Kia : కియాకు భారీ షాక్.. రూ.8.67 లక్షల ఎస్‌యూవీకి కరువైన కస్టమర్లు.. 99 శాతం పడిపోయిన అమ్మకాలు
99 శాతం పడిపోయిన అమ్మకాలు

Kia : దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ మార్చి 2026 నాటికి భారత మార్కెట్లో మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. ఒకవైపు సోనెట్, సెల్టోస్ వంటి మోడళ్లు అమ్మకాల్లో దూసుకుపోతుంటే, మరోవైపు భారీ అంచనాలతో వచ్చిన కియా సిరోస్ మాత్రం ఊహించని రీతిలో కుప్పకూలిపోయింది. కియా గొడుగు కింద అత్యంత చౌకైన ఎస్‌యూవీగా పేరున్న సిరోస్, ఇప్పుడు కస్టమర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చి 2026లో కియా మోటార్స్ మొత్తం 29,112 యూనిట్లను విక్రయించింది. 2025 మార్చిలో ఈ సంఖ్య 25,525గా ఉంది. అంటే ఏటా 14% వృద్ధిని సాధించి దేశంలోని టాప్ ఆటోమొబైల్ కంపెనీల జాబితాలో కియా ఆరో స్థానంలో నిలిచింది. సోనెట్, సెల్టోస్ వంటి మోడళ్లు ఈ వృద్ధికి ప్రధాన కారణం. ముఖ్యంగా కియా బ్రాండ్ పట్ల భారతీయులకు ఉన్న నమ్మకం అమ్మకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
కియా సిరోస్ పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2025 ఫిబ్రవరిలో లాంచ్ అయిన ఈ కారు, మార్చి 2025 నాటికి ఏకంగా 5,015 యూనిట్లు అమ్ముడై అదరగొట్టింది. కానీ, సరిగ్గా ఏడాది తర్వాత అంటే మార్చి 2026లో కేవలం 59 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి. అంటే అమ్మకాల్లో 99 శాతం భారీ క్షీణత కనిపించింది. కియా నుంచి వస్తున్న అత్యంత చౌకైన ఎస్‌యూవీ అయినప్పటికీ, కస్టమర్లు దీనిని ఎందుకు తిరస్కరిస్తున్నారో అన్నది అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం సిరోస్ బేస్ మోడల్ ధర రూ. 8.67 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.
కియా కుటుంబంలో సోనెట్ రారాజుగా నిలిచింది. మార్చి 2026లో 12,012 యూనిట్ల విక్రయంతో ఇది కియాలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. గత ఏడాది మార్చితో పోలిస్తే దీని అమ్మకాలు 56 శాతం పెరిగాయి. సోనెట్ స్పోర్టీ లుక్, ఫీచర్లు యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే సోనెట్ నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను 2027 నాటికి తీసుకురావడానికి కియా కసరత్తు చేస్తోంది.
మరోవైపు కియా సెల్టోస్ అమ్మకాలు 69 శాతం వృద్ధితో 11,041 యూనిట్లకు చేరుకున్నాయి. భారత్ ఎన్‌సీఏపీలో సెల్టోస్ 5-స్టార్ రేటింగ్ సాధించడం ఈ అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చే కస్టమర్లు ఇప్పుడు సెల్టోస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కియా తన ప్రీమియం మోడల్స్ అయిన కార్నివాల్ విషయంలో కూడా కొత్త అప్‌డేట్స్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.

