Kia Sorento: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన ప్రీమియం ఎస్‌యూవీ సోరెంటోను సెప్టెంబర్ 4, 2026న భారతదేశంలో అధికారికంగా విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఎస్‌యూవీ ఉత్పత్తిని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ ప్లాంట్‌లో ఇప్పటికే ప్రారంభించినట్లు సంస్థ గతంలోనే వెల్లడించింది. లాంచ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో, ఎలాంటి కవర్లు లేదా క్యామోఫ్లేజ్ లేకుండా రోడ్డుపై వెళ్తున్న సోరెంటో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనంతపూర్ ప్లాంట్ సమీపంలోనే ఈ కారు టెస్టింగ్ జరుగుతుండగా ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ చిత్రీకరించినట్లు సమాచారం.

అదుర్స్ అనిపించే గ్లోబల్ డిజైన్

కియా సోరెంటో డిజైన్ అంతర్జాతీయ స్థాయి లుక్‌తో ఎంతో గంభీరంగా ఉంది. కారు ముందు భాగంలో కియా ఐకానిక్ టైగర్ నోస్ గ్రిల్ ఇచ్చారు. దీనికి 3D ప్యాటర్న్, అల్యూమినియం ఫినిషింగ్ జోడించారు. వర్టికల్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్టార్ మ్యాప్ డిజైన్‌తో కూడిన ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు కారుకు మరింత బోల్డ్ లుక్‌ని ఇస్తున్నాయి. పక్క వైపు నుంచి చూస్తే పెద్ద వీల్ ఆర్చ్‌లు, రూఫ్ రెయిల్స్, 19-అంగుళాల డ్యూయల్-టోన్ మెషిన్-కట్ అలాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వెనుక వైపు వర్టికల్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, విశాలమైన బంపర్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ అందించారు.

పవర్‌ఫుల్ హైబ్రిడ్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు:

భారత మార్కెట్లో సోరెంటోను స్ట్రాంగ్ హైబ్రిడ్, డీజిల్ ఇంజిన్ వెర్షన్లలో అందుబాటులోకి తేనున్నట్లు కియా స్పష్టం చేసింది.

హైబ్రిడ్ మోడల్: 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన ఆల్-వీల్ డ్రైవ్ (AWD) స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ ఉండనుంది. ఇది దాదాపు 238 hp పవర్, 380 Nm టాప్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా.

డీజిల్ మోడల్: 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ఆప్షన్ లభిస్తుంది. ఇది 202 bhp పవర్, 440 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇదే ఇంజిన్‌ను కియా కార్నివాల్లో కూడా వాడుతున్నారు.

భారత మార్కెట్లో ఎంతో క్రేజ్ ఉన్న టోయోటా ఫార్చ్యూనర్‌కు ఈ కియా సోరెంటో గట్టి పోటీనిస్తుందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story