Kia Syros EV : టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO లకు గట్టి పోటీ.. కియా నుంచి చౌకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
కియా నుంచి చౌకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

Kia Syros EV : భారత ఆటోమొబైల్ మార్కెట్లో విభిన్న సెగ్మెంట్లలో కార్లను విక్రయిస్తూ దూసుకుపోతున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. మీడియా నివేదికల ప్రకారం.. కియా కంపెనీ త్వరలోనే తన సరికొత్త సైరోస్ ఈవీని మార్కెట్లోకి తీసుకురానుంది. ఇటీవల ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటూ మరోసారి కెమెరా కంటికి చిక్కింది. ఈ టెస్టింగ్ స్పై చిత్రాల ద్వారా కారుకు సంబంధించిన కొన్ని కీలక వివరాలు లీక్ అయ్యాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ కారును రాబోయే ఆగస్టు 2026 లోనే అధికారికంగా లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కియా సైరోస్ ఈవీని భారతదేశంలో ఆ కంపెనీ నుంచి రాబోతున్న అత్యంత చిన్న, అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా భావిస్తున్నారు. ప్రస్తుతం భారత ఈవీ మార్కెట్లో గట్టి పట్టు సాధించిన టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ఈవీలతో ఇది నేరుగా తలపడనుంది. ఈ కారు ధర తక్కువగా ఉండటమే కాకుండా మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో వినియోగదారులకు ఒక సరికొత్త, బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌గా నిలవనుంది.
టెస్టింగ్‌లో కనిపించిన స్పై ఫోటోల ప్రకారం.. సైరోస్ ఈవీ డిజైన్ దాని పెట్రోల్ వెర్షన్ లాగే కాస్త పొడవుగా, బాక్సీ ఆకారంలో, స్ట్రెయిట్ లుక్‌తో చాలా పటిష్టంగా ఉండబోతోంది. అయితే ఎలక్ట్రిక్ కారు కాబట్టి దానికి తగినట్లుగా కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు. ఇందులో ఛార్జింగ్ పెట్టుకునే పోర్టును కారు ముందు భాగంలో ఉండే ఫెండర్‌పై అందించారు. దీనితో పాటు ముందు, వెనుక బంపర్ల డిజైన్‌ను పూర్తిగా కొత్తగా మార్చారు. కారుకు మరింత స్పోర్టీ లుక్ ఇవ్వడానికి ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్, ఆకర్షణీయమైన బ్రేక్ కాలిపర్లను కూడా ఇందులో ఉపయోగించారు.
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేబిన్ చూడటానికి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్స్ లాగే ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే ఉండే కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను ఇందులో యాడ్ చేశారు. ముఖ్యంగా వెహికల్-టు-లోడ్, వెహికల్-టు-వెహికల్ ఛార్జింగ్ ఫీచర్లు ఇందులో ఉండబోతున్నట్లు సమాచారం. అంటే ఈ కారు బ్యాటరీ ద్వారా మీరు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను వాడుకోవచ్చు లేదా అవసరమైతే మరో ఈవీ కారును కూడా ఛార్జ్ చేయవచ్చు. భద్రత కోసం ఇందులో అడ్వాన్స్డ్ ఏడీఏఎస్ సేఫ్టీ సిస్టమ్, సరికొత్త డిజైన్ సీట్ కవర్లు, ఆకర్షణీయమైన కలర్ థీమ్‌ను అందించనున్నారు.
కియా సైరోస్ ఈవీని హ్యుందాయ్ సంస్థకు చెందిన ప్రసిద్ధ కే1 ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేస్తున్నారు. ఈ కారులో కస్టమర్ల అవసరాల కోసం రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లను అందించే అవకాశం ఉంది. సుమారు 42 kWh, 49 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌లను ఇందులో ఉపయోగించనున్నారు. ఈ బ్యాటరీ సెటప్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీ నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. ఇక ధర విషయానికి వస్తే, ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర దాదాపు రూ.15 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ ధర రూ.20 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది. మొదటిసారి ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

