Electric Cars: పెట్రోల్, డీజిల్ కార్లకు టాటా చెబుతున్న కోటీశ్వరులు.. భారత్‌లో రూ.2 కోట్ల ఎలక్ట్రిక్ కార్ల జోరు
భారత్‌లో రూ.2 కోట్ల ఎలక్ట్రిక్ కార్ల జోరు

Electric Cars: ఎలక్ట్రిక్ కార్లు అంటే కేవలం పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగుల్చుకోవడానికి మాత్రమే కొంటారనే రోజులు పోయాయి. ఇప్పుడు భారత మార్కెట్లో కోటీశ్వరులు, లగ్జరీ కార్ లవర్స్ కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ బెంజ్, ఆడీ వంటి దిగ్గజ కంపెనీలతో పాటు కొత్త బ్రాండ్లు కూడా ఖరీదైన ఈవీ మోడళ్లను తీసుకొస్తున్నాయి. కస్టమర్లకు ఇప్పుడు కేవలం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు, సెడాన్లు మాత్రమే కాకుండా లగ్జరీ లిమోజిన్లు, సూపర్ ఫాస్ట్ స్పోర్ట్స్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని కార్ల ధర రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు పలుకుతోంది.
దూసుకెళ్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు
గణాంకాల ప్రకారం 2025లో మన దేశంలో సుమారు 52,000 లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయి. ఇందులో 15 శాతం వాటా ఎలక్ట్రిక్ కార్లదే కావడం విశేషం. ముఖ్యంగా బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 7 సిరీస్ మొత్తం అమ్మకాల్లో ఎలక్ట్రిక్ 'i7' వాటా దాదాపు 50 శాతంగా ఉంది. అంతేకాదు, భారత్‌లో బీఎండబ్ల్యూ మొత్తం సేల్స్‌లో నాలుగో వంతు ఎలక్ట్రిక్ వాహనాల నుంచే వస్తున్నాయి. రూ.1.95 కోట్ల ధర ఉన్న బీఎండబ్ల్యూ i7 కోసం కస్టమర్లు రెండు నుంచి మూడు నెలల పాటు వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఎంజీ మోటార్ కూడా ఎంజీ సెలక్ట్ పేరుతో ప్రత్యేక షోరూమ్‌లు ఏర్పాటు చేసి సైబర్ స్టర్ స్పోర్ట్స్ కారు, M9 లగ్జరీ లిమోజిన్లను సుమారు 4,000 యూనిట్లు విక్రయించింది.
మెర్సిడెస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు ఫుల్ డిమాండ్
మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ GLC ఎస్‌యూవీకి భారత్‌లో 1,000కి పైగా బుకింగ్స్ వచ్చాయి. డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే 2027 మార్చి వరకు స్టాక్ మొత్తం అమ్ముడైపోయింది. దీంతో జర్మనీలోని ప్రధాన ప్లాంట్ నుంచి అదనపు కార్లను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే మూడేళ్లలో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కలిపి 40 కొత్త మోడళ్లను పరిచయం చేయాలని మెర్సిడెస్ ప్లాన్ చేస్తోంది. సప్లై సరిగ్గా ఉంటే తమ మొత్తం అమ్మకాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 25 నుంచి 30 శాతానికి చేరుతుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశారు.
భారత్ ను టార్గెట్ చేస్తున్న BYD, హ్యుందాయ్
చైనా ఆటో దిగ్గజం BYD తన లగ్జరీ బ్రాండ్ డెంజా ద్వారా భారత్‌లో సత్తా చాటుతోంది. రూ.90 లక్షల విలువైన డెంజా D9 ఎలక్ట్రిక్ ఎంపీవీతో పాటు రూ.1.5 కోట్ల ధర ఉన్న Z9 GT మోడళ్లను తీసుకొచ్చింది. ప్రీమియం ఎంపీవీ సెగ్మెంట్లో రెండేళ్ల క్రితం ఏడాదికి 1,000 కార్లు మాత్రమే అమ్ముడయ్యేవి, ఇప్పుడు ఆ సంఖ్య 5,000లకు చేరింది. మరోవైపు హ్యుందాయ్ కూడా తన లగ్జరీ బ్రాండ్ జీనిసిస్ ను భారత్‌కు తెచ్చే ఆలోచనలో ఉంది. రూ.2 కోట్లకు పైగా ధర ఉండే జీసిసెస్ GV90 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో మెర్సిడెస్ మే బ్యాక్ EQS, రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది.
2033 నాటికి 5 రెట్లు పెరగనున్న మార్కెట్
ఆటోమొబైల్ రంగ నిపుణుల అంచనా ప్రకారం భారత్‌లో రూ.45 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ రాబోయే రోజుల్లో భారీగా విస్తరించనుంది. ప్రస్తుతం ఏడాదికి సుమారు 7,000 యూనిట్లు అమ్ముడవుతుండగా, 2033 నాటికి ఇది ఐదు రెట్లు పెరిగి ఏటా 35,000 కార్లకు చేరే అవకాశం ఉంది. కొత్త మోడళ్ల రాక, విదేశాలతో కుదుర్చుకుంటున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు, ఎలక్ట్రిక్ వాహనాలపై కేవలం 5 శాతం GST ఉండటం ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

