Kia Motors: ఇండియన్ ఆటో మార్కెట్లో కియా సంచలనం.. త్వరలో రెండు పవర్‌ఫుల్ 7-సీటర్ హైబ్రిడ్ కార్లు
రెండు పవర్‌ఫుల్ 7-సీటర్ హైబ్రిడ్ కార్లు

Kia Motors:భారత ఆటోమొబైల్ రంగాన్ని ఏలేందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా సరికొత్త వ్యూహంతో వస్తోంది. పెద్ద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని రెండు పవర్‌ఫుల్ 7-సీటర్ పెట్రోల్ హైబ్రిడ్ కార్లను పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఇందులో సోరెంట్ హైబ్రిడ్ సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా లాంచ్ కానుంది. దేశీయంగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న వేళ కియా సరికొత్త అడుగు వేస్తోంది. ఇందులో భాగంగా కియా సోరెంట్ హైబ్రిడ్ దేశంలో కంపెనీ తరఫున రానున్న మొదటి 3-రో ఎస్‌యూవీ కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం ప్లాంట్‌లో ఈ మోడల్ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. బుకింగ్‌లు కూడా ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం. ఈ ఎస్‌యూవీ ప్రధాన ఆకర్షణ దీనిలోని 1.6-లీటర్ పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్. ఎలక్ట్రిక్ మోటార్ కాంబినేషన్‌తో వచ్చే ఈ పవర్‌ట్రెయిన్ 238 బిహెచ్‌పి పవర్, 380 ఎన్ఎమ్ టాపిక్ విడుదల చేస్తుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఇందులో లభిస్తుంది. దీనికి తోడు 202 బిహెచ్‌పి పవర్ ఇచ్చే 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్ కూడా అందుబాటులో ఉండనుంది.
రాచరికాన్ని తలపించే డిజైన్, లైవ్ AI అసిస్టెంట్
సోరెంట్ ఎక్స్‌టీరియర్ పరంగా చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. కంపెనీ సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్, వర్టికల్ ఎల్‌ఈడీ హెడ్‌లాంప్స్, టి-షేప్ డిఆర్‌ఎల్‌లతో పాటు 19-ఇంచుల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ దీనికి రాయల్ లుక్‌ను అందిస్తాయి. కారు లోపల 12.3-ఇంచుల రెండు కనెక్టెడ్ స్క్రీన్‌లు, అడాస్ సేఫ్టీ ఫీచర్లు, పా పనరోమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే లైవ్ జెనరేటివ్ ఎఐ అసిస్టెంట్ వాయిస్ కమాండ్ సిస్టమ్‌ను ఇందులో పొందుపరిచారు. ఈ లగ్జరీ ఎస్‌యూవీ అంచనా ధర రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఉండవచ్చు.
తదుపరి లగ్జరీ మోడల్ కియా కార్నివాల్ హైబ్రిడ్
సోరెంట్ ఎంట్రీ ఇచ్చిన కొన్ని నెలల వ్యవధిలోనే కియా కార్నివాల్ హైబ్రిడ్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఎస్‌యూవీల కంటే ఎక్కువ స్పేస్, సౌకర్యం కోరుకునే వారి కోసం ఈ ప్రీమియం ఎమ్పివిని రూపొందిస్తున్నారు. ఇందులో 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. ఇది దాదాపు 242 నుంచి 272 బిహెచ్‌పి వరకు పవర్ జనరేట్ చేయగలదని అంచనా. 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ వాహనం ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
రాజభోగాన్ని అందించే వీఐపీ లాంజ్ సీట్లు
కార్నివాల్ హైబ్రిడ్ లోపలి ఇంటీరియర్ పూర్తి స్థాయిలో లగ్జరీ ఉండనుంది. 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లో రెండో వరుసలో వీఐపీ లాంజ్ క్యాప్టెన్ సీట్లను అమర్చారు. వీటిలో హీటింగ్, వెంటిలేషన్, పవర్ లెగ్ రెస్ట్, రిలాక్సేషన్ వంటి అద్భుతమైన సౌకర్యాలు లభిస్తాయి. హెడ్-అప్ డిస్‌ప్లే, డిజిటల్ రియర్‌వ్యూ మిర్రర్, ప్యాసింజర్ కెమెరా, ఇంటర్‌కామ్ సిస్టమ్ వంటి హైటెక్ ఫీచర్లు ఈ వాహనాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తాయి.

