Car Comparison : సెల్టోస్ స్పీడా? క్రెటా క్రేజా? లేక సియెర్రా మాయా? ఏ కారు కొనాలో తెలీక జుట్టు పీక్కుంటున్నారా?
ఏ కారు కొనాలో తెలీక జుట్టు పీక్కుంటున్నారా?

Car Comparison : భారతదేశంలో అత్యంత ఆదరణ ఉన్న మిడ్‌సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఇప్పుడు అసలైన యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు ఈ విభాగంలో రారాజుగా వెలుగు వెలిగిన హుందాయ్ క్రెటాకు సవాల్ విసురుతూ, సరికొత్త టాటా సియెర్రా, నెక్స్ట్ జనరేషన్ కియా సెల్టోస్ మార్కెట్లోకి వచ్చేశాయి. ఫీచర్లు, లుక్స్, ఇంజిన్ ఆప్షన్ల పరంగా ఈ మూడు కార్లు ఒకదానికొకటి పోటీ పడుతుండటంతో, సామాన్య వినియోగదారుడు ఏ కారు కొనాలో అర్థం కాక అయోమయంలో పడుతున్నాడు. అందుకే మీ బడ్జెట్‌కు ఏది కరెక్టో తెలియజేసే పూర్తి ప్రైస్ కంపారిజన్ చూద్దాం.
పెట్రోల్ వేరియంట్లలో ఏది బెస్ట్?
మీరు తక్కువ ధరలో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న పెట్రోల్ కారు కావాలనుకుంటే, హుందాయ్ క్రెటా ఇప్పటికీ అత్యంత సరసమైన ఆప్షన్‌గా నిలుస్తోంది. దీని ప్రారంభ ధర రూ.10.72 లక్షలు. అదే సమయంలో కొత్త ఫీచర్లతో వచ్చిన కియా సెల్టోస్ ధర రూ.10.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఈ విభాగంలో కొత్తగా వచ్చిన టాటా సియెర్రా మాత్రం కొంచెం ఖరీదైనదిగా కనిపిస్తోంది. దీని ప్రారంభ ధర రూ.11.49 లక్షలు. ఇక ఆటోమేటిక్ (iVT/DCT) పెట్రోల్ కార్ల విషయానికి వస్తే, కియా సెల్టోస్ తక్కువ ధరకు లభిస్తుండగా, క్రెటా గరిష్ట ధరలు ఎక్కువగా ఉన్నాయి.
పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్.. స్పీడ్ ఎవరిది?
స్పీడ్ ఇష్టపడే వారి కోసం టర్బో పెట్రోల్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కియా సెల్టోస్ తన సత్తా చాటుతోంది. సెల్టోస్ టర్బో వెర్షన్ రూ.12.89 లక్షల నుంచే ప్రారంభమవుతుంది. కానీ, టాటా సియెర్రా హుందాయ్ క్రెటాలో టర్బో ఇంజిన్ కేవలం ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తోంది. సియెర్రా టర్బో ఆటోమేటిక్ ధర రూ.17.99 లక్షల నుంచి మొదలవుతుండగా, క్రెటా ధర ఏకంగా రూ.19.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అంటే టర్బో పెట్రోల్ సెగ్మెంట్‌లో సెల్టోస్ అందరి కంటే తక్కువ ధరలో మంచి ఆప్షన్లను ఇస్తోంది.
డీజిల్ కార్ల వేటలో ఎవరిది పైచేయి?
లాంగ్ జర్నీలు చేసే వారికి డీజిల్ కార్లే మొదటి ఛాయిస్. డీజిల్ మ్యాన్యువల్ కేటగిరీలో హుందాయ్ క్రెటా రూ.12.24 లక్షల ప్రారంభ ధరతో అందరికంటే తక్కువకు వస్తోంది. ఇక్కడ కూడా టాటా సియెర్రానే రూ.12.99 లక్షలతో ఖరీదైన కారుగా ఉంది. అయితే, మీరు డీజిల్ ఆటోమేటిక్ కారు కావాలని కోరుకుంటే మాత్రం కియా సెల్టోస్ (రూ.14.99 లక్షలు) మీకు బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే క్రెటా, సియెర్రా ఆటోమేటిక్ ధరలు రూ.15.50 లక్షల పైనే ఉన్నాయి.
మొత్తంగా చూస్తే బడ్జెట్ పరంగా హుందాయ్ క్రెటా బేస్ వేరియంట్లు తక్కువకు దొరుకుతున్నాయి. స్టైల్, లేటెస్ట్ ఫీచర్లతో పాటు టర్బో ఇంజిన్ తక్కువ ధరలో కావాలనుకుంటే కియా సెల్టోస్ బెస్ట్. ఇక టాటా బ్రాండ్ మీద నమ్మకం ఉండి, పాత జ్ఞాపకాలను కొత్త టెక్నాలజీతో పొందాలనుకునే వారు టాటా సియెర్రా వైపు వెళ్లొచ్చు. అయితే ఈ మూడు కార్లు కూడా సేఫ్టీ పరంగా, లగ్జరీ పరంగా టాప్ క్లాస్‌లో ఉన్నాయి.

