రోడ్డుపై వీధి పోరాటం మొదలైంది

KTM 160 Duke vs Yamaha MT-15 V2 : భారతదేశంలో కుర్రాళ్లను అమితంగా ఆకట్టుకునే బైక్ సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్ సెగ్మెంట్. ముఖ్యంగా 150cc నుంచి 160cc విభాగంలో కేటీఎం, యమహా మధ్య ఎప్పుడూ ఒక యుద్ధం నడుస్తూనే ఉంటుంది. కేటీఎం తన సరికొత్త 160 Duke మోడల్‌ను అదిరిపోయే TFT డిస్‌ప్లేతో లాంచ్ చేయగా, యమహా తన ఎవర్ గ్రీన్ MT-15 V2 తో సవాల్ విసురుతోంది. ఈ రెండు బైక్‌లలో ఏది మీ జేబుకు తక్కువ భారం, అలాగే పర్ఫార్మెన్స్‌లో ఏది తోపు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

ధర విషయానికి వస్తే యమహా ఇక్కడ విజేతగా నిలుస్తోంది. యమహా MT-15 V2 ధర మీరు ఎంచుకునే రంగులను బట్టి రూ. 1.55 లక్షల నుంచి రూ.1.65 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. అదే సమయంలో కేటీఎం 160 డ్యూక్ ధర కొంచెం ఎక్కువే. సాధారణ ఎల్‌సీడీ వేరియంట్ రూ.1.70 లక్షలు కాగా, సరికొత్త టీఎఫ్‌టీ డిస్‌ప్లే మోడల్ ధర రూ.1.78 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. అంటే కేటీఎం కొనాలంటే మీరు యమహా కంటే కనీసం 15 నుంచి 20 వేల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఆ అదనపు ధరకు కేటీఎం ఇచ్చే ప్రీమియం ఫీచర్లు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి.

ఇంజిన్ సామర్థ్యంలో కేటీఎం 160 డ్యూక్ కొంచెం ముందంజలో ఉంది. ఇందులో 164.2 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది, ఇది 18.74 bhp పవర్‌ను, 15.5 Nm టార్క్‌ను ఇస్తుంది. మరోవైపు యమహా MT-15 V2లో 155 సీసీ ఇంజిన్ ఉన్నప్పటికీ, అది ఇచ్చే పవర్ 18.14 bhp, 14.1 Nm టార్క్. కేటీఎం పవర్ ఫుల్‌గా అనిపించినా, యమహాలో ఉన్న VVA (Variable Valve Actuation) టెక్నాలజీ వల్ల అది తక్కువ సీసీ ఉన్నా కూడా చాలా వేగంగా దూసుకుపోతుంది. మైలేజీ విషయంలో మాత్రం యమహా సుమారు లీటరుకు 45-50 కిమీ ఇస్తూ, కేటీఎం (35-40 కిమీ) కంటే మెరుగ్గా ఉంటుంది.

కేటీఎం తన కొత్త వేరియంట్‌లో 5-అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేను ప్రవేశపెట్టింది. దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా కేటీఎంలో ఉన్న WP సస్పెన్షన్, ట్రెల్లిస్ ఫ్రేమ్ బైక్ హ్యాండ్లింగ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తాయి. యమహా MT-15 కూడా ఏమాత్రం తక్కువ కాదు. ఇందులో స్లిప్పర్ క్లచ్, ట్రాక్షన్ కంట్రోల్, అద్భుతమైన ఎల్‌ఈడీ లైటింగ్ ఉన్నాయి. బరువు తక్కువగా ఉండటం వల్ల (139 కేజీలు) ట్రాఫిక్‌లో యమహాను నడపడం చాలా సులభం, కేటీఎం మాత్రం కొంచెం భారీగా ఉండి హైవేల మీద నిలకడగా ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story