Lexus : రాకెట్ లాంటి వేగం.. రాజభవనం లాంటి సౌకర్యం.. లెక్సస్ కొత్త ఈవీ మామూలుగా లేదుగా
లెక్సస్ కొత్త ఈవీ మామూలుగా లేదుగా

Lexus : జపాన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ భారత మార్కెట్లోకి తన మొట్టమొదటి కంప్లీట్ ఎలక్ట్రిక్ సెడాన్ Lexus ES 500e ని అధికారికంగా విడుదల చేసింది. విలాసానికి మారుపేరుగా నిలిచే ఈ కారు ధరను రూ.89.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2025లో పరిచయమైన ఈ 8వ జనరేషన్ మోడల్, ఇప్పుడు భారత రోడ్లపై పరుగులు తీయడానికి సిద్ధమైంది. ఇప్పటికే లెక్సస్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న RX, NX, LX వంటి ఎస్‌యూవీల సరసన ఈ కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ చేరింది. ఇది మార్కెట్లో బీఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెస్ బెంజ్ వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
పవర్‌ఫుల్ బ్యాటరీ.. అదిరిపోయే పర్ఫార్మెన్స్
లెక్సస్ ES 500e కారులో 74.4 kWh సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. కారు బ్యాలెన్స్ కోసం ఈ బ్యాటరీని కారు ఫ్లోర్ కింద అమర్చడం విశేషం. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ముందు వైపు ఉన్న మోటార్ 221 hp, వెనుక వైపు ఉన్న మోటార్ 118 hp పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి రెండూ కలిసి మొత్తం 338 hp శక్తిని అందిస్తాయి. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ కారు సుమారు 440 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కేవలం 5.1 సెకన్లలోనే సున్నా నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత.
DIRECT4 సిస్టమ్.. అదే దీని స్పెషాలిటీ
ఈ కారులో లెక్సస్ ప్రత్యేకంగా రూపొందించిన DIRECT4 ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను అందించింది. ఇది కారు వేగం, స్టీరింగ్ కదలికల ఆధారంగా ముందు, వెనుక చక్రాలకు పవర్‌ను (టార్క్) పంపిణీ చేస్తుంది. కారు స్టార్ట్ చేసినప్పుడు లేదా వేగంగా వెళ్తున్నప్పుడు 60:40 నుంచి 40:60 నిష్పత్తిలో టార్క్‌ను అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల కారు ప్రయాణం చాలా స్మూత్‌గా ఉండటమే కాకుండా, మలుపుల వద్ద కారు అదుపు తప్పకుండా ఉంటుంది.
డిజైన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
లెక్సస్ కార్లకే ప్రత్యేకమైన స్టైలిష్ లుక్ ఈ మోడల్‌లోనూ కనిపిస్తుంది. కొత్త ఫ్రంట్ బంపర్, ఎల్-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, జెడ్-షేప్ టర్న్ ఇండికేటర్లతో కారు ముందు భాగం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. గ్రిల్‌కు ఇచ్చిన కొత్త డైమండ్ ప్యాటర్న్ డిజైన్ కారుకు లగ్జరీ లుక్ ఇస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త అలాయ్ వీల్స్, వెనుక వైపు రెండు టెయిల్ లైట్లను కలిపే ఎల్ఈడీ లైట్ బార్ కారు అందాన్ని మరింత పెంచాయి.
ఇంటి లోపల లగ్జరీ క్యాబిన్
కారు లోపలి భాగం చాలా మోడ్రన్‌గా, లగ్జరీగా ఉంటుంది. ఇందులో 14-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), అంబియంట్ లైటింగ్, మెమరీ ఫీచర్‌తో కూడిన పవర్ ఫ్రంట్ సీట్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ముందు సీట్లలో కూలింగ్ మరియు హీటింగ్ ఆప్షన్లు కూడా ఉండటం వల్ల ప్రయాణికులకు గరిష్ట సౌకర్యం లభిస్తుంది.

