Kia India : కియా సరికొత్త మాస్టర్ ప్లాన్.. ఇతర కంపెనీలకు మైండ్ బ్లాక్ అంతే
మైండ్ బ్లాక్ అంతే

Kia India : ప్రముఖ దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ కియా భారతదేశంలో తన అత్యంత భారీ ప్రాజెక్ట్ లాంచింగ్‌కు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు కేవలం పెట్రోల్, డీజిల్ ఇంజిన్లపై ఆధారపడిన కంపెనీ, ఇకపై వినియోగదారుల అవసరాలు మరియు బడ్జెట్‌కు అనుగుణంగా బహుళ ఆప్షన్లను అందించాలని భావిస్తోంది. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే మార్కెట్లోకి సరికొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్, ప్యూర్ ఎలక్ట్రిక్, కంపెనీ నుంచి నేరుగా వచ్చే ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సిఎన్‌జి కార్ల సరికొత్త శ్రేణిని ప్రవేశపెట్టేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.
కియా సోరెంటో స్ట్రాంగ్ హైబ్రిడ్
భారత మార్కెట్లో కియా ప్రవేశపెట్టబోయే స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాలకు అత్యంత ప్రాధాన్యత లభించనుంది. ఇందులో భాగంగా భారతదేశంలో కియా బ్రాండ్ నుంచి వచ్చే తొలి స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎస్‌యూవీగా కియా సోరెంటో సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఈ దసరా, దివాళి పండుగల సీజన్ నాటికి ఈ కారు అధికారికంగా లాంచ్ కానుండగా, ఇప్పటికే దీనికి సంబంధించిన ముందస్తు బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. సోరెంటో విజయవంతం అయితే భారత మార్కెట్లో హైబ్రిడ్ సెగ్మెంట్‌లో కియా తిరుగులేని శక్తిగా మారడం ఖాయం.
కియా సెల్టోస్‌లో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వేరియంట్లు
కంపెనీకి అత్యంత ప్రజాదరణ పొందిన, బెస్ట్ సెల్లింగ్ మోడల్ అయిన కియా సెల్టోస్ కారును సరికొత్త మోడల్‌గా మార్చేందుకు ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ వంటి లీడింగ్ మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు సెల్టోస్‌లో స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌ను తీసుకువస్తున్నారు. అంతేకాకుండా విద్యుత్ వాహనాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సెల్టోస్ ఈవీ రూపకల్పనను కూడా కంపెనీ పరిశీలిస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే సెల్టోస్ మోడల్ పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్.. ఇలా నాలుగు రకాల ఆప్షన్లలో లభించే ఏకైక ఎస్‌యూవీగా నిలుస్తుంది.
ఎలక్ట్రిక్ వాహనాలలో సరికొత్త బెంచ్‌మార్క్
ప్రస్తుతం భారత ఈవీ మార్కెట్లో కియా మోడళ్లయిన EV6, EV9, కేరెన్స్ క్లావిస్ ఈవీ, ఇటీవల సైరోస్ ఈవీలు ఇప్పటికే నడుస్తున్నాయి. రాబోయే రోజుల్లో బడ్జెట్ ధరలో, ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తెచ్చి టాటా మోటార్స్, మహీంద్రా వంటి స్వదేశీ దిగ్గజాలకు పోటీగా నిలవాలని కియా భావిస్తోంది.
మొదటిసారిగా ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ CNG కార్లు
కేవలం హైబ్రిడ్, ఈవీలకే పరిమితం కాకుండా రన్నింగ్ కాస్ట్ తక్కువగా ఉండేలా చూడటానికి ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ కార్లను రూపొందిస్తున్నట్లు కియా ధృవీకరించింది. ప్రస్తుతం కియా కేరెన్స్ మోడల్‌కు డీలర్ లెవల్‌లో సీఎన్జీ కిట్లను అమర్చుతుండగా, భవిష్యత్తులో కంపెనీ లోపల అసెంబుల్ చేసిన పక్కా సేఫ్టీ కలిగిన ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సిఎన్‌జి సిస్టమ్‌ను ప్రవేశపెట్టనుంది. కేవలం ఒక్క మోడల్‌కే పరిమితం చేయకుండా పలు రకాల కార్ల మోడళ్లలో సీఎన్జీ ఆప్షన్ అందించాలని కియా యోచిస్తోంది.

