KTM : భారత మార్కెట్లో స్పోర్ట్స్ బైక్ విభాగంలో విపరీతమైన క్రేజ్ ఉన్న కేటీఎం సంస్థ తన ఫ్లాగ్‌షిప్ 390 డ్యూక్ రేంజ్ మోడళ్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 390 అడ్వెంచర్ సిరీస్ ధరలను పెంచిన మరుసటి రోజే డ్యూక్ సిరీస్ ధరలను కూడా పెంచడం గమనార్హం. కంపెనీ మోడల్‌ను బట్టి గరిష్టంగా రూ. 7,000 వరకు ధరలను పెంచింది. ఈ కొత్త ధరల ప్రభావం స్టాండర్డ్ 390 డ్యూక్, పవర్‌ఫుల్ 390 డ్యూక్ R రెండింటిపై పడింది.

సవరించిన కొత్త ధరల వివరాలు

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. 349.32cc ఇంజిన్‌ కలిగిన స్టాండర్డ్ కేటీఎం 390 డ్యూక్ ఎక్స్-షోరూమ్ ధర గతంలో రూ. 2.77 లక్షలుగా ఉండగా, రూ. 7,000 పెంపుతో ఇప్పుడు రూ. 2.84 లక్షలకు చేరుకుంది. ఇక పవర్‌ఫుల్ మోడల్ అయిన కేటీఎం 390 డ్యూక్ R ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.39 లక్షల నుంచి రూ. 6,000 పెరిగి రూ. 3.45 లక్షలకు చేరింది. ఈ ధరల మార్పు తర్వాత రెండు బైకుల మధ్య ఉన్న వ్యత్యాసం రూ. 62,000 నుంచి రూ. 61,000 కి తగ్గింది.

ఎలాంటి మెకానికల్ మార్పులు లేవు

ధరలు పెరిగినప్పటికీ బైక్‌ల ఇంజిన్ లేదా డిజైన్ పరంగా కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. పెరిగిన తయారీ, ఇన్‌పుట్ ఖర్చుల వల్లే ఈ ధరల పెంపు తప్పలేదని భావిస్తున్నారు. స్టాండర్డ్ కేటీఎం 390 డ్యూక్ మోడల్‌లో 349.32cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది, ఇది 41.5 PS పవర్, 33.5 Nm టార్క్‌ను ఇస్తుంది. అదే సమయంలో 390 డ్యూక్ R మోడల్ 398.63cc ఇంజిన్‌తో వస్తుంది, ఇది 46 PS పవర్, 39 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండింటిలోనూ 6-స్పీడ్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా లభిస్తుంది.

అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, రైడింగ్ టెక్నాలజీ

ఫీచర్ల విషయానికి వస్తే రెండు మోడళ్లలోనూ మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ (MTC), కార్నరింగ్ ABS, సూపర్‌మోటో ABS, లాంచ్ కంట్రోల్, రైడ్-బై-వైర్ థ్రోటిల్, స్ట్రీట్, రెయిన్ రైడ్ మోడ్‌లు వంటి అడ్వాన్స్‌డ్ రైడింగ్ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు 5-అంగుళాల TFT స్క్రీన్, ట్రాక్ స్క్రీన్ డిస్‌ప్లే, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటి ఆధునిక ఎలక్ట్రానిక్స్ సౌకర్యాలు కూడా లభిస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story