Kia Sorento: లాంచ్‌కు ముందే రోడ్లపై ప్రత్యక్షమైన కియా కొత్త కారు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే

Kia Sorento: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా భారత ఆటో మొబైల్ మార్కెట్‌లోకి సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ కియా సోరెంటోను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 4న అధికారికంగా లాంచ్ కానున్న ఈ భారీ కారు, విడుదలకు ముందే ఎలాంటి కవర్ లేకుండా భారత రోడ్లపై ప్రత్యక్షమై వాహన ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. భారతీయ రోడ్లపై సంచరిస్తూ కనిపించిన కియా సోరెంటో మోడల్ తెల్లటి రంగులో ధగధగమెరిసిపోతోంది. ఈ మోడల్ మీడియం వేరియంట్ అయి ఉండవచ్చని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎస్‌యూవీ వెనుక భాగంలో డిసిటి బ్యాడ్జింగ్ స్పష్టంగా కనిపించింది. బయటపడిన ఈ తెల్లటి కారులో 7 సీట్ల అమరిక ఉండటం గమనార్హం. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఆకర్షణీయమైన ఎల్ఈడీ డిఆర్‌ఎల్‌లు, ఫాగ్ లాంప్‌లు, రూఫ్ రైల్స్, ప్యానోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు 360 డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం అంశాలు కనిపించాయి.
అత్యాధునిక సాంకేతికత.. అదిరిపోయే కేబిన్ ఫీచర్లు
కారు లోపలి భాగాన్ని కియా సంస్థ ఎంతో విలాసవంతంగా తీర్చిదిద్దింది. ఈ కారులో ఏకంగా 30 అంగుళాల కర్వ్‌డ్ డిస్‌ప్లే డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో 12.3 అంగుళాల ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మరో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కలిసి ఉంటాయి. ఏఐ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, అడాస్ సేఫ్టీ ఫీచర్లు, క్రూయిజ్ కంట్రోల్, అంబియంట్ లైటింగ్, డిజిటల్ ఏసీ ప్యానెల్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్ కేబిన్‌కు సరికొత్త శోభను ఇస్తాయి. ముందు వైపు వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, పుష్ బటన్ స్టార్ట్, రోటరీ డయల్ గేర్ నాబ్ ప్రయాణాన్ని మరింత సుఖవంతంగా మారుస్తాయి.
శక్తివంతమైన హైబ్రిడ్, డిజైన్ ఇంజిన్ ఆప్షన్లు
పవర్ ప్రొడక్షన్ విషయంలోనూ కియా రాజీ పడలేదు. పెట్రోల్ హైబ్రిడ్, టర్బో డిజైన్ ఇంజిన్ ఆప్షన్లలో ఈ కారు లభించనుంది. ఇందులో 1.6 లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్‌ను అమర్చారు. ఆటోమేటిక్, మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉండే అవకాశముంది. కియా నుంచి వస్తున్న మొదటి ఆల్-వీల్ డ్రైవ్ (AWD) హైబ్రిడ్ ఎస్‌యూవీ మోడల్ ఇదే కావడం విశేషం. ఇది ప్రయాణికులకు మైలేజ్, పవర్ రెండింటినీ సమ సమర్థంగా అందిస్తుంది.
ధర ఎంత ఉండొచ్చు? పోటీ ఎవరితో అంటే?
భారత మార్కెట్లో సెప్టెంబర్ 4న ఈ కారు ధరలను కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది. దాదాపు రూ. 40 లక్షల (ఎక్స్-షోరూమ్) ఆరంభ ధరతో ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. ప్రీమియం ఎస్‌యూవీ కేటగిరీలో అడుగుపెడుతున్న కియా సోరెంటో, దేశీయంగా సెగ్మెంట్ లీడర్‌గా ఉన్న టయోటా ఫార్చ్యూనర్ వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

