Kia Carens : భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా సరికొత్త మైలురాయిని అందుకుంది. ఆ కంపెనీకి చెందిన పాపులర్ 7-సీటర్ ఫ్యామిలీ కారు కియా కారెన్స్ సరికొత్త అమ్మకాల రికార్డును సృష్టించింది. కారెన్స్ ఫ్యామిలీకి చెందిన కార్ల మొత్తం విక్రయాలు మన దేశంలో ఏకంగా 3 లక్షల యూనిట్ల మార్కును దాటినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ అద్భుతమైన అమ్మకాల రికార్డులో సాధారణ కియా కారెన్స్‌తో పాటు, ప్రీమియం మోడల్ కారెన్స్ క్లావిస్, ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ కారు కారెన్స్ క్లావిస్ ఈవీ సేల్స్ కూడా కలిసి ఉన్నాయి.

మారుతి ఎర్టిగాకు పెరుగుతున్న టెన్షన్

కియా ఇండియా సంస్థ ఈ కారెన్స్ మోడల్‌ను మొదటిసారిగా 2022 లో భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. అప్పటి నుండి ఈ ఎంపీవీ మోడల్ దేశీయంగా ఫ్యామిలీ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. మార్కెట్లో ఇప్పటికే మంచి పట్టున్న మారుతి సుజుకి ఎర్టిగా వంటి కార్లకు ఇది గట్టి పోటీనిస్తోంది. కాలంతో పాటు మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కియా కంపెనీ ఈ కారులో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ టెక్నాలజీ, ప్రీమియం కంఫర్ట్ సదుపాయాలను అప్‌డేట్ చేస్తూ వస్తోంది. ఈ నిరంతర అప్‌డేట్స్ వల్లే మార్కెట్లో దీని క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.

పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో ఏ మోడల్ ఎక్కువ అమ్ముడైంది?

మార్కెట్లో కారెన్స్ కారుకు ఉన్న డిమాండ్‌ను మరింతగా పెంచేందుకు కంపెనీ మొదట ప్రీమియం లుక్‌తో కారెన్స్ క్లావిస్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత పర్యావరణహితంగా కారు కొనాలనుకునే వారికోసం కారెన్స్ క్లావిస్ ఈవీ అనే ఎలక్ట్రిక్ మోడల్‌ను కూడా రంగంలోకి దించింది. ప్రస్తుతం ఈ కారు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ అనే మూడు ఇంధన ఆప్షన్లలో లభిస్తోంది. కంపెనీ వెల్లడించిన లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు అమ్ముడైన మొత్తం కారెన్స్ కార్లలో సింహభాగం పెట్రోల్ మోడల్స్‌దే కావడం విశేషం. దాదాపు 60 శాతం మంది కస్టమర్లు పెట్రోల్ వేరియంట్‌ను కొనుగోలు చేయగా, 30 శాతం మంది డీజిల్ మోడల్‌ను ఎంచుకున్నారు. ఇక కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ ఈవీ మోడల్ కూడా మంచి ఆదరణ పొందుతూ మొత్తం అమ్మకాల్లో 10 శాతం వాటాను దక్కించుకుంది.

ప్రీమియం లుక్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు

ఇక భారతీయ కారు కొనుగోలుదారుల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులను కూడా ఈ సేల్స్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. బడ్జెట్ తక్కువగా ఉండే బేస్ మోడల్స్ కంటే కూడా.. ఎక్కువ ఫీచర్లు, లగ్జరీ లుక్ ఉండే టాప్ ఎండ్ వేరియంట్లను కొనడానికే కస్టమర్లు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని కియా ఇండియా తెలిపింది. మొత్తం అమ్మకాల్లో దాదాపు 18 శాతం వాటా కేవలం టాప్ వేరియంట్లదే ఉండటం విశేషం. ఈ టాప్ మోడల్స్‌లో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ప్రీమియం లెదర్ ఇంటీరియర్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. అలాగే మార్కెట్లో 6-సీటర్, 7-సీటర్ రెండు సిట్టింగ్ ఆప్షన్లకు సమానంగా డిమాండ్ ఉంది.

కియా నుంచి రాబోతున్న సరికొత్త ఈవీ, హైబ్రిడ్ కార్లు

ప్రస్తుతం 2026 సంవత్సరంలో కియా ఇండియా తన సేల్స్ వేగాన్ని భారీగా పెంచింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలోనే కంపెనీ తన చరిత్రలోనే అత్యధిక అమ్మకాలను నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సక్సెస్‌లో కియా సెల్టోస్, సోనెట్ కార్లతో పాటు కారెన్స్ కూడా కీలక పాత్ర పోషించింది. ఇదే ఊపుతో రాబోయే రోజుల్లో భారత మార్కెట్లో మరిన్ని ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను లాంచ్ చేసేందుకు కియా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే కియా సైరోస్ ఈవీని మార్కెట్లోకి తీసుకురానున్నారు. దీనితో పాటు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్న కియా సొరెంటో హైబ్రిడ్ ఎస్‌యూవీని కూడా భారత్‌కు తీసుకువస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story