Kia Motors : ప్రస్తుత రోజుల్లో వాహనదారులు కొత్తగా కారు కొనేటప్పుడు కేవలం మైలేజ్, లుక్స్, ఫీచర్లు లేదా ధరలను మాత్రమే ప్రాధాన్యతగా తీసుకోవడం లేదు. ప్రయాణంలో తమ కుటుంబానికి ఎంతవరకు రక్షణ లభిస్తుందనే సేఫ్టీ రేటింగ్స్‎ను అత్యంత కీలకమైన అంశంగా చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోడళ్ల తాజా క్రాష్ టెస్ట్ ఫలితాలు ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారాయి. కియా సంస్థకు చెందిన వేర్వేరు కార్ల సేఫ్టీ స్కోర్లలో భారీ వ్యత్యాసాలు కనిపించడం కస్టమర్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కియా సోనెట్ స్కోర్‌తో షాకైన కస్టమర్లు

భారత మార్కెట్లో విపరీతమైన పాపులారిటీ ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ కియా సోనెట్ తాజా సేఫ్టీ రేటింగ్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన కొత్త క్రాష్ టెస్టుల్లో ఇండియాలో తయారై సౌతాఫ్రికాకు ఎగుమతి అయిన సోనెట్ బేస్ మోడల్ కేవలం 1-స్టార్ రేటింగ్‌ను మాత్రమే దక్కించుకుంది. ఈ టెస్ట్‌లో పెద్దల రక్షణ విషయంలో 34 పాయింట్లకు గానూ 21.29 పాయింట్లు, పిల్లల రక్షణ కేటగిరీలో 49 పాయింట్లకు గానూ 28.57 పాయింట్లు మాత్రమే సాధించింది. టెస్ట్ చేసిన బేస్ వేరియంట్‌లో కేవలం రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే ఉండటం, సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ, ఏఈబీ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు లేకపోవడమే ఈ తక్కువ స్కోరుకు ప్రధాన కారణమని తేలింది.

సేఫ్టీలో సింహభాగం.. కియా సెల్టోస్‌కు 5-స్టార్ రేటింగ్

మరోవైపు కియా సంస్థకు చెందిన అత్యంత పాపులర్ మోడల్ కియా సెల్టోస్ మాత్రం భద్రత విషయంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించింది. ప్రతిష్టాత్మక భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టుల్లో ఈ ఎస్‌యూవీ సాలిడ్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుని అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. పెద్దలు, పిల్లల రక్షణ.. ఈ రెండు విభాగాల్లోనూ సెల్టోస్ అద్భుతమైన స్కోరు సాధించింది. ఈ కారులో బేస్ వేరియంట్ నుంచే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ లభించడంతో పాటు టాప్ మోడల్స్‌లో అడ్వాన్స్డ్ ఏడీఏఎస్ టెక్నాలజీ ఉండటం దీనికి ప్లస్ పాయింట్‌గా మారింది.

ఫ్యామిలీ కారు కియా క్యారెన్స్, సైరోస్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్

భారతీయ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఇష్టపడే 6, 7 సీటర్ ఎమ్‌పీవీ కియా క్యారెన్స్ ీ గ్లోబల్ ఎన్‌క్యాప్ టెస్టుల్లో మిశ్రమ ఫలితాలను సాధించింది. పిల్లల రక్షణ విభాగంలో ఈ కారు ఏకంగా 5-స్టార్ రేటింగ్ సాధించగా, పెద్దల రక్షణ విభాగంలో 3-స్టార్ రేటింగ్‌ను పొందింది. ప్రస్తుతం క్యారెన్స్ మోడళ్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా ఇస్తున్నారు. ఇదే సమయంలో కంపెనీ ఇటీవలే ప్రవేశపెట్టిన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కియా సైరోస్ కూడా భారత్ ఎన్‌క్యాప్ టెస్టుల్లో అదరగొట్టింది. దీని బాడీ స్ట్రక్చర్ చాలా బలంగా ఉండటం, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉండటం వల్ల దీనికి కూడా పక్కాగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది.

గ్లోబల్ మార్కెట్లలో లగ్జరీ కార్ల హవా.. కార్నివాల్, ఈవీ మోడల్స్

ఇక లగ్జరీ విభాగంలో ఉన్న కియా కార్నివాల్ ఎమ్‌పీవీ అంతర్జాతీయ మార్కెట్లలో అత్యుత్తమ సేఫ్టీ రికార్డులను కలిగి ఉంది. ఆస్ట్రేలియన్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టుల్లో ఈ కారుకు ఫుల్ 5-స్టార్ రేటింగ్ లభించింది. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్స్ వంటి ప్రీమియం భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు కియాకు చెందిన ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లయిన కియా ఈవీ6, కియా ఈవీ9 మోడళ్లు కూడా యూరో ఎన్‌క్యాప్, యాన్‌క్యాప్ టెస్టుల్లో టాప్ స్కోరుతో 5-స్టార్ రేటింగ్‌ను సాధించి గ్లోబల్ లెవెల్లో అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ వాహనాలుగా నిలిచాయి. కస్టమర్లు కేవలం ఫీచర్లు మాత్రమే కాకుండా వేరియంట్ల వారీగా ఉండే సేఫ్టీ ఫీచర్లను చూసి కారును ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story