మిగిలినవి అన్నీ పెట్రోల్-డీజిల్ మోడల్‌కే రావడం విశేషం.

కియా కారెన్స్ క్లావిస్ అనేది కియా కారెన్స్ కారుకి అప్‌డేటెడ్ వెర్షన్. దీనిని మరింత ఆధునికంగా, ప్రీమియంగా తీర్చిదిద్దారు. కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, కొత్త LED DRLలు, MFR LED హెడ్‌ల్యాంప్‌లు ముందు భాగంలో ఉన్నాయి. వెనుక భాగంలో ఎల్ఈడీ కనెక్టెడ్ టెయిల్‌లైట్, కొత్త బంపర్ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ఈ కారు మార్కెట్లో మారుతి ఎర్టిగా, మారుతి XL6, టయోటా ఇన్నోవాతో పాటు ఎలక్ట్రిక్ కార్లైన టాటా హారియర్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఈవీ, టాటా నెక్సన్ ఈవీ వంటి వాటికి పోటీ ఇస్తోంది.

క్లావిస్ ఇంటీరియర్స్‌లో కూడా చాలా మార్పులు చేశారు. డ్యాష్‌బోర్డ్‌పై డ్యూయల్ డిజిటల్ స్క్రీన్‌లు, బ్లూ, బేజ్ రంగుల సీట్ కవర్లు, ప్యానోరమిక్ సన్‌రూఫ్, లెవెల్-2 ADAS వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు బోస్ సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, డ్యూయల్ డాష్‌క్యామ్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు కారుకు మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

ఈ SUV 6, 7 సీటర్ ఆప్షన్లలో లభిస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, రియర్ ఆక్యూపెంట్ అలర్ట్, మొత్తం 18 అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కారెన్స్ క్లావిస్‌లో 1.5-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ.11.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి.

కొత్త కియా కారెన్స్ క్లావిస్ EVలో పెట్రోల్-డీజిల్ వెర్షన్ ఫీచర్లు అన్నీ ఉంటాయి. డిజైన్ కూడా దాదాపుగా ఒకేలా ఉంటుంది. బేస్ వేరియంట్ 42 kWh బ్యాటరీని కలిగి ఉండి ఒకసారి ఛార్జ్ చేస్తే 404 కి.మీ.ల రేంజ్ ఇస్తుంది. టాప్ వేరియంట్ 51.4 kWh బ్యాటరీని కలిగి ఉండి ఒకసారి ఛార్జ్ చేస్తే 490 కి.మీ.ల రేంజ్ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. 100 kW DC ఛార్జర్‌తో కేవలం 39 నిమిషాల్లో 10% నుండి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. దీని ధర రూ.17.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story