Lexus: లీటరుకు 25 కిమీ మైలేజ్.. లెక్సస్ కొత్త లగ్జరీ హైబ్రిడ్ సెడాన్ లాంచ్.. ఫీచర్లు చూస్తే షాకే
ఫీచర్లు చూస్తే షాకే

Lexus: లగ్జరీ కార్ లవర్స్ కోసం ప్రముఖ వాహన తయారీ సంస్థ లెక్సస్ కొత్త ఇఎస్ 350హెచ్ హైబ్రిడ్ సెడాన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రూ. 66.10 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ కార్ లీటరుకు 25.22 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తూ లగ్జరీ, పొదుపు రెండింటినీ సమకూరుస్తోంది. భారతదేశంలోనే స్వయంగా అసెంబుల్ చేస్తున్న ఈ 8వ జనరేషన్ ఇఎస్ 350హెచ్ మోడల్‌ను కంపెనీ రెండు ప్రధాన వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఎక్స్‌క్విజిట్ ప్రారంభ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 66.10 లక్షలుగా నిర్ణయించగా, టాప్ వేరియంట్ లగ్జరీ ధరను రూ. 71.80 లక్షలుగా పేర్కొన్నారు. ఇందులో సెల్ఫ్-ఛార్జింగ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను అమర్చారు. కారు ప్రయాణిస్తున్న సమయంలోనే బ్యాటరీ ఆటోమేటిక్ గా రీఛార్జ్ అవుతుంది. ప్రత్యేకంగా బయట ఛార్జింగ్ స్టేషన్లలో ప్లగ్ పెట్టాల్సిన అవసరం లేకపోవడం దీని ప్రధాన ప్రత్యేకత.
పవర్ఫుల్ ఇంజిన్, అసాధారణ మైలేజ్
ఈ కార్‌లో 2.5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు పవర్ఫుల్ ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు. పెట్రోల్ ఇంజిన్ 139 కిలోవాట్ల పవర్, 237 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ 119.1 కిలోవాట్ల పవర్ జోడిస్తుంది. లిథియం-అయాన్ బ్యాటరీ, నూతన ఈ-యాక్సిల్ టెక్నాలజీతో నడిచే ఈ సెడాన్ లీటరుకు 25.22 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని ఏఆర్ఏఐ ధృవీకరించింది. ప్రయాణంలో సౌండ్ లేని నిశ్శబ్ద వాతావరణాన్ని, స్పీడ్ డ్రైవింగ్ అనుభూతిని ఈ సిస్టమ్ ఇస్తుంది.
మునుపటి కంటే పెద్దదిగా రాజసం ఒలికే డిజైన్
పాత మోడళ్లతో పోలిస్తే కొత్త లెక్సస్ పొడవు, వెడల్పు పెరిగాయి. ఈ కారు పొడవు 5,145 మిమీ, వెడల్పు 1,920 మిమీ, ఎత్తు 1,575 మిమీ కాగా 2,950 మిమీ సుదీర్ఘ వీల్‌బేస్ కలిగి ఉంది. పెరిగిన పరిమాణం వల్ల కేబిన్ లోపల కాళ్లు చాపుకుని కూర్చునేందుకు విశాలమైన స్థలం లభిస్తుంది. ముందరి భాగంలో సరికొత్త ట్విన్ ఎల్ సిగ్నేచర్ ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్ లైట్లు, వెనుక భాగంలో ఆకర్షణీయమైన ఎల్ సిగ్నేచర్ లైట్లు కారుకి కొత్త మిసమిసలను తెచ్చిపెట్టాయి. సురక్షిత ప్రయాణానికి సేఫ్ ఎగ్జిట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ డోర్ లాచ్ ఫీచర్లు జోడించారు.
14 అంగుళాల స్క్రీన్, అల్ట్రా సేఫ్టీ ఫీచర్లు
డ్రైవర్ దృష్టి రోడ్డు నుంచి మరలకుండా తజునా కాక్‌పిట్ డిజైన్ ఆధారంగా కేబిన్ రూపుదిద్దుకుంది. మధ్యలో భారీ 14 అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. సేఫ్టీ విభాగంలో లెక్సస్ సేఫ్టీ సిస్టమ్+ తో పాటు 8 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా లభిస్తాయి. లేన్ డిపార్చర్ అలర్ట్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మానిటర్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మొబైల్ యాప్ ద్వారా రిమోట్ స్టార్ట్, ఏసీ కంట్రోల్ సదుపాయాలు పొందవచ్చు. వాహనానికి, బ్యాటరీకి 8 ఏళ్లు లేదా 2 లక్షల కిలోమీటర్ల వారంటీని కంపెనీ అందిస్తోంది.

