Koenigsegg : నిప్పుల్లో వేసినా ఏమీ కాలేదు..ప్రపంచంలోనే సేఫెస్ట్ కారు ఇదే
ప్రపంచంలోనే సేఫెస్ట్ కారు ఇదే

Koenigsegg : ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, శక్తివంతమైన కార్లను తయారు చేయడంలో స్వీడిష్ కంపెనీ కోయినిగ్‌సెగ్ పేరు మార్మోగిపోతుంది. తాజాగా ఆ సంస్థ నుంచి వచ్చిన జెమెరా అనే మోడల్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనిని కేవలం హైపర్ కార్ అని మాత్రమే కాదు, "ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫ్యామిలీ కారు" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి పవర్‌ఫుల్ కార్లలో ఇద్దరే కూర్చుంటారు, కానీ జెమెరాలో నలుగురు వ్యక్తులు హాయిగా కూర్చుని రాకెట్ వేగంతో ప్రయాణించవచ్చు. తాజాగా ఈ కారు యూరోపియన్ యూనియన్ నిర్వహించిన కఠినమైన సేఫ్టీ, ఎమిషన్ టెస్టులను విజయవంతంగా పూర్తి చేసుకుని గ్రీన్ సిగ్నల్ పొందింది.
ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ కార్లలో బ్యాటరీ మంటలు అంటుకోవడం అనేది అతి పెద్ద సమస్య. కానీ జెమెరా ఈ విషయంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. కోయినిగ్‌సెగ్ రూపొందించిన హై-వోల్టేజ్ బ్యాటరీ ఎంత సురక్షితమైనదో నిరూపించడానికి కంపెనీ ఒక వీడియోను విడుదల చేసింది. దానిని గ్రిల్ టెస్ట్ అని పిలుస్తున్నారు. ఈ టెస్టులో బ్యాటరీ ప్యాక్‌ను ఏకంగా రెండు నిమిషాల పాటు భయంకరమైన మంటల మీద ఉంచారు. అయినా సరే, బ్యాటరీ లోపలి ఉష్ణోగ్రత పెరగకుండా స్థిరంగా ఉంది. 2027లో రాబోయే కఠినమైన థర్మల్ సేఫ్టీ నియమాలను (R100.5) కూడా ఈ బ్యాటరీ ఇప్పుడే పాస్ అయిపోయిందంటే దీని టెక్నాలజీ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
జెమెరాలో వాడిన బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అత్యంత అధునాతనమైనది. ఒకవేళ ఏదైనా కారణం చేత బ్యాటరీలోని ఒక సెల్ వేడెక్కి మంటలు వచ్చినా, ఆ మంటలు పక్కన ఉన్న సెల్స్‌కు అంటుకోకుండా నిరోధించేలా దీనిని డిజైన్ చేశారు. దీనివల్ల కారులో బ్యాటరీ పేలుళ్లు సంభవించే అవకాశం అసలు ఉండదు. గ్లోబల్ సేఫ్టీ బెంచ్‌మార్క్ ప్రమాణాలను కూడా మించి ఈ కారు భద్రతను కల్పిస్తోందని ఆటోమొబైల్ నిపుణులు కొనియాడుతున్నారు.
జెమెరా పవర్‌ట్రెయిన్ గురించి వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇందులో 5.0 లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్ ఉంది. ఇది మాత్రమే 1,500 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి తోడు డార్క్ మ్యాటర్ అనే పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ తోడవుతుంది. వెరసి ఈ కారు మొత్తం పవర్ 2,300 bhp, 1,500 Nm టార్క్. అంటే ఒక చిన్న విమానం ఇంజిన్ కంటే ఇది ఎక్కువ శక్తిని ఇస్తుంది. ఇంత పవర్ ఉన్నా కూడా ఇది నలుగురు కూర్చునే ఫ్యామిలీ కారు కావడం దీని అసలు సిసలు ప్రత్యేకత.
యూరప్‌లో అనుమతులు లభించినా, అమెరికా మార్కెట్లోకి వెళ్లడానికి జెమెరా కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికా రూల్స్ ప్రకారం కారుకు ఫిజికల్ సైడ్ మిర్రర్స్ ఉండాలి. కానీ జెమెరాలో అద్దాల బదులు చిన్న కెమెరాలు ఉంటాయి. అలాగే ఎయిర్ బ్యాగ్స్ పనితీరులో కూడా అక్కడ కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సవాళ్లను అధిగమించి త్వరలోనే అమెరికాలో కూడా లాంచ్ చేస్తామని కంపెనీ ధీమాగా ఉంది.

