Kia Motors : భారతీయ వాహన మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా రాబోయే రోజుల్లో హైబ్రిడ్ కార్ల విభాగంలో భారీ అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే కొద్ది సంవత్సరాల్లో మార్కెట్లోకి వరుసగా పలు కొత్త హైబ్రిడ్ మోడళ్లను లాంచ్ చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. లీటరుకు గరిష్ట మైలేజ్ అందించడం, ఇంధన ఖర్చులను గణనీయంగా తగ్గించడం, లేటెస్ట్ టెక్నాలజీని వినియోగదారులకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా కియా పనిచేస్తోంది. ఈ కొత్త లైనప్‌లో ప్రీమియం ఎస్‌యూవీల నుంచి ఎంపీవీలు, కాంపాక్ట్ ఎస్‌యూవీల వరకు అనేక రకాల మోడళ్లు ఉండనున్నాయి.

కియా సోరెంటో హైబ్రిడ్

భారత్‌లో కియా విడుదల చేయబోయే మొట్టమొదటి ఆల్-న్యూ హైబ్రిడ్ కారుగా సోరెంటో హైబ్రిడ్ నిలవనుంది. ఈ ఏడాది చివరి నాటికి దీనిని భారతీయ మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. మనదేశంలో ఇది స్కోడా కోడియాక్, ఫోక్స్‌వాగన్ టిగువాన్ వంటి లగ్జరీ ప్రీమియం ఎస్‌యూవీలకు నేరుగా పోటీ ఇవ్వనుంది. ఇందులో 1.6 లీటర్ టర్బో పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను అందించే అవకాశాలు ఉన్నాయి. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి మార్కెట్లోకి రానుంది.

కియా సెల్టోస్ హైబ్రిడ్

భారత మార్కెట్లో విపరీతమైన ఆదరణ పొందిన కియా సెల్టోస్ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో విక్రయించబడుతోంది. అయితే త్వరలోనే దీనిని స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేయబోతున్నారు. ఈ మోడల్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్‌ను జోడించనున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ హైబ్రిడ్ సెల్టోస్ రోడ్లపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల నగరాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు లీటరుకు అద్భుతమైన మైలేజ్ లభిస్తుంది.

కియా కారెన్స్, సోనెట్ హైబ్రిడ్ మోడళ్లు

ఫ్యామిలీ కారుగా మంచి సక్సెస్ సాధించిన కారెన్స్‎తో పాటు కారెన్స్ క్లావిస్ మోడళ్లలో కూడా ఈ హైబ్రిడ్ టెక్నాలజీని తీసుకురావాలని కియా భావిస్తోంది. రాబోయే రోజుల్లో వీటిలో కొత్తగా 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను అమర్చనున్నారు. మరోవైపు, కంపెనీకి చెందిన పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సోనెట్ నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను కూడా హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో సిద్ధం చేస్తున్నారు. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఆధారిత స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సోనెట్ హైబ్రిడ్ వెర్షన్ 2028-29 నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.

హైబ్రిడ్ విభాగానికే కియా ప్రథమ ప్రాధాన్యత

రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు మరియు మరోవైపు ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న ఛార్జింగ్ అవస్థలను దృష్టిలో ఉంచుకుని కియా ఇప్పుడు హైబ్రిడ్ టెక్నాలజీపై వేగంగా అడుగులు వేస్తోంది. డైరెక్ట్‌గా ఈవీ కార్లకు మారడానికి ఇంకా వెనుకాడే కొనుగోలుదారులకు, అదనపు ఛార్జింగ్ టెన్షన్లు లేకుండా అత్యధిక మైలేజ్ ఇచ్చే ఈ కియా హైబ్రిడ్ కార్లు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారతాయని ఆటోమొబైల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story