Kia Seltos vs Tata Sierra : కియా సెల్టోస్ వర్సెస్ టాటా సియెర్రా.. మైలేజీలో ఏది తోపు? ఫ్యామిలీ కోసం ఏ కారు బెస్ట్?
మైలేజీలో ఏది తోపు? ఫ్యామిలీ కోసం ఏ కారు బెస్ట్?

Kia Seltos vs Tata Sierra : భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీల హవా నడుస్తోంది. ముఖ్యంగా 2025 చివరలో 2026 ఆరంభంలో మార్కెట్లోకి వచ్చిన కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్, టాటా సియెర్రా మధ్య ఇప్పుడు అసలైన పోటీ కనిపిస్తోంది. ఈ రెండు కార్లు కూడా హైటెక్ ఫీచర్లు, అదిరిపోయే లుక్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఈ రెండింటిలో ఏది కొనాలి అని కన్ఫ్యూజన్‌లో ఉంటే, వాటి మధ్య ఉన్న తేడాలు, ప్లస్ పాయింట్స్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.
ధరల మధ్య వ్యత్యాసం
ధర విషయానికి వస్తే కియా సెల్టోస్ కాస్త తక్కువ ధరకే అందుబాటులో ఉంది. సెల్టోస్ బేస్ వేరియంట్ ధర సుమారు రూ.10.99 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, టాటా సియెర్రా ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర సెల్టోస్ కంటే రూ.50,000 ఎక్కువగా అంటే రూ.11.49 లక్షలుగా ఉంది. ఇక టాప్ వేరియంట్ విషయానికి వస్తే, టాటా సియెర్రా కంటే కియా సెల్టోస్ దాదాపు రూ.1.30 లక్షల వరకు తక్కువ ధరలో లభిస్తోంది. అంటే బడ్జెట్ గురించి ఆలోచించే వారికి సెల్టోస్ కాస్త ఊరటనిస్తుంది.
డిజైన్, కొలతలు
కారు పొడవు విషయంలో కియా సెల్టోస్ ముందంజలో ఉంది. టాటా సియెర్రా కంటే సెల్టోస్ 120 మిల్లీమీటర్లు ఎక్కువ పొడవును కలిగి ఉంది. అయితే, టాటా సియెర్రా ఎత్తు, వీల్‌బేస్ విషయంలో సెల్టోస్‌ను మించిపోయింది. సియెర్రాలో వీల్‌బేస్ ఎక్కువగా ఉండటం వల్ల కారు లోపల లెగ్ రూమ్ చాలా విశాలంగా ఉంటుంది. వెడల్పు విషయంలో ఈ రెండు కార్లు దాదాపు సమానంగా ఉన్నప్పటికీ, ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల సియెర్రా రోడ్డుపై ఒక పవర్‌ఫుల్ ఎస్‌యూవీలా కనిపిస్తుంది.
ఇంజన్ పవర్, పెర్ఫార్మెన్స్
రెండు కంపెనీలు కూడా తమ కార్లలో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లను ఇచ్చాయి. నెచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ విషయంలో కియా సెల్టోస్ ఎక్కువ పవర్‌ను ఇస్తుంది. కానీ, టర్బో పెట్రోల్ ఇంజన్ల దగ్గరకు వచ్చేసరికి రెండు కార్లు పోటాపోటీగా ఉన్నాయి. రెండు కార్లలోనూ 160 పీఎస్ పవర్ లభిస్తుంది. డీజిల్ ఇంజన్ వేరియంట్లలో కూడా టార్క్ విషయంలో పెద్దగా తేడా లేదు. గేర్‌బాక్స్ విషయానికి వస్తే కియాలో ఐఎమ్‌టీ (iMT) ఆప్షన్ ఉండగా, టాటాలో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు పవర్‌ఫుల్‌గా ఉన్నాయి.
ఫీచర్లలో టాటా సియెర్రా మార్క్
ఫీచర్ల విషయంలో టాటా సియెర్రా ఒక అడుగు ముందే ఉంది. కియా సెల్టోస్‌లో 360 డిగ్రీల కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి ఉన్నప్పటికీ.. టాటా సియెర్రాలో అదనంగా కొన్ని లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా కారు వెనుక డోర్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అయ్యే పావర్డ్ టెయిల్‌గేట్, ప్రయాణికుల కోసం ఎక్స్‌టెండబుల్ థై సపోర్ట్, మరెన్నో స్పీకర్లు, కో-డ్రైవర్ కోసం ప్రత్యేకంగా మూడవ డిస్‌ప్లే స్క్రీన్ వంటివి సియెర్రాలో స్పెషల్ ఎట్రాక్షన్.
మైలేజీ, కస్టమర్ ఛాయిస్
మైలేజీని ఎక్కువగా ఇష్టపడే వారి కోసం రెండు కార్లలోనూ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి. సిటీ డ్రైవింగ్‌లో కియా సెల్టోస్ రిఫైన్‌మెంట్ బాగుంటే, లాంగ్ జర్నీలలో, రఫ్ రోడ్లపై టాటా సియెర్రా తన ప్రతాపం చూపిస్తుంది. మీరు స్పోర్టీ లుక్ కోరుకుంటే సెల్టోస్‌లోని మ్యాట్ గ్రేఫైట్ షేడ్ మిమ్మల్ని ఆకర్షిస్తుంది. అలా కాకుండా, రాజసం ఉట్టిపడే డిజైన్, విశాలమైన లోపలి స్పేస్ కావాలనుకుంటే టాటా సియెర్రా సరైన ఎంపిక అవుతుంది.

