Kia Syros Flex Fuel: పెట్రోల్ బాధలు ఇక మర్చిపోవచ్చు.. కియా నుంచి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు
కియా నుంచి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు

Kia Syros Flex Fuel: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా భారత మార్కెట్లో తన తొలి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కార్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఎథనాల్ ఇంధనంపై పనిచేసే కియా సైరోస్ ఎఫ్‌ఎఫ్‌వి మోడల్‌ను ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించింది. ముడిచమురు దిగుమతులను తగ్గించే లక్ష్యంతో ఈ విప్లవాత్మక అడుగు వేసింది. భారత్‌లో కియా సొరెంటో ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ సరికొత్త సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఎథనాల్ శాతాన్ని పెంచుతున్న తరుణంలో కియా ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కారులో 1.0 లీటర్ టీజీడీఐ, 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందించారు. సాధారణ పెట్రోల్ ఇంజిన్‌తో పోలిస్తే ఎథనాల్ కలగలిసిన ఇంధనంపై సజావుగా నడిచేందుకు వీలుగా ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ఈసీయూ), ఫ్యూయెల్ సిస్టమ్‌లో అనేక టెక్నికల్ మార్పులు చేశారు.
గేర్‌బాక్స్ సిస్టమ్ లో కీలక మార్పు
సాధారణ సైరోస్ టర్బో పెట్రోల్ మోడల్‌లో 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. అయితే ఈ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కాన్సెప్ట్ వెర్షన్‌లో మాత్రం 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అమర్చడం విశేషం. ఎథనాల్ అధికంగా ఉండే ఇంధనం మండే సమయంలో వచ్చే మార్పులను తట్టుకోవడానికే కంపెనీ ఈ మార్పు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ఇంజిన్ ఎంత పవర్, టార్క్ విడుదల చేస్తుందనే వివరాలను కియా ఇంకా వెల్లడించలేదు.
తీవ్రమవుతున్న ఫ్లెక్స్ ఫ్యూయెల్ కార్ల పోటీ
ప్రస్తుతం భారత వాహన మార్కెట్లో ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ పై ప్రధాన కార్ల తయారీ సంస్థలన్నీ దృష్టి సారించాయి. ఇప్పటికే టయోటా సంస్థ అధిక ఎథనాల్ మిశ్రమంతో నడిచే కార్ల టెక్నాలజీని ప్రదర్శించగా, మారుతి సుజుకి ఈ100 ఇంధనంతో నడిచే వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ మోడల్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు కియా కూడా సైరోస్ కాన్సెప్ట్‌తో ఈ రంగంలోకి అడుగుపెట్టడంతో రాబోయే రోజుల్లో బయో ఫ్యూయెల్ వాహనాల మధ్య తీవ్ర పోటీ నెలకొననుంది.
ప్రొడక్షన్ లాంచ్ పై ఉత్కంఠ
ఈ కారు ప్రదర్శన వాహన ప్రియుల్లో ఆసక్తిని పెంచినప్పటికీ, దీనిని ఎప్పటి నుంచి ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విక్రయానికి తెస్తారనేది కంపెనీ స్పష్టం చేయలేదు. ఇది పూర్తిస్థాయి ప్రొడక్షన్ మోడల్‌గా అందుబాటులోకి వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఏదేమైనా భవిష్యత్ ఇంధన అవసరాలకు అనుగుణంగా తయారవుతున్నామని కియా చాటిచెప్పింది.

